పీ. చిదంబరం (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నగదు కొరత నెలకొనడంపై కేంద్రం ప్రభుత్వం, ఆర్‌బీఐ లక్ష్యంగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు దెయ్యం సర్కార్‌ను వెంటాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించి తిరిగి వాటిని జమ చేయడం లేదని అన్నారు. రూ 500, 1000 నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం రూ 2000 నోట్లు ముద్రించింది..ఇప్పుడు రూ 2000 నోట్లను కొందరు తమ వద్దే ఉంచుకుంటున్నారని చెబుతోంది. అసలు ఈ నోట్లను ముద్రించిందే అలాంటి వారి కోసమని తాము ముందునుంచే చెబుతున్నామని చిదంబరం వ్యాఖ్యానించారు.
నగదు కొరతతో నోట్ల రద్దు దెయ్యం మళ్లీ వెంటాడుతోందని అన్నారు. నోట్ల రద్దు జరిగి 17 నెలలవుతున్నా ఇప్పటివరకూ ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా ఎందుకు సర్ధుబాటు చేయలేదని చిదంబరం వరుస ట్వీట్లలో ప్రభుత్వాన్ని నిలదీశారు. నోట్ల రద్దు అనంతరం చెలామణీలో ఉన్న నగదు కేవలం 2.75 శాతమే పెరిగిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే దేశ జీడీపీకి అనుగుణంగా నగదు సరఫరాను పెంచేందుకు ఆర్‌బీఐని ప్రభుత్వం అనుమతించడం లేదని అనుమానించాల్సి ఉంటుందన్నారు. నోట్ల ముద్రణ, సరఫరా సంతృప్తికరంగా ఉందని ఆర్‌బీఐ చెబుతుండటాన్ని ఆయన ఆక్షేపించారు. ఆర్‌బీఐ వాదన వాస్తవమైతే మరి నగదు కొరత ఎందుకు ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment