కార్డున్నా సరే... క్యాష్‌తోనే పని..! | Swiping Machines was not working properly | Sakshi
Sakshi News home page

కార్డున్నా సరే... క్యాష్‌తోనే పని..!

Published Fri, Dec 30 2016 2:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

కార్డున్నా సరే... క్యాష్‌తోనే పని..!

కార్డున్నా సరే... క్యాష్‌తోనే పని..!

మాటిమాటికీ మొరాయిస్తున్న స్వైపింగ్‌ మెషిన్లు...
- మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇదేతీరు
- ప్రాసెసింగ్‌.... డిక్లెయిన్‌ అంటూ నిలిచిపోతున్న మెషిన్లు
- చివరకు కొనుగోలు చేయకుండానే వెనుదిరుగుతున్న కస్టమర్లు
- కొన్నిచోట్ల అందుబాటులో నగదు మేరకు సరుకులిస్తున్న పరిస్థితి
- పేటీఎం నుంచి బ్యాంకు ఖాతాలో వెనువెంటనే జమకాని నగదు...
- కుదేలవుతున్న వ్యాపారాలు, భారీగా పడిపోతున్న అమ్మకాలు

అత్యవసర పనిమీద వెళ్తున్న మోహన్‌ మొయినాబాద్‌లోని ఐఓసీ పెట్రోల్‌ బంక్‌లో రూ.300 పెట్రోల్‌ పోయించుకున్నాడు. తనవద్దనున్న ఎస్‌బీఐ డెబిట్‌ కార్డును క్యాషియర్‌కు ఇచ్చాడు. ఆ కార్డును స్వైప్‌ చేసి రూ.300 ఎంట్రీ చేసిన తర్వాత మోహన్‌ పిన్‌నంబర్‌ ఎంట్రీ చేయగానే... సెకన్ల వ్యవధిలో డబ్బులు కట్‌ అయినట్లు ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ వచ్చింది. కానీ స్వైపింగ్‌ మెషిన్లో మాత్రం ట్రాన్జాక్షన్‌ ఫెయిల్‌ అని ప్రత్యక్ష్యమయ్యింది. దీంతో ఎమర్జెన్సీ పనిపై దృష్టిపెట్టాల్సిన మోహన్‌... చివరకు బంకు యాజమాన్యంతో గొడవకు దిగాల్సివచ్చింది.

ఇంట్లో బీపీ మాత్రలు అయిపోవడంతో కొనుగోలు చేయడానికి కుమార్‌ మెడికల్‌ షాప్‌కు వెళ్ళాడు. మందులు తీసుకున్న తర్వాత రూ.2వేలకు చిల్లర లేదని షాప్‌ కీపర్‌ చెప్పడంతో తనదగ్గరున్న డెబిట్‌ కార్డును తీసి ఇచ్చాడు. షాప్‌కీపర్‌ దాన్ని స్వైప్‌ చేశాడు. పదిహేను నిమిషాలైనా ప్రాసెసింగ్‌ అంటూ... ఆతర్వాత డిక్లయిన్డ్‌ అని ఆ మెషిన్‌ సెలవిచ్చింది. దీంతో చేసేదేంలేక మందులు తిరిగి ఇచ్చేసి ఇంటికి వెనుదిరిగాడు కుమార్‌.

సాక్షి, హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తెచ్చిన క్యాష్‌లెస్‌ విధానం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. నగదు రహిత చెల్లింపులవైపు మళ్లించేందుకు బ్యాంకర్లు వ్యాపారులకు స్వైపింగ్‌ మెషిన్లు ఇస్తున్నారు. కానీ వాటి పనితీరు అధ్వాన్నంగా ఉండటంతో అటు విక్రేతలు, ఇటు కొనుగోలుదారులకు చికాకు తెప్పిస్తోంది. పలుమార్లు హ్యాంగ్‌ కావడం, ప్రాసెసింగ్‌ దశలో ఎక్కువ సమయం తీసుకోవడం, చివరకు ట్రాన్జాక్షన్‌ డిక్లెయిన్డ్‌ కావడంతో ఇరువర్గాల్లో ఓపిక నశించిపోతోంది. కొన్నిసందర్భాల్లో  కార్డుదారుడి ఖాతాలో నగదు డెబిట్‌ అయినప్పటికీ.. అది దుకాణదారు ఖాతాలో జమకాకపోవడంతో వాగ్వాదాలకు దారితీస్తోంది. చివరకు కొనుగోలుచేసిన సరుకులు తిరిగివ్వడమో.. లేక అందుబాటులో నగదు ఉన్నంత మేరకే కొనుగోలు చేయడమో జరుగుతోంది. ఈ ప్రక్రియతో వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు.

