అక్కడ పంచిందంతా తెల్ల ధనమేనా?
న్యూఢిల్లీ: పాత నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ప్రశ్నలు సంధించారు. డబ్బులు విచ్చలవిడిగా పంచారన్న ఆరోపణలతో ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసిన నేపథ్యంలో చిదంబరం ట్విటర్ లో స్పందించారు. ‘డీమోనిటైజేషన్ తో నల్లధనం నిర్మూలిస్తామని మనకు చెప్పారు. ఆర్కే నగర్ లో పంచిందంతా తెల్ల డబ్బా’ అని పిదంబరం ప్రశ్నించారు.
నల్లధనాన్ని అరికట్టేందుకు పాత పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు గతేడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, తమిళనాడులోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను ఎన్నికల సంఘం ఆదివారం రద్దు చేసింది. ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.