''లంచం ఎవరు తిన్నా సరే.. నేరుగా జైలుకు వెళ్లాల్సిందే'' అన్నది నిబంధనగా మారాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. లంచం కేసులో ఆరుగురు ప్రభుత్వాధికారులకు జైలుశిక్ష విధించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జీవితంలో పైకి రావడానికి అవినీతే ఏకైక మార్గం అనే ఆలోచనా దృక్పథాన్ని మార్చాల్సి ఉందని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సంజీవ్ జైన్ అన్నారు. అవినీతిని సహించడం అంటే నీతిని సహించలేకపోవడమేనని, ఇప్పటిదాకా జరిగింది చాలని ఆయన చెప్పారు.
''గత కొంత కాలంగా సమాజంలోని ఓ భాగంలో.. విజయానికి సులువైన, సురక్షితమైన మార్గం అవినీతేనన్న ఆలోచన ప్రబలిపోయింది. కానీ ఇది సరికాదు. దీన్ని పారద్రోలాల్సిన అవసరం ఉంది. లంచం తిన్నవాళ్లు నేరుగా జైలుకే వెళ్తారన్నది రాతిమీద రాతలా మారాలి'' అని సంజీవ్ జైన్ అన్నారు. ఆర్థిక మంత్రిత్వశాఖలో అవినీతికి పాల్పడిన ఆరుగురు ఉద్యోగులకు ఆయన జైలుశిక్ష విధించారు. అవినీతిని దాచిపెట్టలేమని, అవినీతిపరులను రక్షించలేమన్న విషయం ప్రతి ఒక్కరికీ అర్థం కావాలన్నారు.
కేన్సర్ లాంటి అవినీతి తినేస్తూ ఉంటే ప్రజాస్వామ్య దేశం ఏదీ ముందుకు వెళ్లలేదని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష్మీచంద్, దాస్ నాయక్, బలే సింగ్ కసానా, భగవాన్ సింగ్, రఘువేందర్ కుమార్, జేఎల్ చోప్రా అనే ఆరుగురు నిందితులు అక్రమంగా ఎల్టీసీ బిల్లులను పొందిన నేరం చేసినట్లు రుజువైందని, తద్వారా వీరు కేంద్ర ప్రభుత్వానికి నష్టం కలిగించారని అన్నారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు రమేష్ చంద్ర శుక్లా, దివాకర్ దీక్షిత్ ఇద్దరూ విచారణ సమయంలోనే మరణించారు. పురుషోత్తం లాల్ అనే మరో నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టారు.
లంచం తింటే జైలుకు వెళ్లాల్సిందే
Published Mon, Jun 23 2014 1:51 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM
Advertisement
Advertisement