సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతలు ఏ పనులనూ వదలడం లేదు. అన్నీ తమకే అప్పగించాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురికి కాలువలు వంటి పనులకు పిలిచిన టెండర్లను తెరవొద్దంటూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో టెండరు గడువు పూర్తయి సుమారు నెల రోజులు కావస్తున్నా వాటిని కర్నూలు కార్పొరేషన్ అధికారులు తెరవడం లేదు. తన వారికి దక్కలేదన్న కారణంగా అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో టెండర్లు తెరవడం లేదని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి కోట్లాది రూపాయల విలువైన పనులకు సకాలంలో టెండర్లు పిలవలేదంటూఏకంగా మునిసిపల్ డైరెక్టర్ రద్దు చేసినప్పటికీ వ్యవహారంలో మాత్రం మార్పు రావడం లేదు. మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సుమారు రూ.4.5 కోట్లతో మూడు వేర్వేరు టెండర్లను ఈ ఏడాది జూలై 21న పిలిచారు. వీటికి బిడ్లు సమర్పించే గడువు ఆగస్టు 13తో పూర్తయ్యింది. ఈ టెండర్లలో పలు సంస్థలు పాల్గొన్నాయి. అయితే, అధికార పార్టీ నేతకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి దక్కలేదనే కారణంగా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి మరీ టెండర్లు తెరవకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిధులు వెనక్కి వెళుతున్నా...
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లను త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో సబ్‌ప్లాన్ నిధులను సకాలంలో ఖర్చు చేయలేదన్న కారణంతో వెనక్కి తీసుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల మేర నిధులను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. జిల్లాలో కూడా రూ.20 కోట్ల మేర వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు కూడా రూ.4.5 కోట్ల పనులకు టెండర్లను పిలిచి 50 రోజులకు పైగా అయ్యింది. బిడ్లను సమర్పించి కూడా నెల రోజులు కావస్తోంది. అయినప్పటికీ టెండర్లను మాత్రం తెరవడం లేదు. అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సబ్‌ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లు ఆలస్యం కాకుండా చూడాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కర్నూలు కార్పొరేషన్‌లో మాత్రం అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో గడువు ముగిసినా టెండర్లను తెరవని పరిస్థితి నెలకొంది.
రంగంలోకి ఇతర కాంట్రాక్టర్లు!
సబ్‌ప్లాన్ టెండర్లను తెరవకపోవడంతో కొద్ది మంది మునిసిపల్ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సదరు నేత వద్దకు వెళ్లి.. టెండర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయినప్పటికీ ఆ నేత ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. టెండరులో పనులు దక్కే కాంట్రాక్టర్‌ను మీ వద్దకు తీసుకొస్తామని పేర్కొన్నప్పటికీ అంగీకరించలేదని సమాచారం. కేవలం తన మనుషులకు మాత్రమే పనులు దక్కించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment