సాక్షి, కర్నూలు : విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎప్పుడూ డబ్బుపైనే ధ్యాస.. పథకాల పేరుతో అందినకాడికి రైతుల నుంచి వసూళ్లు.. ప్రభుత్వం కేటాయించిన దాణా, ఇతర ఇన్‌పుట్స్ లబ్ధిదారులకు అందజేయకుండా మెక్కేయడం.. ఇదీ ఆత్మకూరు మండలంలోని ఓ పశువైద్యాధికారి వ్యవహార శైలి. సంబంధిత ఏడీ, డీడీలు ఈయన పనితీరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
పశుసంవర్ధక శాఖ 50 శాతం సబ్సిడీపై పాడిగేదెలు, దాణా, దాణామృతం, సైలేజ్ గడ్డి వంటి వాటిని పంపిణీ చేస్తోంది. ఈ పథకాల అమలులో ఆ వైద్యుడు పాల్పడిన అక్రమాలపై రైతులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వీరపాండియన్ ఈనెల 8న ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లారు. జిల్లాకు చెందిన వారితో పాటు ఆత్మకూరు మండల అధికారులందరూ కలెక్టర్ వెం ట ఉన్నా ఈ పశువైద్యాధికారి మాత్రం పత్తా లేరు.
రైతులను హర్యానాలో వదిలి...
2018–19కి సంబంధించి పాడి గేదెలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈయన తన పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది రైతుల నుంచి పాడిగేదెల యూనిట్ల పంపిణీకి ఒక్కొక్కరి నుంచి రూ.15వేలు నాన్స్ సబ్సిడీ మొత్తం రూ.3.60 లక్షలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని డీడీ తీసి పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో అప్పగించాలి. పాడి గేదెలను హర్యానా, ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లోనే రైతుల సమక్షంలోనే కొనుగోలు చేయాలి.
నాన్ సబ్సిడీ మొత్తానికి కార్యాలయంలో అప్పగించకుండా స్వాహా చేసి రైతులను హర్యానా రాష్ట్రానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత జేడీ కార్యాలయం అధికారులు విషయం తెలుసుకొని డీడీ లేకపోవడంతో డాక్టర్‌కు ఫోన్ చేశారు. డీడీ బీరువాలో పెట్టి మరిచి వచ్చానని.. వచ్చిన వెంటనే అప్పగిస్తానని నమ్మించే ప్రయత్నం చేశారు. ముందు డీడీ అప్పగించే ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే పాడిగేదెలు బేరం చేయాలని ఆదేశించారు. దీంతో రైతులను హర్యానా రాష్ట్రంలో వదిలి చెప్పాపెట్టకుండా వచ్చేశారు. రైతులు తిప్పలు పడి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. రైతుల నుంచి వసూలు చేసిన నాన్ సబ్సిడీ మొత్తం ఇప్పటికీ చెల్లించలేదు.
ఈ నెల చివరి వరకు ఓపీ రికార్డు పూర్తి...
ఈ నెల 8న ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్ వెంట పశుసంవర్ధక శాఖ జేడీ కూడా వెళ్లారు. డాక్టర్ లేకపోవడంతో పశువైద్యశాలకు వెళ్లి ఓపీ రికార్డు పరిశీలించారు. నెలకు సంబంధించిన చికిత్సల వివరాలతో ముందుగానే నింపేసి ఉండటాన్ని చూసి జేడీ అవాక్కయ్యారు.
కోళ్ల దానాను వదల్లేదు
వివిధ గ్రామాలకు చెందిన వారికి పశుసంవర్ధక శాఖ కోళ్లు పంపిణీ చేస్తుంది. కోళ్లకు దాణా, ఇతర ఇన్‌పుట్స్ ఇస్తారు. ఇందిరేశ్వరం తదితర గ్రామాల వారికి కోళ్లు పంపిణీ చేశారు తప్ప దాణా, ఇతర ఇన్‌పుట్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంపై ఆరా తీస్తే అమ్మేసుకున్నట్లు తేలిందని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment