డీమోనిటైజేషన్‌ అతిపెద్ద స్కామ్‌: చిదంబరం | Demonetisation 'biggest scam of 2016': Chidambaram | Sakshi
Sakshi News home page

డీమోనిటైజేషన్‌ అతిపెద్ద స్కామ్‌: చిదంబరం

Published Mon, Feb 13 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

డీమోనిటైజేషన్‌ అతిపెద్ద స్కామ్‌: చిదంబరం

డీమోనిటైజేషన్‌ అతిపెద్ద స్కామ్‌: చిదంబరం

2016–17లో వృద్ధి 6.5% లోపే
వచ్చే రెండేళ్లూ ఇదే స్థాయిలో
ఆర్థిక రంగంపై రూ.1.15 లక్షల కోట్ల ప్రభావం ఉంటుందని అభిప్రాయం


ముంబై: డీమోనిటైజేషన్‌ను 2016వ సంవత్సరపు అతిపెద్ద స్కామ్‌గా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పి.చిదంబరం ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 6 నుంచి 6.5 శాతంగానే ఉంటుందని, కేంద్ర గణాంక విభాగం (సీఎస్‌వో), ఆర్‌బీఐ వేసిన అంచనాల కంటే ఇది ఒక శాతం తక్కువ అని ఆయన అన్నారు. ఈ ఏడాది జీడీపీ రూ.150 లక్షల కోట్లు కాగా, ఇందులో ఒక శాతం అంటే రూ.1.15 లక్షల కోట్ల మేర ప్రభావం ఉంటుందని చెప్పారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైకి వచ్చిన చిదంబరం ఆదివారం విలేకరులతో మాట్లాడారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు 6 నుంచి 6.5 శాతంగానే ఉంటుందని, 2018–19లోనూ ఇదే విధంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘2016–17లో నమోదైన వృద్ధి రేటు కంటే 2017–18లో అధిక వృద్ధి సాధ్యం కాదు. ప్రపంచ ఆర్థిక రంగం ఇకపై అంత అనుకూలంగా ఉండబోదు. ఊహించడానికి సాధ్యం కాని వ్యక్తి వైట్‌హౌస్‌లో కూర్చున్నాడు’’ అని చిదంబరం పేర్కొన్నారు.

తెలివితక్కువ నిర్ణయం
ప్రధాని పేరును ప్రస్తావించకుండా ... ‘‘ఎవరో ఒకరు ఆయనపై ఒక ఆలోచనను రుద్దారు, దాంతో ఆయన టెలివిజన్‌ ముందుకు వచ్చి డీమోనిటైజేషన్‌ నిర్ణయాన్ని ప్రకటించారు’’ అని చిదంబరం అన్నారు. డీమోనిటైజేషన్‌ను తెలివితక్కువ నిర్ణయమని ప్రభుత్వం చాలా ముందుగానే తెలుసుకుంటుందన్నారు. 2016 సంవత్సరపు అతిపెద్ద స్కామ్‌గా డీమోనిటైజేషన్‌ను అభివర్ణించిన ఆయన దీన్ని అంగీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. పాత నోట్లను వెనక్కి తీసుకుని కొత్త నోట్లను ముద్రించడం వల్ల అవినీతిని లేదా నల్లధనాన్ని లేదా నకిలీ నోట్లకు అంతం పలకలేరని అభిప్రాయపడ్డారు.

 రద్దు చేసిన నోట్ల స్థానంలో తిరిగి నోట్లను ప్రవేశపెట్టే కార్యక్రమం (రీమోనిటైజేషన్‌) జూన్‌ వరకు కొనసాగుతుందన్నారు. రూ.15.44 లక్షల కోట్ల కరెన్సీని వెనక్కి తీసుకున్న తర్వాత ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీ రూ.9.5 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్పారు. రూ.150 లక్షల కోట్ల విలువగల ఆర్థిక వ్యవస్థలో రూ.9.5 లక్షల కోట్ల నగదు సరిపోదని, మరింత మొత్తంలో నోట్లను ముద్రించాల్సి ఉంటుందన్నారు. జూన్‌ నాటికి ఈ మొత్తం అందుబాటులోకి రావచ్చన్నారు.

ఒక చక్రంతో ఎలా నడుస్తుంది?
‘‘వృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ వినియోగం నాలుగు చోదకాలు. 18 నెలలుగా ప్రైవేటు పెట్టుబడులు దాదాపుగా ఏమీ లేవు. ప్రైవేటు వినియోగం చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండగా డీమోనిటైజేషన్‌ దాన్ని దెబ్బతీసింది. గత మూడేళ్ల నుంచీ ఎగుమతులు తక్కువగానే ఉన్నాయి. ఇక ప్రభుత్వ వ్యయం మాత్రం సాధ్యం అవుతుంది. ఈ ఒక్క టైర్‌లోనే గాలి ఉంది. కానీ, ఒక్క చక్రంతోనే కారు ఎలా నడుస్తుంది. కనుక ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది’’ అని చిదంబరం చెప్పారు. హైదరాబాద్, మొరాదాబాద్, కోయంబత్తూర్, జలంధర్, ఆగ్రా, కాన్పూర్‌లో 75 శాతం చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు పెద్ద నోట్ల రద్దు వల్ల మూతబడ్డాయన్నారు.  ఇవి ఏడాదిన్నరలోపు తెరుచుకోవడం సాధ్యం కాదని, దీంతో వృద్ధిపై ప్రభావం మరింత కాలం ఉంటుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement