రాజధానికి భూములివ్వండి | chandra babu naidu seeks lands for capital | Sakshi
Sakshi News home page

రాజధానికి భూములివ్వండి

Published Fri, Sep 5 2014 1:59 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

రాజధానికి భూములివ్వండి - Sakshi

రాజధానికి భూములివ్వండి

రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యర్థన
అన్ని కార్యాలయాలూ ఒకే చోట ఉండాలి.. లేకపోతే సమర్ధ పాలన సాధ్యం కాదు
 ఎక్కువమంది విజయవాడ - గుంటూరును రాజధానిగా కోరుకున్నారని  శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది
 రాజధానికి ఎంపికలో రహస్య అజెండా లేదు
 రాజధానిపై చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం
 
 సాక్షి, హైదరాబాద్: మంచి రాజధాని నిర్మాణానికి భూములిచ్చి సహకరించాలని రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యర్థించారు. భూములివ్వడం వల్ల రైతులూ లాభపడతారని, ఈ మేరకు భరోసా ఇస్తున్నానని చెప్పారు. కొత్త రాజధానిలోనే అన్ని కార్యాలయాలు ఉంటాయని స్పష్టంచేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే రాజధానిపై చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ తర్వాత ఉదయం 11.28 గంటలకు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.05  గంటలకు తిరిగి సమావేశమైంది. వెంటనే విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చారు. జగన్ మాట్లాడిన తర్వాత పలువురు అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘‘రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని ప్రతిపక్ష నేత అంటున్నారు. అడవిలో లక్ష ఎకరాలు దొరుకుతుంది. కానీ సోషల్ లైఫ్ ఎలా వస్తుంది’’ అని ప్రశ్నించారు. దొనకొండలో పెట్టమని, ఇడుపులపాయలో ఏర్పాటు చేయమని కోరుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు జగన్ అభ్యంతరం తెలుపుతూ.. తాను ఎన్నడూ ఇడుపులపాయలో పెట్టమని చెప్పలేదని చెప్పారు. తర్వాత చంద్రబాబు ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘రాష్ట్రంలో ఎక్కువమంది విజయవాడ - గుంటూరును రాజధానిగా కోరుకున్నారని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. తుఫాన్లు, వరదలు, భూకంపాల్లాంటి ప్రమాదాలు, నీరు, భూముల అభ్యత తదితర అంశాల ఆధారంగా తీసుకున్నా విజయవాడకే ఎక్కువ మార్కులు వచ్చాయి. నా సొంత ఊర్లో రాజధాని పెట్టాలనుకున్నా. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా విజయవాడను ఎంపిక చేశాం. ల్యాండ్ పూలింగ్ వల్ల నయా జమీందారులు వచ్చే అవకాశం లేదు’’ అని వివరణ ఇచ్చారు. సభ్యుల సూచన మేరకు కొత్త రాజధానికి ఎన్.టి.రామారావు పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
 
 సీక్రెట్ ప్రైవేటు భాగస్వామ్యం (ఎస్పీపీ) విధానంలో రాజధానిపై రహస్య అజెండా లేదని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు శంకుస్థాపనలు చేయడం మినహా.. ఒక్క ప్రాజెక్టునూ చంద్రబాబు హయాంలో పూర్తి చేయలేదని విపక్ష సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ‘‘అన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు నేనే చేశాను. ఇప్పుడు ప్రారంభోత్సవాలూ చేసే అవకాశం కూడా నాకే వచ్చింది’’ అని చెప్పారు. బాబు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యుడు రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండు చేతులెత్తి నమస్కరించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘నేను చెప్పినవన్నీ చేసి చూపిస్తాను. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉండటానికి కూడా మీకు అర్హత ఉండదు’’ అని అన్నారు. అంతుచూస్తానని బెదిరించారు. చర్చలో పాల్గొన్న టీడీపీ సభ్యులు కళా వెంకట్రావు, ధూళిపాళ్ల నరేంద్ర, జయనాగేశ్వరరెడ్డిలు చంద్రబాబును ప్రసంసించడానికే పరిమితమయ్యారు. చర్చ అనంతరం రాజధానిపై తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఆ తర్వాత స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
 
 ఇది ఎస్పీపీ విధానం : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజేంద్రనాధ్‌రెడ్డి
 
 సీక్రెట్ ప్రైవేటు భాగస్వామ్యం(ఎస్పీపీ) విధానంలో రాజ ధాని నిర్మాణం చేసి, కొందరిని సంతోషపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేం ద్రీకృతం కావడం విభజనకు మూలకారణమైంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం రాజధాని కేంద్రంగానే అభివృద్ధి ప్రణాళికలు వల్లెవేస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండగానే.. రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేసిం ది. వీరిలో ఏడుగురు సభ్యుల్లో ఆరుగురు పారిశ్రామికవేత్తలే. రహస్య అజెండా లేకుండా ఇంత హడావుడిగా నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? రాజధానిపై సభలో చర్చించకుండానే నిర్ణయం తీసుకోవడం వెనుక కొందరి ప్రయోజనాలున్నాయనే అనుమానం ప్రజలకు ఉంది’’ అని అన్నారు.
 
 మార్పులు లేకపోతే చర్చకు అర్థంలేదు : బీజేపీ ఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు
 
 ప్రకటన తర్వాత మార్పులు చేసే అవకాశం లేకపోతే శాసన సభలో చర్చకు అర్థం లేదు. ప్రభుత్వ భూములు ఎక్కువగా, ప్రైవేటు భూములు తక్కువగా వినియోగించుకొనేలా కొత్త రాజధాని నిర్మాణం జరగాలి.
 200 సంవత్సరాల అవసరాలు తీరుస్తుందా? : వైఎస్సార్ సీపీ సభ్యుడు సుజయకృష్ణ రంగారావు
 అన్ని పార్టీలు, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ప్రజలు భావిస్తున్నారు. ప్రాంతం ఏదైనా.., ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని నిర్మిస్తే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది.
 
 విపక్ష సభ్యులపై బాబు మండిపాటు


 రాజధానిపై ప్రకటన చేసి, చర్చ ప్రారంభించే సందర్భంలో అధికారపార్టీ శైలిపై నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులపై బాబు మండిపడ్డారు. ‘‘అన్ని జిల్లాల్లో సమగ్ర, సమాంతర అభివృద్ధి చేస్తామని సభ్యులకు అందించిన ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పాం. జిల్లాలవారీగా వివరాలు కూడా తెలిపాం. సంక్షోభంలో ఉన్న తరుణంలో విపక్షం వారు సహకరించడానికి బదులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. విపక్షం చెప్పినట్టు చేయడానికి మేమిక్కడం లేము. మీకు ఒక్కటే మార్గం. మీ ముందు ప్రకటన ఉంది. చదువుకోండి. చర్చ చేయండి’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement