swiping machine
-
‘క్లోన్’ చేసి రూ.కోటి కొట్టేశారు!
► క్రెడిట్, డెబిట్ కార్డుల్నిక్లోనింగ్ చేసిన ముఠా ► స్వైపింగ్ మెషీన్ల ద్వారా రూ.కోటి స్వాహా ► నలుగురి అరెస్టు సాక్షి, హైదరాబాద్: కరెంట్ ఖాతాల ఆధారంగా బ్యాంక్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ మెషీన్లు తీసుకు ని క్లోనింగ్ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోట్ల స్వాహా చేసిన అంతర్రాష్ట్ర ముఠాను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. కరెంట్ ఖాతాల ద్వారా.. నగరానికి చెందిన మామిడి మహేశ్ జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్‌లో 4 కరెంట్ ఖాతాలు తెరిచి.. వ్యాపార లావాదేవీలకు ఫిబ్రవరిలో నాలుగు స్వైపింగ్ మెషీన్లు తీసుకున్నాడు. ఓ కేసులో నిందితునిగా ఉన్న మహేశ్‌కు ఇటీవలే కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో జైలుకు వెళ్తూ తన స్వైపింగ్ మెషీన్లను స్నేహితుడైన కిరణ్‌కుమార్‌కు అప్పగించాడు. వనస్థలిపురం లో చిన్న దుకాణం నడుపుతున్న కిరణ్‌కు కొన్నాళ్ల క్రితం చాంద్‌పాషాతో పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్ చేసిన క్రెడిట్, డెబిడ్ కార్డులతో పాటు పిన్ నంబర్, డేటా వస్తుందని అతను కిరణ్‌తో చెప్పాడు. స్వైపింగ్ మెషీన్లు తనకిస్తే లావాదేవీలపై 10 శాతం కమీషన్ ఇస్తానంటూ ఎర వేశాడు. కమీషన్ కోసం పక్కదారి.. కమీషన్ కోసం కిరణ్ స్వైపింగ్ మెషీన్లను పాషాకు అప్పగించాడు. పాషా వాటిని కేరళకు చెందిన అబుబాకర్‌కు అందించాడు. కేరళలోని యూసుఫ్ నుంచి క్లోన్డ్ కార్డుల్ని తీసుకుంటున్న ఇతను వాటిని స్వైపింగ్ మెషీన్లలో స్వైప్ చేస్తూ నిర్ణీత మొత్తం మహేశ్ కరెంట్ ఖాతాల్లో పడేలా చేస్తున్నాడు. కిరణ్ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలినది అబుబాకర్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అబుబాకర్ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలింది యూసుఫ్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. ఈ వ్యవహారాల్లో కిరణ్‌కు రామ్‌ప్రసాద్.. అబుబాకర్‌కు కేరళకే చెందిన హనీఫ్ హంజా సహకరించారు. రెండు నెలల్లో రూ.కోటి స్వైప్ ఈ గ్యాంగ్ రెండు నెలల్లో అనేక మంది క్లోన్డ్ కార్డులను వినియోగించి రూ.1.1 కోట్లు స్వాహా చేసింది. జేఅండ్‌కే బ్యాంక్ జారీ చేసిన స్వైపింగ్ మెషీన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలి యకుండానే వారి కార్డుల్ని క్లోన్ చేసి, నగదు కాజేస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. దీంతో జేఅండ్‌కే బ్యాంక్ అధికారి మహ్మద్ అల్తాఫ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీ సులు కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. జైల్లో ఉన్న మహేశ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్‌తో పాటు చాంద్‌పాషా కోసం గాలిస్తున్నారు. -
మూన్నాళ్ల ముచ్చటే..!
– అలంకారప్రాయంగా స్వైపింగ్ మిషన్లు – రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మూలనపడ్డ యంత్రాలు – వినియోగించని సిబ్బంది..పట్టించుకోని అధికారులు – సాంకేతిక కారణాలు చూపుతున్న వైనం – ‘నగదు’కే అలవాటు పడుతున్న పరిస్థితి నగదు రహిత లావాదేవీల కోసం తెచ్చిన స్వైపింగ్ మిషన్లు మూలనపడ్డాయి. ‘యథారాజా తథాప్రజా’ అన్న చందంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వాటి వినియోగానికి ఆసక్తి చూపకపోవడంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆర్భాటంగా తీసుకొచ్చిన యంత్రాలన్నీ అలంకారప్రాయంగా మిగిలాయి. - అనంతపురం టౌన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నగదు రహిత లావాదేవీలు చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం స్థిరాస్తి హక్కుదారులు, వాటి కొనుగోలుదారులు ఎన్‌కంబర్స్‌మెంట్ సర్టిఫికెట్ (ఈసీ), నకళ్లు పొందడం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్వైపింగ్ మిషన్లు పంపిణీ చేసింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రతినిధులు నగదు రహిత లావాదేవీలు ఎలా నిర్వహించాలో సబ్ రిజిస్ట్రార్లకు శిక్షణ కూడా ఇచ్చారు. సాధారణంగా ఈసీ, నకళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి నగదు తీసుకుని రసీదు ఇస్తుంటారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇది జరగడం లేదు. ఫలితంగా కోరుకున్న సమాచారం కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ కష్టాలకు చెక్ పెట్టడం కోసం స్వైపింగ్ మిషన్లు ప్రవేశపెట్టారు. ఇవి వినియోగంలో ఉంటే నగదు రహిత లావాదేవీలు జరిపే సమయంలో బిల్లు వస్తుంది. సిటిజన్ చార్టర్ ప్రకారం ఈ బిల్లు తీసుకున్న వారికి కంప్యూటర్ ఈసీ/నకలు గంటలోగా ఇవ్వాల్సి ఉంటుంది. మాన్యువల్ అయితే 24 గంటల్లోగా అందజేయాలి. నిబంధనల ప్రకారం కంప్యూటర్ ఈసీ గానీ, నకలు గానీ దరఖాస్తు చేసుకున్న గంటలోగా ఇవ్వకపోతే సదరు ఉద్యోగి ప్రతి గంటకూ రూ.10 చొప్పున దరఖాస్తుదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్ విషయంలో కూడా 24 గంటల్లోగా ఇవ్వకుంటే రూ.50 ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మూడేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. అయితే సిటిజన్ చార్టర్ ఎక్కడా అమలవుతున్న పరిస్థితి లేదు. తాజాగా స్వైపింగ్ మిషన్లు అందుబాటులోకి తెచ్చినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ‘నగదు’ లావాదేవీలకే ఇష్టపడుతున్నారు. ఇదేమని అడిగితే సాంకేతిక కారణాలు చూపుతున్నారు. ఈసీ, నకలు కోసం స్వైప్ చేస్తే దరఖాస్తుదారుడి సొమ్ము నేరుగా ప్రభుత్వ ఖాతా (మెయిన్ అకౌంట్)లో పడుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించిన ఖాతాల్లోనే ఈ నగదు పడాల్సి ఉంది. స్వైపింగ్ యంత్రాల వాడకం ప్రారంభించిన మొదట్లోనే ఈ సమస్యను గుర్తించిన అధికారులు ఆ తర్వాత ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఆ తర్వాత దీని గురించే మరచిపోయారు. ఇదే మంచి తరుణం అన్నట్లు నగదు రహితానికి రాంరాం చెప్పగా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా స్వైపింగ్ మిషన్లను వాడడం లేదు. మెయిన్ అకౌంట్లో పడుతోంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నగదు రహిత లావాదేవీల వల్ల అందరికీ మేలే జరుగుతుంది. పనులు కూడా తొందరగా అవుతాయి. స్వైపింగ్ మిషన్లలో స్వైప్ చేస్తుంటే ఆ డబ్బు విజయవాడలోని ప్రధాన ఖాతాలోకి వెళ్తోంది. దీని వల్ల అందరికీ సమస్యే. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సాధ్యమైనంత తొందరగా వినియోగంలోకి తీసుకొస్తాం. ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా సేవలు అందిస్తున్నాం. – సులేమాన్, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
చౌకదుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలు
పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తం గా 16,560 రేషన్ దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడిం చారు. వీటి వాడకంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దుకాణాల్లో స్టాకు వివరాలను సమీక్షించేందుకు ఉపకరిస్తుందన్నారు. దీంతో ఏటా ప్రభుత్వానికి 15–20 శాతం ఖర్చు తగ్గుతుందని, రూ.800 కోట్ల వరకు ఆదా అవుతుందన్నారు. చెన్నై ఒయాసిస్ కంపెనీకి టెండర్లు: పీవోఎస్ యంత్రాలను సమకూర్చేందుకు నిర్వహించిన టెండర్లను శనివారం ఖరారు చేశామని ఆనంద్ తెలిపారు. ఒక్కో పీవో ఎస్ యంత్రాన్ని ప్రతి నెలా రూ.1,499 ధరతో అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చి న చెన్నైకి చెందిన ఒయాసిస్ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకుందన్నారు. ఈ అద్దె ను పౌర సరఫరాల శాఖే చెల్లిస్తుందన్నారు. మరో 2 కంపెనీలు వరుసగా రూ.1,548, రూ.1,775 రేటుకు టెండర్లు దాఖలు చేశాయన్నారు. నగరంలో ప్రస్తుతం వేలి ముద్రలకే పరిమితమైన ఈ–పాస్ యంత్రాల కోసం ప్రతి నెలా రూ.1,650 అద్దెను చెల్లిస్తున్నామన్నారు. వీటిని నగదురహిత లావాదేవీల కోసం వినియోగిం చేలా మార్పులుచేశామన్నారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించడంతో ఒక్కో యంత్రంపై రూ.151 చొప్పున నెలకు రూ.24లక్షలు, ఏడాదికి రూ.3 కోట్లు ఆదా అవుతుందన్నారు. కొందరు వినియోగదారుల వేలి ముద్రలు చెరిగిపోయి సమస్యలు వస్తుండడంతో ఐరీష్, వాయిస్ ఓవర్ విధానాన్ని కూడా తీసుకువస్తున్నామన్నారు. మిషన్ ఏర్పాటు చేసుకొంటే: రేషన్ డీలర్ స్వయంగా ఈపాస్ మిషన్ ఏర్పాటు చేసుకుంటే క్వింటాల్‌కు రూ.17 చెల్లిస్తామని, అందులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తాయన్నారు. అద్దె ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే యంత్రాలను అందిస్తుం డడంతో కేంద్రం ఇచ్చే రూ.8.50 రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుందన్నారు. మార్చి 31లోగా అన్ని రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల అమలుకు కేంద్ర మంత్రి గడువు విధించారని సీవీ ఆనంద్ తెలిపారు. ఏఈపీఎస్ విధానం ఇలా: ప్రతి కార్డుదారుడు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. సరుకులు పంపిణీ చేసిన డీలర్ లబ్ధిదారుని ఆధార్ నంబర్‌తో పాటు బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఏఈపీఎస్ సిస్టమ్‌లో పొందుపరుస్తాడు. దీంతో సరుకులకు సరిపడా డబ్బులు లబ్ధిదారుడి ఖాతా నుంచి డీలర్ ఖాతాకు జమవుతాయి. చౌక ధరల దుకాణాల ద్వారా బ్యాకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామని ఆనంద్ తెలిపారు. -
కార్డున్నా సరే... క్యాష్‌తోనే పని..!
మాటిమాటికీ మొరాయిస్తున్న స్వైపింగ్ మెషిన్లు... - మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇదేతీరు - ప్రాసెసింగ్.... డిక్లెయిన్ అంటూ నిలిచిపోతున్న మెషిన్లు - చివరకు కొనుగోలు చేయకుండానే వెనుదిరుగుతున్న కస్టమర్లు - కొన్నిచోట్ల అందుబాటులో నగదు మేరకు సరుకులిస్తున్న పరిస్థితి - పేటీఎం నుంచి బ్యాంకు ఖాతాలో వెనువెంటనే జమకాని నగదు... - కుదేలవుతున్న వ్యాపారాలు, భారీగా పడిపోతున్న అమ్మకాలు అత్యవసర పనిమీద వెళ్తున్న మోహన్ మొయినాబాద్‌లోని ఐఓసీ పెట్రోల్ బంక్‌లో రూ.300 పెట్రోల్ పోయించుకున్నాడు. తనవద్దనున్న ఎస్బీఐ డెబిట్ కార్డును క్యాషియర్‌కు ఇచ్చాడు. ఆ కార్డును స్వైప్ చేసి రూ.300 ఎంట్రీ చేసిన తర్వాత మోహన్ పిన్‌నంబర్ ఎంట్రీ చేయగానే... సెకన్ల వ్యవధిలో డబ్బులు కట్ అయినట్లు ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వచ్చింది. కానీ స్వైపింగ్ మెషిన్లో మాత్రం ట్రాన్జాక్షన్ ఫెయిల్ అని ప్రత్యక్ష్యమయ్యింది. దీంతో ఎమర్జెన్సీ పనిపై దృష్టిపెట్టాల్సిన మోహన్... చివరకు బంకు యాజమాన్యంతో గొడవకు దిగాల్సివచ్చింది. ఇంట్లో బీపీ మాత్రలు అయిపోవడంతో కొనుగోలు చేయడానికి కుమార్ మెడికల్ షాప్‌కు వెళ్ళాడు. మందులు తీసుకున్న తర్వాత రూ.2వేలకు చిల్లర లేదని షాప్ కీపర్ చెప్పడంతో తనదగ్గరున్న డెబిట్ కార్డును తీసి ఇచ్చాడు. షాప్కీపర్ దాన్ని స్వైప్ చేశాడు. పదిహేను నిమిషాలైనా ప్రాసెసింగ్ అంటూ... ఆతర్వాత డిక్లయిన్డ్ అని ఆ మెషిన్ సెలవిచ్చింది. దీంతో చేసేదేంలేక మందులు తిరిగి ఇచ్చేసి ఇంటికి వెనుదిరిగాడు కుమార్. సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తెచ్చిన క్యాష్‌లెస్ విధానం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. నగదు రహిత చెల్లింపులవైపు మళ్లించేందుకు బ్యాంకర్లు వ్యాపారులకు స్వైపింగ్ మెషిన్లు ఇస్తున్నారు. కానీ వాటి పనితీరు అధ్వాన్నంగా ఉండటంతో అటు విక్రేతలు, ఇటు కొనుగోలుదారులకు చికాకు తెప్పిస్తోంది. పలుమార్లు హ్యాంగ్ కావడం, ప్రాసెసింగ్ దశలో ఎక్కువ సమయం తీసుకోవడం, చివరకు ట్రాన్జాక్షన్ డిక్లెయిన్డ్ కావడంతో ఇరువర్గాల్లో ఓపిక నశించిపోతోంది. కొన్నిసందర్భాల్లో కార్డుదారుడి ఖాతాలో నగదు డెబిట్ అయినప్పటికీ.. అది దుకాణదారు ఖాతాలో జమకాకపోవడంతో వాగ్వాదాలకు దారితీస్తోంది. చివరకు కొనుగోలుచేసిన సరుకులు తిరిగివ్వడమో.. లేక అందుబాటులో నగదు ఉన్నంత మేరకే కొనుగోలు చేయడమో జరుగుతోంది. ఈ ప్రక్రియతో వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. పతనం 40 శాతం పైమాటే..! డిమానిటైజేషన్ ప్రభావంతో చిల్లర వ్యాపారం భారీగా దెబ్బతింది. ఇప్పటివరకు మార్కెట్లోకి రూ.2వేల నోట్లే ఎక్కువగా వచ్చాయి. వీటికి చిల్లర ఇవ్వలేక వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. చిల్లర తెచ్చుకున్న వారికే సరుకులు విక్రయిస్తున్నారు. దీంతో అమ్మకాల తీరు దారుణంగా పడిపోతోంది. కొన్నిచోట్ల స్వైపింగ్ మెషిన్లు పెట్టి వ్యాపారాన్ని దారిమళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... అవి మాటిమాటికీ మొరాయించడంతో చేదు అనుభవమే మిగులుతోంది. వనస్థలిపురంలోని వినాయక కిరాణా దుకాణం యజమాని రాజేష్ రోజుకు సగటున రూ.8వేల నుంచి రూ.10వేలు విక్రయించేవాడు. నోట్ల రద్దు నాటినుంచి రూ.5వేలు దాటడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. చాలినంత నగదు అందుబాటులోకి వస్తే తప్ప నష్టాల నుంచి గట్టెక్కలేమని వాపోయాడు. బ్యాంకు ఖాతాకు జమకాని నగదు.. డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో పేటీయం యాప్ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. బార్కోడ్, ఫోన్ నంబర్ల ద్వారా నగదు లావాదేవీలు సులభతరంగా జరుగుతున్నప్పటికీ.. యాప్‌లో ఉన్న నగదును బ్యాంకు ఖాతాలోకి మార్చుకోవడం మాత్రం కష్టంగా మారింది. ఈ ప్రక్రియలో గరిష్టంగా వారం రోజుల సమయం పడుతుంది. పేటీఎం ద్వారా నేరుగా ఇతరుల బ్యాంకు ఖాతాకు నగదు పంపిణీ చేయడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. మంచి టైంలో సతాయిస్తోంది... ఉదయం, సాయంత్రం గిరాకీ ఉంటుంది. ఎక్కువ కస్టమర్లు ఉద్యోగులే కావడంతో కార్డులు ఇస్తున్నారు. ఉదయం వేళ స్వైపింగ్ మెషిన్ల పనితీరు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ... మధ్యాహ్నం తర్వాత మాత్రం చాలా ఇబ్బంది పెడుతోంది. ఆంధ్రాబ్యాంకు నుంచి మెషిన్ తీసుకున్నా. కానీ ఆ బ్యాంకు కార్డులను కూడా కొన్నిసార్లు అంగీకరిస్తలేదు. దీంతో నగదు తీసుకోవడమో.. లేక తర్వాత తెచ్చివ్వమనో చెబుతున్నాం. – ప్రసాద్, టిఫిన్ సెంటర్, బంజారాహిల్స్ ముందే పరిశీలిస్తున్నాం స్వైపింగ్ మెషిన్లతో సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. రద్దీ సమయంలో మెషిన్లు మొరాయించడంతో కస్టమర్లను మేనేజ్ చేయలేకపోతున్నాం. లావాదేవీలు రద్దయినట్లు యంత్రంలో చూపిస్తున్నప్పటికీ... కార్డుదారుల ఖాతాలో డబ్బులు ఖర్చయినట్లు మెసేజ్ వస్తోంది. దీంతో వాళ్లతో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ముగ్గురితో ఇదే సమస్యతో వాగ్వాదం జరిగింది. చివరకు ఇద్దరికి చేతినుంచి డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా కార్డులను పరిశీలించిన తర్వాతే పెట్రోల్, డీజిల్ పోస్తున్నాం. – సుదర్శన్, క్యాషియర్, ఐఓసీ పెట్రోల్‌బంక్, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా సరుకులు వాపస్ తీసుకుంటున్నాం షాప్‌కు వచ్చే ఖాతాదారులు పెద్ద మొత్తంలో బిల్లు చేస్తారని స్వైపింగ్ మెషిన్ తీసుకున్నాం. నోట్ల రద్దు ప్రకటనకు వారం రోజుల ముందే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మెషిన్కోసందరఖాస్తు పెట్టుకుంటే వారం తర్వాత వచ్చింది. దీంతో నాకు నోట్లతో పని ఉండదనుకున్నా. కానీ మెషిన్ పనితీరు అస్సలు బాగాలేదు. రోజుల తరబడి పనిచేయదు. బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తే కస్టమర్ కేర్ నంబర్‌కు చేయమని చెప్తాడు. కస్టమర్ కేర్ నంబర్ కలిస్తే ఒట్టు. ఈరోజు మధ్యాహ్నం ఒక కస్టమర్ రూ.7వేలు బిల్లు చేసి కార్డు ఇచ్చాడు. అది పనిచేయకపోవడంతో సరుకులన్నీ వాపస్ తీసుకున్నా. – జంగయ్య, సాయిలీల హార్డ్‌వేర్ షాప్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా -
స్వైపింగ్.. కమీషన్
* మినీ ఏటీఎంలుగా ‘స్వైపింగ్’ * నరసరావుపేటలో దందా నరసరావుపేట ఈస్ట్ : పెద్దనోట్ల రద్దు కష్టాలు రోజురోజుకో మలుపులు తిరుగుతున్నాయి. పట్టణంలో పెట్రోల్ బంక్‌లు, షాపింగ్ మాల్స్ మినీ ఏటీఎంలుగా మారాయి. రూ. 2 వేల నోట్లకు చిల్లర లేక అల్లాడుతున్న ప్రజలకు స్వైపింగ్ మిషన్లే దిక్కయ్యాయి. రూ. 2 వేలకు స్వైప్ చేయించుకొని కొద్దిపాటి కమిషన్ తీసుకొని మిగతా నగదు ఇస్తున్నారని సమాచారం. ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో గంటల కొద్దీ నిలుచునే బదులు కమిషన్ పోయినా అవస్థలు తప్పుతాయని ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార సంస్థల అధినేతలు, గుమాస్తాలు ఏదో ఒకటి కొన్నట్లు బిల్లు సృష్టించి, ఆ మొత్తాన్ని అవసరమైన వారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపార సంస్థల స్థాయిని బట్టి రూ.100 నుంచి రూ.10 వేల వరకు నోట్లు మార్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యక్తుల అవసరాలను బట్టి 2 నుంచి 10 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. -
ఆర్టీవో కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు
నగరంపాలెం: జిల్లాలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో మంగళవారం నుంచి నగదు రహిత లావాదేవీల కోసం స్వైపింగ్(పోస్) మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ జీసీ రాజరత్నం తెలిపారు. చిలకలూరిపేట, తెనాలి, బాపట్ల, మంగళగిరి, పిడుగురాళ్ల, మాచర్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలకు సోమవారం పోస్ యంత్రాలు అందించినట్లు తెలిపారు. నవంబరు 23 నుంచి గుంటూరు ఉప రవాణ కమిషనర్ కార్యాలయం, నరసరావుపేట ఆర్టీవో కార్యాలయం, దాచేపల్లి, మాచర్ల చెక్‌పోస్టుల్లో పోస్ యంత్రాల ద్వారా నగదు రహిత సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వివిధ పనులకుగాను, పోస్ యంత్రాల ద్వారా రూ.3,04,540 వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే వాహనదారులు క్రెడిట్, డెబిట్ కార్డులను తెచ్చుకుని పోస్ యంత్రాలను ఉపయోగించుకుని నగదు రహిత సేవలు పొందాలని డీటీసీ రాజరత్నం కోరారు.