చౌకదుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలు
పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తం గా 16,560 రేషన్ దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడిం చారు. వీటి వాడకంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దుకాణాల్లో స్టాకు వివరాలను సమీక్షించేందుకు ఉపకరిస్తుందన్నారు. దీంతో ఏటా ప్రభుత్వానికి 15–20 శాతం ఖర్చు తగ్గుతుందని, రూ.800 కోట్ల వరకు ఆదా అవుతుందన్నారు.
చెన్నై ఒయాసిస్ కంపెనీకి టెండర్లు: పీవోఎస్ యంత్రాలను సమకూర్చేందుకు నిర్వహించిన టెండర్లను శనివారం ఖరారు చేశామని ఆనంద్ తెలిపారు. ఒక్కో పీవో ఎస్ యంత్రాన్ని ప్రతి నెలా రూ.1,499 ధరతో అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చి న చెన్నైకి చెందిన ఒయాసిస్ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకుందన్నారు. ఈ అద్దె ను పౌర సరఫరాల శాఖే చెల్లిస్తుందన్నారు. మరో 2 కంపెనీలు వరుసగా రూ.1,548, రూ.1,775 రేటుకు టెండర్లు దాఖలు చేశాయన్నారు.
నగరంలో ప్రస్తుతం వేలి ముద్రలకే పరిమితమైన ఈ–పాస్ యంత్రాల కోసం ప్రతి నెలా రూ.1,650 అద్దెను చెల్లిస్తున్నామన్నారు. వీటిని నగదురహిత లావాదేవీల కోసం వినియోగిం చేలా మార్పులుచేశామన్నారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించడంతో ఒక్కో యంత్రంపై రూ.151 చొప్పున నెలకు రూ.24లక్షలు, ఏడాదికి రూ.3 కోట్లు ఆదా అవుతుందన్నారు. కొందరు వినియోగదారుల వేలి ముద్రలు చెరిగిపోయి సమస్యలు వస్తుండడంతో ఐరీష్, వాయిస్ ఓవర్ విధానాన్ని కూడా తీసుకువస్తున్నామన్నారు.
మిషన్ ఏర్పాటు చేసుకొంటే: రేషన్ డీలర్ స్వయంగా ఈపాస్ మిషన్ ఏర్పాటు చేసుకుంటే క్వింటాల్‌కు రూ.17 చెల్లిస్తామని, అందులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తాయన్నారు. అద్దె ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే యంత్రాలను అందిస్తుం డడంతో కేంద్రం ఇచ్చే రూ.8.50 రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుందన్నారు. మార్చి 31లోగా అన్ని రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల అమలుకు కేంద్ర మంత్రి గడువు విధించారని సీవీ ఆనంద్ తెలిపారు.
ఏఈపీఎస్ విధానం ఇలా: ప్రతి కార్డుదారుడు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. సరుకులు పంపిణీ చేసిన డీలర్ లబ్ధిదారుని ఆధార్ నంబర్‌తో పాటు బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఏఈపీఎస్ సిస్టమ్‌లో పొందుపరుస్తాడు. దీంతో సరుకులకు సరిపడా డబ్బులు లబ్ధిదారుడి ఖాతా నుంచి డీలర్ ఖాతాకు జమవుతాయి. చౌక ధరల దుకాణాల ద్వారా బ్యాకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామని ఆనంద్ తెలిపారు.