మార్కెట్‌యార్డుల్లో వినూత్న సంస్కరణలు
గోడౌన్లలో రైతుల ధాన్యానికి రుణం రూ.2లక్షలకు పెంపు
అవసరమైతే నాబార్డు సాయంతో మరిన్ని గోడౌన్లు నిర్మిస్తాం : మంత్రి హరీశ్‌రావు
మార్కెట్‌యార్డులపై నివేదికను సమర్పించిన పూనం కమిటీ
హైదరాబాద్: రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు మార్కెట్‌యార్డులలో మూడుదశల్లో వినూత్న సంస్కరణలను అమలు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. గోడౌన్లలో రైతులు నిల్వచేసే ధాన్యంపై ఇచ్చే రుణాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు ఆయన వెల్లడిం చారు. శుక్రవారం సచివాలయంలో ‘రైతుబంధు’ పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోడౌన్లలో నిల్వధాన్యం రుణంపై ఉన్న మూడునెలలు గడువును ఆరునెలలకు పెంచుతున్నామని మంత్రి తెలిపారు. పత్తికి మద్దతుధరను మరింతగా పెంచేలా కేంద్రప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పారు. మార్కెట్‌యార్డులలో తేవాల్సిన సంస్కరణలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్య నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను ఈ సం దర్భంగా మంత్రి హరీశ్‌రావుకు అందచేసింది.
కర్ణాటక కన్నా మెరుగైన విధానం...
కర్ణాటక మార్కెట్‌యార్డులలో రైతుల నుంచి పత్తి, వరి, మొక్కజొన్న కొనుగోలు విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, దానికంటే కూడా మెరుగైన వ్యవస్థను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నట్టు హరీశ్ వివరించారు. మార్కెట్‌యార్డుల ప్రవేశద్వారం వద్దనే రైతులు తీసుకు వచ్చిన ఉత్పత్తులను నమోదు చేసుకోవడం,తూకంలో మోసాలు జరగకుండా ఎలక్ట్రానిక్ మిషన్లను అమర్చడం, మార్కెట్‌యార్డుల్లో ఆ రోజు రైతుల నుంచి కొనుగోలు చేసే ఉత్పత్తుల ధరలను ఆన్‌లైన్‌లో పేర్కొనడం వంటి మార్పులు తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాలలో ఉన్న ఉత్పత్తుల ధరలను ప్రతిరోజూ తెలియజేయడం వల్ల ఎక్కడ గిట్టుబాటు ధర అనిపిస్తే అక్కడ విక్రయించుకోవడానికి రైతులకు వీలవుతుందని ఆయన వివరించారు. ఇందుకోసం అన్ని మార్కెట్‌యార్డులలో ప్రత్యేకంగా తెరలను ఏర్పాటు చేస్తామన్నారు. దీని వలన రైతులకు, కమిషన్ ఏజంట్లకు, వ్యాపారులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావం ఉన్నప్పటికీ కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పది లక్షల ఎకరాలలో వరి పండిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గోడౌన్ల కొరత లేదన్నారు. ఇంకా వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ , నాబార్డ్ సంస్థల సహాయంతో మరిన్ని గోడౌన్లు నిర్మిస్తామని తెలిపారు. మార్కెట్ యార్డులలో దళారుల బెడదనుతొలగించడానికే ఈ సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు.