మూడు రోజులు.. ముప్పు తిప్పలు! | Not available of ration to the poor people | Sakshi
Sakshi News home page

మూడు రోజులు.. ముప్పు తిప్పలు!

Published Mon, Apr 4 2016 5:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

మూడు రోజులు..  ముప్పు తిప్పలు!

మూడు రోజులు.. ముప్పు తిప్పలు!

 ప‘రేషాన్’
మొరాయిస్తున్న సర్వర్
మొండికేస్తున్న డీలర్లు
పేదలకు అందని రేషన్
ముగిసిన పంపిణీ గడువు

 
 కర్నూలు (అగ్రికల్చర్): పేదల పొట్టకొట్టే ప్రయత్నాలకు ప్రభుత్వం తెర తీసింది. అన్ని చౌకదుకాణాల్లో విధిగా ఒకటో తేదీ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ ప్రారంభించి మూడో తేదీలో పూర్తి చేయాలని డీలర్లను ఆదేశించింది. సర్వర్ మొరాయించడం, డీలర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో 3వ తేదీ నాటికి జిల్లాలో 64.73 శాతం పంపిణీ పూర్తయింది. రేషన్ కోసం లబ్ధిదారులకు మూడు రోజుల పాటు ముప్పు తిప్పలు తప్పలేదు. జిల్లా కేంద్రమైన కర్నూలులో సరుకుల పంపిణీ నత్తనడకన సాగింది. ప్రజాపంపిణీలో కర్నూలు జిల్లానే ప్రథమస్థానంలో ఉంది. అయితే 3వ తేదీలోపు సరుకుల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యం మాత్రం నెరవేరలేదు.

ఈ-పాసు మిషన్‌ల ద్వారా మూడో తేదీలోపు  సరుకుల పంపిణీ చేసి,  వేలిముద్రలు పడని వారికి, ఇతరులకు 5వ తేదీలోపు పంపిణీ చేయాల్సి ఉంది. గతనెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ప్రజాపంపిణీ కొంత వరకు మెరుగైనా.. డీలర్లలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లాలో 2414 చౌకదుకాణాలు ఉన్నాయి. ఇందులో 7 షాపులకు మినహా మిగిలి 2407 షాపుల్లో ఈ-పాస్ మిషన్‌ల సరుకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్ నెలకు 11,18,340 సరుకులకు రేషన్ విడుదల అయింది. మూడో తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 7,12,477 కార్డులకు ఈ-పాస్ మిషన్‌ల ద్వారా సరుకులు పంపిణీ చేశారు. ఇంకా 4,05,863 కార్డులకు సరుకులు అందాల్సి ఉంది.


 ఆదివారం తెరచుకోని చౌక దుకాణాలు  
జిల్లా వ్యాప్తంగా ఆదివారం 106 షాపులు తెరచుకోలేదు. కౌతాళం మండలంలో -8, ఆలూరు మండలంలో -7 కోసిగిలో-10, పెద్దకడుబూరులో-5, ఆదోనిలో-6, వెల్దుర్తిలో-4, ప్యాపిలిలో-3, కర్నూలు అర్బన్‌లో-2, కొలిమిగుండ్లలో-2, నంద్యాలలో-2, చాగలమర్రిలో-2, రుద్రవరంమండలంలో మూడు ప్రకారం షాపులు తెరువలేదు. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు వచ్చి గంటల తరబడి వేచిచూసి వెనుతిరిగారు.

ఈనెల 1వ తేదీ 2.80 లక్షల కార్డులకు, 2వ తేదీ 3.15 లక్షల కార్డులకు సరుకులు పంపిణీ చేశారు. మూడో తేదీ ఆదివారం డీలర్లు సెలవు తీసుకోవడంతో 1,22,477 కార్డులకు మాత్రమే సరుకులు చేరాయి. మొత్తం 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 7,12,477 కార్డులకు పంపిణీ పూర్తి అయింది. దీంతో జిల్లాలో ఇంకా 4,05,863 కార్డులకు సరుకులు అందాల్సి ఉంది. వీటికి సరుకులు పంపిణీ చేయడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. వేలిముద్రలు పడని వారికి, ఇతరులకు సరుకుల పంపిణీ మరింత జాప్యం కానుంది.
 
 సమస్య ఇదీ..
మార్చి నెలలో పోలిస్తే ఈనెలలో డీలర్లు షాపులు తెరువడం మెరుగ్గా ఉన్నా సర్వర్ మొరాయిస్తుండం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. 95 శాతంపైగా షాపులు తెరచి ప్రజాపంపిణీ మొదలు పెట్టడం వల్ల సర్వర్‌పై  ఒత్తిడి పెరుగుతోంది. ఇందువల్ల లైన్లు దొరకక ప్రజా పంపిణీ ఆలస్యం అవుతోంది. దీనికి తోడు హార్డ్‌వేర్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సర్వర్ సమస్యలు, హార్డ్‌వేర్ సమస్యలను అధిగమించకుండా ప్రజాపంపిణీ చేపట్టడంతో తల ప్రాణం తోకకు వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 రాష్ట్రంలో ముందున్నాం:
 ఈ-పాస్ విధానం ద్వారా ప్రజాపంపిణీలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అత్యధిక కార్డులకు సరుకుల పంపిణీలో గతనెల వరకు గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉండింది. ఆ స్థానాన్ని కర్నూలు జిల్లా చేజిక్కించుకుంది. జాయింట్ కలెక్టర్ తీసుకున్న చర్యల వల్ల కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.  
 డీఎస్‌ఓ తిప్పేనాయక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement