కొత్త నోట్లలో లంచం తీసుకోరా?
న్యూఢిల్లీ: నోట్ల రద్దు వ్యవహారంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోట్ల రద్దుపై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నోట్ల రద్దు ద్వారా అవినీతి నిర్మూలన జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్న మాటలు నిజం కాదని.. కొత్త నోట్లలో లంచం తీసుకోరనడానికి, బ్లాక్ మనీ ఉండదనడానికి ఎలాంటి గ్యారంటీ లేదన్నారు.
నోట్ల రద్దుతో తీవ్రవాదులకు నష్టం జరుగుతుందన్న వాదన సైతం అవాస్తవం అని, ఉగ్రవాదులకు ఫేక్ కరెన్సీ మాత్రమే అందటం లేదని చిదంబరం అన్నారు. సెప్టెంబర్ 30 నుంచి జమ్మూకశ్మీర్‌లో 33 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారని వెల్లడించారు. 2016లో కశ్మీర్‌లో మృతి చెందిన భద్రతా సిబ్బంది సంఖ్య 87 అని.. ఇది 2015లో మృతి చెందిన భద్రతా సిబ్బంది సంఖ్య కంటే రెట్టింపు అని తెలిపారు. దీనిని బట్టి తీవ్రవాదం విషయంలో పరిస్థితి మెరుగైనట్లుగా కనిపించడం లేదని చిదంబరం అన్నారు. నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఆగ్రహంతో లేరు అని చెప్పడం సరికాదన్నారు.