ఎంతో భూమి..పనికొచ్చేది కొంతే సుమి!
- జిల్లాలో మొత్తం 5.91 లక్షల ఎకరాలు
- పనికొచ్చేది 742.23 ఎకరాలు మాత్రమే
- ప్రభుత్వానికి ‘రెవెన్యూ’ నివేదిక అందజేత
సాక్షి, విజయవాడ : జిల్లాలో లక్షలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ పనికొచ్చేవి మాత్రం వందల ఎకరాలే ఉన్నాయి. నివాసయోగ్యమైన భూములు మొదలుకొని అసైన్డ్ వరకు ఏ కేటగిరీలో ఏ మేరకు భూములు ఉన్నాయో రెవెన్యూ అధికారులు సమగ్రంగా వివరాలు సేకరించారు. ఈ మేరకు రెండు రోజుల క్రింతం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నూతన రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం అన్వేషణ సాగిస్తున్న క్రమంలో అన్ని జిల్లాల్లో భూముల వివరాలను సేకరించి నివేదిక పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగా నూతన ప్రాజెక్టులకు భూములను కేటాయించనున్నారు.
కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటవుతుందనే ప్రచారం జోరందుకోవడంతో భూముల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 5,91,304.54 ఎకరాల భూమి ఉంది. దీనిలో వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వం గతంలో లబ్ధిదారులకు కేటాయించిన భూములు, నివాస భూములు, వాణిజ్య సముదాయాలున్న భూములు 3,28,845.55 ఎకరాలున్నాయి. ఇవికాక 2,62,459.4 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. దీన్ని పూర్తిగా పనికిరాని భూమిగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఇక పనికొచ్చే భూమి కేవలం 742.23 ఎకరాలు మాత్రమే ఉంది.