పతనం 40 శాతం పైమాటే..!
డిమానిటైజేషన్‌ ప్రభావంతో చిల్లర వ్యాపారం భారీగా దెబ్బతింది. ఇప్పటివరకు మార్కెట్‌లోకి రూ.2వేల నోట్లే ఎక్కువగా వచ్చాయి. వీటికి చిల్లర ఇవ్వలేక వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. చిల్లర తెచ్చుకున్న వారికే సరుకులు విక్రయిస్తున్నారు. దీంతో అమ్మకాల తీరు దారుణంగా పడిపోతోంది. కొన్నిచోట్ల స్వైపింగ్‌ మెషిన్లు పెట్టి వ్యాపారాన్ని దారిమళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... అవి మాటిమాటికీ మొరాయించడంతో చేదు అనుభవమే మిగులుతోంది. వనస్థలిపురంలోని వినాయక కిరాణా దుకాణం యజమాని రాజేష్‌ రోజుకు సగటున రూ.8వేల నుంచి రూ.10వేలు విక్రయించేవాడు. నోట్ల రద్దు నాటినుంచి రూ.5వేలు దాటడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. చాలినంత నగదు అందుబాటులోకి వస్తే తప్ప నష్టాల నుంచి గట్టెక్కలేమని వాపోయాడు.

బ్యాంకు ఖాతాకు జమకాని నగదు..
డిజిటల్‌ లావాదేవీల నేపథ్యంలో పేటీయం యాప్‌ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. బార్‌కోడ్, ఫోన్‌ నంబర్ల ద్వారా నగదు లావాదేవీలు సులభతరంగా జరుగుతున్నప్పటికీ.. యాప్‌లో ఉన్న నగదును బ్యాంకు ఖాతాలోకి మార్చుకోవడం మాత్రం కష్టంగా మారింది. ఈ ప్రక్రియలో గరిష్టంగా వారం రోజుల సమయం పడుతుంది. పేటీఎం ద్వారా నేరుగా ఇతరుల బ్యాంకు ఖాతాకు నగదు పంపిణీ చేయడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి.

మంచి టైంలో సతాయిస్తోంది...
ఉదయం, సాయంత్రం గిరాకీ ఉంటుంది. ఎక్కువ కస్టమర్లు ఉద్యోగులే కావడంతో కార్డులు ఇస్తున్నారు. ఉదయం వేళ స్వైపింగ్‌ మెషిన్ల పనితీరు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ... మధ్యాహ్నం తర్వాత మాత్రం చాలా ఇబ్బంది పెడుతోంది. ఆంధ్రాబ్యాంకు నుంచి మెషిన్‌ తీసుకున్నా. కానీ ఆ బ్యాంకు కార్డులను కూడా కొన్నిసార్లు అంగీకరిస్తలేదు. దీంతో నగదు తీసుకోవడమో.. లేక తర్వాత తెచ్చివ్వమనో చెబుతున్నాం.
– ప్రసాద్, టిఫిన్‌ సెంటర్, బంజారాహిల్స్‌

ముందే పరిశీలిస్తున్నాం
స్వైపింగ్‌ మెషిన్లతో సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. రద్దీ సమయంలో మెషిన్లు మొరాయించడంతో కస్టమర్లను మేనేజ్‌ చేయలేకపోతున్నాం. లావాదేవీలు రద్దయినట్లు యంత్రంలో చూపిస్తున్నప్పటికీ... కార్డుదారుల ఖాతాలో డబ్బులు ఖర్చయినట్లు మెసేజ్‌ వస్తోంది. దీంతో వాళ్లతో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ముగ్గురితో ఇదే సమస్యతో వాగ్వాదం జరిగింది. చివరకు ఇద్దరికి చేతినుంచి డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా కార్డులను పరిశీలించిన తర్వాతే పెట్రోల్, డీజిల్‌ పోస్తున్నాం.
– సుదర్శన్, క్యాషియర్, ఐఓసీ పెట్రోల్‌బంక్, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా

సరుకులు వాపస్‌ తీసుకుంటున్నాం
షాప్‌కు వచ్చే ఖాతాదారులు పెద్ద మొత్తంలో బిల్లు చేస్తారని స్వైపింగ్‌ మెషిన్‌ తీసుకున్నాం. నోట్ల రద్దు ప్రకటనకు వారం రోజుల ముందే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో మెషిన్‌కోసందరఖాస్తు పెట్టుకుంటే వారం తర్వాత వచ్చింది. దీంతో నాకు నోట్లతో పని ఉండదనుకున్నా. కానీ మెషిన్‌ పనితీరు అస్సలు బాగాలేదు. రోజుల తరబడి పనిచేయదు. బ్యాంక్‌ మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తే కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు చేయమని చెప్తాడు. కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కలిస్తే ఒట్టు. ఈరోజు మధ్యాహ్నం ఒక కస్టమర్‌ రూ.7వేలు బిల్లు చేసి కార్డు ఇచ్చాడు. అది పనిచేయకపోవడంతో సరుకులన్నీ వాపస్‌ తీసుకున్నా.
– జంగయ్య, సాయిలీల హార్డ్‌వేర్‌ షాప్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement