అన్న క్యాంటీన్లలోనూ బొజ్జ నింపుకున్నారు | Corruption In Anna Canteen Kurnool | Sakshi
Sakshi News home page

అన్న క్యాంటీన్లలోనూ బొజ్జ నింపుకున్నారు

Published Fri, Aug 24 2018 12:10 PM | Last Updated on Sat, Sep 22 2018 8:30 PM

Corruption In Anna Canteen Kurnool - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికార పార్టీ నేతల అవినీతి పర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చివరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటులోనూ కక్కుర్తి పడుతున్నారు. పెద్ద పెద్ద ప్రైవేటు హోటళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్నారు. ఇందుకోసం సదరు హోటళ్ల యాజమాన్యాల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌యార్డులో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని మొదట నిర్ణయించారు. మార్కెట్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చే రైతులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావించారు. అదేవిధంగా రోగులను చూసేందుకు వచ్చే బంధువుల సౌకర్యార్థం పెద్దాస్పత్రిలోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే, ప్రైవేటు హోటళ్ల యాజమాన్యాలతో అధికార పార్టీ నేతలు చేతులు కలిపారు. కుంటిసాకులు చూపుతూఅన్న క్యాంటీన్లు ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారు. మార్కెట్‌యార్డులో స్థలం లేదని, ఆసుపత్రిలో పారిశుద్ధ్య సమస్య వస్తుందనే నెపంతో క్యాంటీన్లు రద్దు చేయించడం గమనార్హం. 

ఊరికి దూరంగా...
ప్రస్తుతం అన్న క్యాంటీన్లు రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే  ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఊరికి దూరంగా ప్రైవేటు హోటళ్లు ఎక్కువగా లేని ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. కర్నూలులో ఏకంగా ఉల్చాల గ్రామానికి వెళ్లే దారిలో వీకర్‌ సెక్షన్‌ కాలనీ సమీపాన ఏర్పాటు చేశారు. ఇక్కడికి పెద్దగా వచ్చే వారు కూడా ఉండరు. ఇక కలెక్టర్‌లో క్యాంటీన్‌ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఉల్చాల దారిలో క్యాంటీన్‌ నిర్మాణ పనులు సగం కూడా కాకముందే ప్రారంభించిన అధికారులు.. కలెక్టరేట్‌లో మాత్రం ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తద్వారా ఇక్కడ ప్రైవేటు హోటళ్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతలు క్యాంటీన్ల నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడడమే కాకుండా.. వాటి కోసం ప్రాంతాల ఎంపికలోనూ స్వార్థానికి ఒడిగట్టడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన క్యాంటీన్లలో రోజూ చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. అన్నం అయిపోయిందంటూ నిర్వాహకుల నుంచి సమాధానం వస్తోందని వారు పెదవి విరుస్తున్నారు.  

కమీషన్ల కోసమే..
ప్రైవేటు హోటళ్ల వారు ఇచ్చే కమీషన్ల కోసమే మార్కెట్‌యార్డులో అన్న క్యాంటీన్‌ రద్దు చేశారు. రైతులు అసలే దూరాభారం నుంచి వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్‌కు సరుకు తెస్తున్నారు. ఒక్కోసారి రోజంతా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. మూడు పూటలా బయట తినాలంటే రూ.300 వరకు ఖర్చు వస్తుంది. అదే అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తే ఖర్చు చాలావరకు తగ్గుతుంది. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వెంటనే ఏర్పాటు చేయాలి. – ఈరన్న, కోడుమూరు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement