
సాక్షి, రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివ్‌పాల్ సింగ్ సంచలన విషయం బయటపెట్టారు. ఈ కేసు నిందితుడు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు తనకు ఫోన్లు చేసి ఆయనకు సానుకూలంగా తీర్పు వెలువరించాలని కోరుతున్నట్టు జస్టిస్ సింగ్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కోర్టు లాలూను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే.
లాలూను ఉద్దేశించి జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీ శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి సానుకూలంగా తీర్పు చెప్పాలంటున్నారు..అయితే నేను చట్టప్రకారమే వెళతా’ అన్నారు. దీనికి లాలూ బదులిస్తూ మీరు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా కుదురుగా తీర్పు చెప్పండి అని బదులిచ్చారు.
ఈ సమయంలో కోర్టు హాలులో కేవలం ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులే ఉండాలని, ఇతరులు బయటకు వెళ్లాలని జడ్జి కోరారు. కాగా, పశుగ్రాసం కేసుకు సంబంధించి లాలూ సహా ఐదుగురు నిందితుల తరపున వాదనలను న్యాయమూర్తి ఆలకించారు. వీరికి శిక్షల ఖరారు ప్రక్రియ గురువారం జరగాల్సి ఉన్నా శుక్రవారం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment