
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై), నాబార్డ్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే సదరు కాంట్రాక్టర్ల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
నాబార్డ్, పీఎంజీఎస్‌వై పనుల పురోగతిపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా జరుగుతున్న పనులు, జాప్యానికి గల కారణాలపై ఈఈ, ఎస్‌ఈలతో చర్చించారు. ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన పనులను పూర్తి చేయడం ద్వారా కేంద్రం నుంచి అదనంగా నిధులను పొందేందుకు వీలుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోను మార్చి 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
151 పనులకు టెండర్లు పూర్తి..
పీఎంజీఎస్‌వై కింద దాదాపు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని జూపల్లి వెల్లడించారు. ఇందులో రూ.300 కోట్ల విలువైన పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని, మిగిలిన పనులను కూడా జూన్ 30లోగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 154 పనులను పూర్తి చేసే లక్ష్యం రూపొందించుకున్నామని, ఇందులో 151 పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment