మరి లంచాలెందుకు అడుగుతున్నట్లు?
* సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు
* మాటలు కట్టిపెట్టి రైతులకు ఏం చేస్తున్నారో చెప్పండి
* పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వపరంగా ప్రజలకు అందాల్సిన సేవలన్నీ ఆన్‌లైన్ ద్వారా సక్రమంగా అందుతుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఎందుకు అడుగుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మాటలు కట్టిపెట్టి, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుం చాలని ఆదేశించింది.
విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ, విద్యుత్‌శాఖల అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు కట్టి రైతుల నుంచి ఆ మొత్తాలను వసూలు చేస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది.