సాక్షి, అమరావతి: ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద మేం ఇచ్చిన నిధులకు రాష్ట్రం వాటా కలిపి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లేయమని కేంద్రం చెబితే.. రాష్ట్రం నిధులు కలపలేదు సరికదా.. అక్కడి నుంచి వచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లూ వేయలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అదే పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులకు రాష్ట్రం వాటా కలిపి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచి రోడ్లు వేసింది.
స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వాస్తవమిది. పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే కొత్త రోడ్ల నిర్మాణం ఎక్కువగా జరిగిందని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్రంలో గ్రామాలను సమీప పట్టణాలకు కలిపే గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి కేంద్రమిచ్చిన నిధులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయని విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల రాజ్యసభలో గణాంకాల సహితంగా వెల్లడించింది.
పీఎంజీఎస్‌వైలో రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40 శాతం భరించాలి. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రంలో పీఎంజీఎస్‌వై కింద కేంద్రం రూ.470 కోట్లు నిధులిచ్చింది. దీనికి రాష్ట్ర వాటా 40 శాతం కలిపి మొత్తం రూ.783 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో కేవలం రూ. 393 కోట్ల మేరకే కొత్త రోడ్లకు ఖర్చు చేసినట్టు కేంద్రం రాజ్యసభకు తెలియజేసింది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం గత మూడేళ్లలో కేంద్రమిచ్చిన నిధులకు రాష్ట్ర వాటా 40 శాతం కలిపి మొత్తాన్ని రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేసినట్టు వివరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021– 2022 వరకు మూడేళ్లలో రాష్ట్రంలో పీఎంజీఎస్‌వై కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 579 కోట్లు రాష్ట్రానికి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం కలిపి మొత్తం రూ. 1,244.45 కోట్లతో రాష్ట్రంలో కొత్త రోడ్లు నిర్మించినట్టు కేంద్రం పేర్కొంది.
పీఎంజీఎస్‌వైతోనే ఈ మూడేళ్లలో 2,271 కిలోమీటర్ల కొత్త రోడ్లు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక కేంద్రం పీఎంజీఎస్‌వై పథకంలో రాష్ట్రానికి ఇప్పటివరకు 2,308 కిలోమీటర్ల మేర 298 రోడ్లను కొత్తగా మంజూరు చేసింది. అందులో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నాటికి 1,490 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది.
అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వం ఇదే పథకంలో నిర్మించకుండా పెండింగ్‌లో పెట్టిన దాదాపు 781 కిలోమీటర్ల రోడ్లను సైతం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొదలు పెట్టి ఇప్పటికే పూర్తి చేసింది.
మొత్తంగా రాష్ట్రంలో ఒక్క పీఎంజీఎస్‌వై పథకంలోనే 2,271 కిలోమీటర్ల కొత్త రోడ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించింది. కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర వాటాను కలుపుతుండటంతో మరికొద్ది రోజుల్లోనే మరో 907 కిలోమీటర్ల మేర అదనంగా రోడ్లను మంజూరు చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment