lalu prasad yaday
-
Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన శరీరంలో కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై తేజస్వీ యాదవ్ నిర్ణయం తీసుకుంటామన్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని తేజస్వి యాదవ్ ఇది వరకే వెల్లడించారు. ఇంట్లో మెట్లపై నుంచి కిందపడిన సమయంలో లాలూకు మూడు చోట్ల గాయాలయ్యాయి. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: (Corona Updates: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు) -
భర్త తప్పుచేస్తే భార్యకు పదవి ఇవ్వకూడదా?
సాక్షి, అమరావతి: ఏవైనా ఆరోపణలతో భర్తను పదవి నుంచి తప్పించినప్పుడు అతడి భార్యకు ఆ పదవి ఇవ్వకూడదని ఎక్కడా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. లాలూప్రసాద్‌యాదవ్ సీఎంగా దిగిపోయినప్పుడు అతడి భార్య రబ్రీదేవి సీఎం అయిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామంటూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా పోతునూరులోని శ్రీభోగేశ్వరస్వామి విశాల సహకార పరపతి సొసైటీ పర్సన్ ఇన్చార్జి కమిటీ చైర్‌పర్సన్‌గా రమాదేవిని నియమిస్తూ ప్రభుత్వం గతేడాది జూలై 16న జీవో 451 జారీచేసింది. దీనిని సవాలు చేస్తూ రమేశ్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారించి.. ఈ నియామకం నిబంధనలకు అనుగుణంగానే ఉందంటూ ఆ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై రమేశ్ తదితరులు ధర్మాసనం ముందు అప్పీల్ చేయగా.. బుధవారం ధర్మాసనం విచారించింది. -
‘ఆ ఎన్నికలు అయిపోగానే ఇంధన ధరలు పెంచుతారు’
లక్నో: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించి.. ప్రజలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై స్పందించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తిరిగి ఇంధన ధరలు పెంచుతారని తెలిపారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుంది. దాన్ని నివారించడం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది’’ అని తెలిపారు. (చదవండి: పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!) ‘‘తగ్గించిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో కాలం ఉండవు. 2022లో యూపీ ఎన్నికలు అయిపోగానే.. మళ్లీ ఇంధన ధరలకు రెక్కలు వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరు 50 రూపాయలకు తగ్గిస్తే.. అప్పుడు ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది’’ అన్నారు. ఇక శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పెట్రోల్, డీజిల్ లీటర్ ధర 50 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. చదవండి: వాహనదారులకు షాకింగ్ న్యూస్...! -
గంజాయ్ తాగేవాడు.. గాగ్రా, చోలీ వేసేవాడు!
పట్నా: బిహార్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయిన ఆయన నిత్యం తనను వేధించేవాడని అతని భార్య ఐశ్వర్య రాయ్ తెలిపారు. భర్తకు డ్రగ్స్ అలవాటు ఉందని పెళ్లయిన కొత్తలోనే తనకు తెలిసిందని, డ్రగ్స్ మత్తులో అతను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె వెల్లడించారు. ఈ మేరకు పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసులో ఆమె సమాధానం ఇచ్చారు. మహిళలపై గృహ నిరోధ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టులో ఆమె అభ్యర్థన దాఖలు చేశారు. ‘తేజ్ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారి డ్రగ్స్ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఆమె తెలిపారు. 2018 మేలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల తనయుడైన తేజ్ ప్రతాప్ సింగ్, ఐశ్వర్యరాయ్ పెళ్లయింది. గత ఏడాది నవంబర్‌లో భార్య నుంచి తనకు విడాకులు కావాలని తేజ్ కోర్టులో కేసు వేశాడు. ‘తేజ్ ప్రవర్తన గురించి తన అత్తకు, ఆడపడుచులకు చెప్పేదాన్ని.. వాళ్లు విని ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాదని చెప్పేవాళ్లు. కానీ తేజ్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు ఉండకపోయేది. గంజాయి భోలేబాబాకు ప్రసాదమని, దానిని ఎలా మానాలని ఒకసారి తేజ్ నాతో చెప్పాడు’ అని ఆమె వివరించారు. తనకు పెద్దగా చదువులేదని, వండిపెట్టి.. పిల్లల్ని కనడమే తన బాధ్యత అని తేజ్ తనను వేధించేవాడని ఆమె తెలిపారు. తేజ్, అతని కుటుంబసభ్యులు తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నా.. తానింకా అత్తవారింటిలో వారితో కలిసే ఉంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. -
నాన్నను కలువకుండా కుట్ర చేస్తున్నారు!
