సాక్షి, న్యూఢిల్లీ: పీఎంజీఎస్‌వై–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌ను ఉపయోగిస్తామని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏజెన్సీ తెలిపింది. కొబ్బరి పీచుతో తయారైన చాపలు మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి సహజమైనవి. బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి.
చిరుగులకు లోనకావు. సూక్ష్మజీవులను దరి చేరనివ్వవు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి పీచును గ్రామీణ రోడ్ల నిర్మాణంలో వాడేందుకు అనుమతి లభించింది. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కొబ్బరి పీచును ప్రత్యామ్నాయంగా వాడేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో ఎంఎస్‌ఎంఈ, రహదారి రవాణా–హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇది ముఖ్యమైన పరిణామం. రోడ్ల నిర్మాణంలో కాయిర్ జియో టెక్స్‌టైల్స్ వాడడంలో మనం ఇప్పుడు విజయం సాధించాం. కోవిడ్ –19 సమయంలో కుదేలైన కొబ్బరి పీచు పరిశ్రమకు ఈ నిర్ణయం ప్రాణం పోస్తుంది..’అని చెప్పారు.
పీఎంజీఎస్‌వై ఇచ్చిన కొత్త సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం, ప్రతి నిర్మాణ ప్రతిపాదనలో 15 శాతం పొడవైన రోడ్లను కొత్త సాంకేతికత ఉపయోగించి నిర్మించాలి. ఇందులో 5 శాతం రోడ్లను ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(ఐఆర్‌సీ) గుర్తింపు పొందిన సాంకేతికత ఆధారంగా నిర్మించాలి. కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌ను నిర్మాణ సామగ్రిగా ఐఆర్‌సీ ప్రస్తుతం గుర్తించింది.
కేంద్ర సూచనల ప్రకారం పీఎంజీఎస్‌వై–3 కింద నిర్మించే గ్రామీణ రహదారుల్లో 5 శాతాన్ని కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించి నిర్మించాలి. దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 164 కిలోమీటర్లు, తెలంగాణలో 121 కి.మీ., గుజరాత్‌లో 151, కేరళలో 71, మహారాష్ట్రలో 328, ఒడిశాలో 470, తమిళనాడులో 369 కిలోమీటర్ల రహదారిని కాయిర్ జియో టెక్స్‌టైల్స్ ఉపయోగించి నిర్మిస్తారు. ఈ ఏడు రాష్ట్రాల్లో మొత్తం 1674 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంలో కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌ను వినియోగిస్తారు. ఇందుకోసం ఒక కోటి చదరపు మీటర్ల కాయిర్ జియో టెక్స్‌టైల్స్ అవసరమని, ఇందుకు రూ. 70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
గ్రామీణ రోడ్లలో కొబ్బరి పీచు వినియోగం
Published Thu, May 21 2020 3:27 AM | Last Updated on Thu, May 21 2020 3:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment