సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి విమర్శల వర్షం కురిపించారు. ఈ ప్రాజెక్టు కూడా అచ్చం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లాంటిదేనని, ప్రతి ఒక్కర్ని చంపుకుంటూ పోతుందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రైలు భద్రతను పెరుగుపరచకుండా.. ఈ ప్రాజెక్టుపై వ్యర్థంగా ఖర్చు చేయడంపై మండిపడ్డారు. ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్డు రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌పై నిన్న జరిగిన విషాద ఘటన అనంతరం ఒక్క రోజుల్లోనే చిదంబరం బుల్లెట్ ప్రాజెక్టుపై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతతో పాటు ప్రతి దాన్ని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చంపుకుంటూ పోతుందని, ఇది అచ్చం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లాంటిదేనని పేర్కొన్నారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కంటే భద్రత, మెరుగైన సదుపాయాలపై రైల్వే దృష్టిసారించాలని సూచించారు. బుల్లెట్ ట్రైన్లు సాధారణ ప్రజల కోసం కాదని, డబ్బూ, పలుకుబడి ఉన్నవాళ్ల ప్రయాణం చేయడం కోసమని అన్నారు. చిదంబరం ట్వీట్ల రూపంలో ఈ విమర్శలు చేశారు. కాగ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు సెప్టెంబర్ 14న దేశీయ మొదటి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుంది. 500 పైగా కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లో బుల్లెట్ ట్రైన్ చేరుకుంటుంది.