
సాక్షి, అమరావతి: ఏవైనా ఆరోపణలతో భర్తను పదవి నుంచి తప్పించినప్పుడు అతడి భార్యకు ఆ పదవి ఇవ్వకూడదని ఎక్కడా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. లాలూప్రసాద్‌యాదవ్ సీఎంగా దిగిపోయినప్పుడు అతడి భార్య రబ్రీదేవి సీఎం అయిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామంటూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా పోతునూరులోని శ్రీభోగేశ్వరస్వామి విశాల సహకార పరపతి సొసైటీ పర్సన్ ఇన్‌చార్జి కమిటీ చైర్‌పర్సన్‌గా రమాదేవిని నియమిస్తూ ప్రభుత్వం గతేడాది జూలై 16న జీవో 451 జారీచేసింది. దీనిని సవాలు చేస్తూ రమేశ్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారించి.. ఈ నియామకం నిబంధనలకు అనుగుణంగానే ఉందంటూ ఆ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రమేశ్ తదితరులు ధర్మాసనం ముందు అప్పీల్ చేయగా.. బుధవారం ధర్మాసనం విచారించింది.