తహసీల్దార్ కార్యాలయాల్లో లంచం లేకుండా పనులు జరిగాయంటూ సామాన్యులు సంతృప్తి చెందే పరిస్థితి కల్పించాలి.. అవినీతి రహిత పారదర్శక పాలన ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ అధికారులను ఆదేశిస్తున్నారు. గత పాలనలో అలవాటు పడిన తమ పాత ధోరణిని అధికారులు ఇంకా వదులుకోలేకపోతున్నారు. ఇంకా పైసలు ఇవ్వందే ఫైళ్లు ముట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చుక్కల భూముల సమస్యే ఇందుకు నిదర్శనం. క్లెయిమ్స్ పరిష్కారంలో మన జిల్లా రాష్ట్రంలో అట్టడుగున ఉండడం బాధాకరం.
సాక్షి, కడప: నాటి బ్రిటీషు ప్రభుత్వం రీ సర్వే అండ్ రీ సెటిల్‌మెంట్ చేపట్టినపుడు భూములు సాగు చేసుకుంటున్న కొందరు రైతులు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆర్‌ఎస్‌ఆర్‌లో ఆ సర్వే నెంబర్ల వద్ద కాలమ్–16లో చుక్కలు పెట్టారు. పట్టాదారు పేర్లు లేవు గనుక అలాంటి చుక్కల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపి వేసింది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఆ భూములు విక్రయించుకోవాలన్నా రైతులకు అవకాశం లేకుండా పోయింది. వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం అలాంటి భూములను సేకరించినా పరిహారం అందక రైతులు ఎన్నో అవస్థలు పడ్డారు. చివరకు గత ప్రభుత్వం ఇలాంటి భూములపై 12 సంవత్సరాలుగా అనుభవించుకుంటున్న రైతుల పేరిట క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించింది. 2017 జులై 17న జీఓ ఎంఎస్ నెంబరు 298 జారీ చేసింది. అదేనెల 28వ తేది సీసీఎల్‌ఏ సర్క్యులర్ కూడా విడుదల చేశారు.
మామూళ్లు ముట్టజెప్పందే....
చుక్కల భూముల సమస్య రెవెన్యూ అధికారులకు కల్పతరువుగా మారింది. భూముల విలువను బట్టి రేట్లు నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రమైన కడపకు ఆనుకుని ఉన్న సీకే దిన్నె పరిధిలోని మామిళ్లపల్లె, పాపాసాహెబ్‌పేట, కొప్పర్తి వంటి చోట్ల ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. చెన్నూరు, వల్లూరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతోం ది. గతంలో ఒంటిమిట్ట, కొండాపురం తహసీల్దార్లపై ఈ విషయంలో ఆరోపణలు గుప్పుమన్నాయి. తాజాగా ఖాజీపేట మండలంలో రెవెన్యూ అధికారుల లంచగొండి వ్యవహారాలు వెలుగు చూశాయి. చుక్కల భూముల విషయంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశాడన్న అభియోగంపై వీఆర్వో శ్రీనివాసులురెడ్డి ఇటీవల సస్పెండ్ అయ్యారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం చిత్తూరుజిల్లా కలకడలో ఉన్న పార్వతి కొందరు వీఆర్వోల ద్వారా రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చుక్కల భూమిని క్రమబద్దీకరించుకునేందుకు పుల్లూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని బోసిరెడ్డిపల్లెలో ఓ మహిళా రైతు తాను రూ.75 వేలు సమర్పించినట్లు చెబుతున్నారు. కేఆర్‌ఆర్‌సీ డెప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌రావు ఇటీవల ఈ ఆరోపణలపై విచారణ నిర్వహించారు. తుడుములదిన్నె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు తాను రూ.10 వేలు వీఆర్వోకు, రూ.28 వేల తహసీల్దార్ పార్వతికి సమర్పించాల్సి వచ్చిం దని విచారణ అధికారి దృష్టికి తెచ్చారు. ఇలా 26 మంది రైతులు రాత పూర్వకంగా తహసీల్దార్‌పై ఫిర్యాదు చేశారు. సన్నపల్లె గాంధీనగర్, త్రిపురవరం, తుడుములదిన్నె తదితర గ్రామాల్లోని రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చుక్కల భూములు అధికంగా ఉన్న చాపాడు, దువ్వూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, సీకే దిన్నె మండలాల్లో రెవెన్యూ అధికారులు మామూళ్ల కోసం రైతులను పీడిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పరిష్కారంలో జాప్యం
చుక్కల భూములకు పట్టాలు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు అంటున్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లోని 16వ కాలమ్‌లో చుక్కలు ఉన్నప్పటికీ 17వ కాలమ్‌లో కొండపొరంబోకు, గయాళు, వంక పొరంబోకు అనే రిమార్క్స్ ఉన్నాయని కొన్ని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అడంగల్, ఈసీ, రిజిష్టర్ ఆఫ్ ఫోల్డింగ్స్ తదితర డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ ఏదో ఒక నెపం చూపుతూ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి 1801 దరఖాస్తులు తిరస్కరించారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకు జిల్లాలో 9708 దరఖాస్తులు రాగా 90 మాత్రమే జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. పులివెందుల నియోజకవర్గంలో 1003 దరఖాస్తులు రాగా 30 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. జిల్లాలో ఇంకా 7817 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో చుక్కల భూములు లేవు. మిగిలిన ఏడు జిల్లాలలో క్లెయిమ్‌ల పరిష్కారంలో గుంటూరు జిల్లా ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండగా, వైఎస్సార్ కడప మాత్రం చివరిస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment