cbi special court judge
-
జస్టిస్ లోయా మృతిపై కుమారుడు ఏమన్నాడంటే..
సాక్షి, న్యూఢిల్లీ : తమ తండ్రి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని దివంగత సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా కుమారుడు అనుజ్ లోయా చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబాన్ని వేధించవద్దని మీడియాకు, ఎన్జీవోలకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా తమ కుటుంబం బాధాకరమైన ఘటనలను ఎదుర్కొందని అన్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడిగా ఉన్న సొహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయ 2014 డిసెంబర్లో మరణించారు. ఈ కేసు నుంచి అమిత్ షాను ఆ తర్వాత కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. అయితే జస్టిస్ లోయా అనుమానాస్పద పరిస్థితిల్లో మరణించారంటూ దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ అంశం తీవ్రతను గమనించిన సుప్రీం కోర్టు దీనిపై సంబంధిత పత్రాలను సమర్పించాలని, సోమవారం ఈ అంశాన్ని చేపడతామని పేర్కొంది. అయితే ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టు వద్ద పెండింగ్లో ఉందని,దీన్ని సుప్రీం కోర్టు విచారించరాదని ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే బాంబే లాయర్స్ అసోసియేషన్ తరపున సుప్రీం కోర్టును కోరారు. -
లాలూ యాదవ్ పై జస్టిస్ సింగ్ ఆగ్రహం
సాక్షి, రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివ్పాల్ సింగ్ సంచలన విషయం బయటపెట్టారు. ఈ కేసు నిందితుడు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు తనకు ఫోన్లు చేసి ఆయనకు సానుకూలంగా తీర్పు వెలువరించాలని కోరుతున్నట్టు జస్టిస్ సింగ్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కోర్టు లాలూను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. లాలూను ఉద్దేశించి జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీ శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి సానుకూలంగా తీర్పు చెప్పాలంటున్నారు..అయితే నేను చట్టప్రకారమే వెళతా’ అన్నారు. దీనికి లాలూ బదులిస్తూ మీరు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా కుదురుగా తీర్పు చెప్పండి అని బదులిచ్చారు. ఈ సమయంలో కోర్టు హాలులో కేవలం ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులే ఉండాలని, ఇతరులు బయటకు వెళ్లాలని జడ్జి కోరారు. కాగా, పశుగ్రాసం కేసుకు సంబంధించి లాలూ సహా ఐదుగురు నిందితుల తరపున వాదనలను న్యాయమూర్తి ఆలకించారు. వీరికి శిక్షల ఖరారు ప్రక్రియ గురువారం జరగాల్సి ఉన్నా శుక్రవారం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
లంచం తింటే జైలుకు వెళ్లాల్సిందే
''లంచం ఎవరు తిన్నా సరే.. నేరుగా జైలుకు వెళ్లాల్సిందే'' అన్నది నిబంధనగా మారాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. లంచం కేసులో ఆరుగురు ప్రభుత్వాధికారులకు జైలుశిక్ష విధించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జీవితంలో పైకి రావడానికి అవినీతే ఏకైక మార్గం అనే ఆలోచనా దృక్పథాన్ని మార్చాల్సి ఉందని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సంజీవ్ జైన్ అన్నారు. అవినీతిని సహించడం అంటే నీతిని సహించలేకపోవడమేనని, ఇప్పటిదాకా జరిగింది చాలని ఆయన చెప్పారు. ''గత కొంత కాలంగా సమాజంలోని ఓ భాగంలో.. విజయానికి సులువైన, సురక్షితమైన మార్గం అవినీతేనన్న ఆలోచన ప్రబలిపోయింది. కానీ ఇది సరికాదు. దీన్ని పారద్రోలాల్సిన అవసరం ఉంది. లంచం తిన్నవాళ్లు నేరుగా జైలుకే వెళ్తారన్నది రాతిమీద రాతలా మారాలి'' అని సంజీవ్ జైన్ అన్నారు. ఆర్థిక మంత్రిత్వశాఖలో అవినీతికి పాల్పడిన ఆరుగురు ఉద్యోగులకు ఆయన జైలుశిక్ష విధించారు. అవినీతిని దాచిపెట్టలేమని, అవినీతిపరులను రక్షించలేమన్న విషయం ప్రతి ఒక్కరికీ అర్థం కావాలన్నారు. కేన్సర్ లాంటి అవినీతి తినేస్తూ ఉంటే ప్రజాస్వామ్య దేశం ఏదీ ముందుకు వెళ్లలేదని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష్మీచంద్, దాస్ నాయక్, బలే సింగ్ కసానా, భగవాన్ సింగ్, రఘువేందర్ కుమార్, జేఎల్ చోప్రా అనే ఆరుగురు నిందితులు అక్రమంగా ఎల్టీసీ బిల్లులను పొందిన నేరం చేసినట్లు రుజువైందని, తద్వారా వీరు కేంద్ర ప్రభుత్వానికి నష్టం కలిగించారని అన్నారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు రమేష్ చంద్ర శుక్లా, దివాకర్ దీక్షిత్ ఇద్దరూ విచారణ సమయంలోనే మరణించారు. పురుషోత్తం లాల్ అనే మరో నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టారు.