కార్పొరేట్ అవినీతిలో భారత్ పైనే..
⇒ 41 దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉక్రెయిన్
⇒ ఈవై సర్వేలో వెల్లడి
ముంబై: వ్యాపారాల నిర్వహణలో అవినీతి, లంచగొండితనం విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిల్చింది. అయితే 2015లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఈసారి తొమ్మిదో స్థానానికి తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన యూరప్, మధ్యప్రాచ్యం, భారత్, ఆఫ్రికా(ఈఎంఈఐఏ) ఫ్రాడ్ సర్వే 2017లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మొత్తం 41 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా.. కార్పొరేట్ అవినీతిలో ఉక్రెయిన్ అగ్రస్థానంలోను.. సైప్రస్, గ్రీస్ తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. దేశీయంగా సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది వ్యాపారాల నిర్వహణలో లంచగొండితనం, అవినీతి విధానాలు సర్వసాధారణమైనవేనని తెలిపారు. అయితే, నియంత్రణ సంస్థల నిఘా, పారదర్శకత.. గవర్నెన్స్‌కి ప్రాధాన్యమిస్తుండటం తదితర అంశాల కారణంగా 2015తో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని ఈవై ఇండియా పార్ట్‌నర్ అర్పిందర్ సింగ్ తెలిపారు.
జనరేషన్ వై.. నైతికత నై..: భారత్‌లో కొంత పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. కార్యాలయాల్లో జనరేషన్ వై ఉద్యోగుల (1980లు, 1990లలో పుట్టినవారు) అనైతిక ధోరణులు చాలా ఆందోళనకరంగా మారాయని అర్పిందర్ సింగ్ వివరించారు. వ్యాపార సంస్థల నిర్వహణలో అనిశ్చితి, ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు తీవ్ర ఒత్తిడి, అసాధారణ స్థాయిలో కెరియర్ వృద్ధిపై ఆకాంక్షలు మొదలైన అంశాలతో ఉద్యోగులు తమ అనైతిక విధానాలను సమర్ధించుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. తమ సొంత కెరియర్‌లో పురోగమించేందుకు అవసరమైతే అనైతిక విధానాలకు పాల్పడేందుకు దాదాపు 41 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక కంపెనీపట్ల గల విశ్వాసం కారణంగా మోసాలను, అవినీతి, లంచగొండితనాన్ని బైటపెట్టేందుకు చాలా మంది ఉద్యోగులు ఇష్టపడరని సుమారు 58 శాతం మంది తెలిపారు.