సాక్షి, పట్నా: గుండెజబ్బుతో రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలుసుకోనివ్వకుండా ‘నియంతృత్వ’ బీజేపీ కిరాతకంగా వ్యవహరిస్తోందని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ హృద్రోగ సమస్యతో బాధపడుతుండటంతో ఆయనను రాంచీలోని ఆస్పత్రికి తరలించి జైలు అధికారులు చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి వార్డులో ఉన్న లాలూను కలిసేందుకు ప్రతి శనివారం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. తాజాగా తన తండ్రిని కలిసేందుకు తనను అనుమతించలేదని, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని తేజస్వి ట్విటర్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రెండు వారాల కిందట లాలూకు ఈసీజీ, ఎక్స్‌రే తీయాలని డాక్టర్లు చెప్పారు. కానీ, ఇంతవరకు ఆ పరీక్షలు చేయించలేదు. ఇందుకోసం మరో బిల్డింగ్‌కు లాలూను మార్చాల్సి ఉంటుందని, అందుకు కావాల్సిన అనుమతులు లేకపోవడంతో ఆ పరీక్షలు చేయించడం లేదని జైలు అధికారులు చెప్తున్నారు’ అని తేజస్వి ట్వీట్ చేశారు. ‘నిన్న (శనివారం) మా నాన్నను కలిసేందుకు రాంచీ ఆస్పత్రికి వెళ్లాను. కానీ ఆయనను చూసేందుకు అనుమతించలేదు. ఇది నియంతృత్వ బీజేపీ పథకమే. తన తండ్రిని కొడుకు కలుసుకోనివ్వకుండా బీజేపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారు. లాలూకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. ఆయన గదిలో ప్రతి రోజు తనిఖీలు జరుపుతున్నారు’ అని తేజస్వి మరో ట్వీట్లో పేర్కొన్నారు. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో దోషిగా తేలిన లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనారోగ్యం రీత్యా గత ఏడాది మేలో ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించినప్పటికీ.. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఆగస్టులో మళ్లీ జైలుకు వెళ్లారు. -
ఐఆర్సీటీసీ స్కామ్ : లాలూ దంపతులకు బెయిల్
-
ఐఆర్సీటీసీ స్కామ్ : లాలూ దంపతులకు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ సహా ఇతరులకు ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ లక్ష వ్యక్తిగత బాండ్ అదే మొత్తం పూచీ కత్తుపై వారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో బెయిల్ లభించడం పట్ల తేజస్వి యాదవ్ స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, న్యాయవ్యవస్ధ పట్ల తమకు విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌కు శనివారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. పూరి, రాంచీలో రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంలో లాలూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లాలూచీ పడ్డారని దర్యాప్తు ఏజెన్సీ ఆరోపిస్తోంది. -
‘మేమిద్దరం ఉత్తర, దక్షిణ ధ్రువాల లాంటి వాళ్లం’
పాట్నా : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. పెళ్లైన ఆర్నెళ్లకే విడాకులు కోరటం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ విషయం గురించి తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. ‘ఇది నిజం.. నేను నా భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాను. మా ఇద్దరి అభిప్రాయాలు ఏమాత్రం కలవలేదు. ఆలోచనల్లోను, అభిరుచుల్లోనూ మేము ఇద్దరం ఉత్తర, దక్షిణ ధృవాల వంటి వాళ్లం. మేం కలిసుండటం అసాధ్యం. మేం చాలాసార్లు మా తల్లిదండ్రుల ముందే గొడవపడ్డాము. ప్రతి చిన్న విషయానికి గొడవపడటం తప్ప ఈ ఆర్నెళ్ల జీవితంలో మేం సంతోషంగా గడిపిన క్షణాలు లేవు. కలిసి ఉంటూ బాధపడే కంటే.. విడిపోయి సంతోషంగా ఉండటం మంచిదనిపించింది. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి హిస్టరి గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రికా రాయ్ కుమార్తె. ఈ ఏడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ - ఐశ్యర్యల వివాహమైంది. అయితే విడాకుల విషయం గురించి ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
ఆ వార్తలకు ఇలా చెక్ పెట్టారు..
సాక్షి, పట్నా : ఆర్జేడీ నేతలు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 71వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాలూ కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ మధ్య విభేదాలు లేవంటూ యాదవ్ సోదరులు సంకేతాలు పంపినా పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లో మాత్రం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం తేజ్ ప్రతాప్ చేసిన ట్వీట్లో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని పేర్కొనడంతో కుటుంబ సభ్యుల్లో విభేదాలపై ఊహాగానాలు చెలరేగాయి. తాను అస్త్రసన్యాసం చేసి అర్జునుడికి (తేజస్వి యాదవ్) వాటిని అందిస్తానని మహాభారతాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అయితే ఈ వార్తలను తేజ్ ప్రతాప్ తోసిపుచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాగా, పశుగ్రాసం కేసులో లాలూ ప్రస్తుతం బిర్సాముందా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2013 నుంచి చోటుచేసుకున్న నాలుగు పశుగ్రాస కుంభకోణం కేసుల్లో లాలూను దోషిగా నిర్ధారించారు. ఇక దుంకా ట్రెజరీ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
లాలూ తనయుడికి బీజేపీ నేత ప్రశంస
పట్నా : సొంత పార్టీని, ప్రధాని మోదీని విమర్శిస్తూ వార్తల్లో ఉండే బీజేపీ అసంతృప్త నాయకుడు, నటుడు శతృఘ్నసిన్హా మంగళవారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఇంటికి వెళ్లిన సందర్భంగా ఆర్జేడీ వారసుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. తేజస్వి యాదవ్‌కు మంచి భవిష్యతు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్‌కు ఉన్న పరిణీతిని చూస్తే ముచ్చటేస్తుంది. అతన్ని చూస్తే నాకు వయసులో ఉన్న శరద్‌పవార్ గుర్తుకువస్తున్నాడని అన్నారు. ‘తేజస్వి యాదవ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాడు. నితీష్‌కుమార్‌కు పోటీ అవుతాడని నేను కచ్చితంగా చెప్పలేను. కానీ నితీష్‌కుమార్ కూడా ఈ యువకుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఒప్పుకుంటారు. పోయిన వారం జరిగిన ‘బిహారి దివాస్’ పండగకు లాలు కుటుంబం నన్ను ఆహ్వానిస్తే ఆ సమయంలో నేను లాలూజీని కలవొచ్చనుకున్నాను. కానీ ఈ బిహారిబాబు నన్ను పిలవలేదు అందుకు కారణం అందరికీ తేలుసు, నేను వివరించాల్సిన అవసరం లేద’ని అన్నారు. పట్నాలో లాలు ఇంటికి రావడానికి ఒకరోజు ముందు రాంచీలో ఆస్పత్రిలో ఉన్న ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ను శతృఘ్నసిన్హా కలిసి వచ్చారు. ఇన్ని రోజుల తర్వాత లాలును కలవడం చాలా సంతోషంగా ఉంది, ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. భవిష్యత్ రాజకీయాల గురించి, బిహార్‌లో జరిగిన మతఘర్షణల కారణంగా బీజేపీపై వచ్చిన ఆరోపణల గురించి సిన్హాను అడగ్గా.. తరువాత మాట్లాడదామంటూ సమాధానం దాటవేశారు. దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్‌కి కోర్టు శిక్ష విధించడంతో ఆయనను రాంచీలోని బిర్సా ముండా జైలుకు తరలించారు. జైలులో అనారోగ్యం పాలవడంతో మార్చి 17న ఆయన రాంచీలోని ఆస్పత్రిలో చేర్చారు. -
44వేల ప్రపోజల్స్.. ఆ అమ్మాయినే చేసుకుంటా!
పట్నా: లాలూప్రసాద్ యాదవ్ రాజకీయ వారసుడు, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా రాజకీయాల్లో రాణిస్తున్న ఈ 28 ఏళ్ల యువ బ్రహ్మచారికి ఇప్పటికే 44వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. అయినా ఇప్పుడే పెళ్లికి తొందరేమీ లేదంటున్నారు తేజస్వి. తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, తనది అరెంజ్డ్ మ్యారేజ్ కానుందని తెలిపారు. లాలుప్రసాద్ యాదవ్ జైలుపాలైన తర్వాత ఆర్జేడీ నడిపిస్తున్న తేజస్వి.. ఇటీవలి బిహార్ ఉప ఎన్నికల్లో ఘనవిజయాలు దక్కడంతో జోరుమీద ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవద్దని ఆయన భావిస్తున్నారు. ‘ రాజకీయాల్లో నా పెద్దన్నలైన చిరాగ్ పాశ్వాన్, నిషాంత్‌కుమార్ పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను’ అని ఆయన అంటున్నారు. చిరాగ్ ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వన్ తనయుడు కాగా, నిశాంత్ జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ కొడుకు. తేజస్వి లాలు చిన్న కొడుకు అయినప్పటికీ.. లాలూ రాజకీయ వారుసుడిగా తెరపైకి వచ్చారు. లాలూ కొడుకు తేజ్ ప్రతాప్, కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నప్పటికీ వారికి రాని రాజకీయ గుర్తింపు తేజస్వి సంపాదించారు. బిహార్ ఉప ముఖ్యమంత్రిగా, రోడ్డు నిర్మాణ శాఖ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయనకు వాట్సాప్‌లో 44వేల పెళ్లి ప్రతిపాదనలు రావడం అప్పట్లో హల్చల్ చేసింది. రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. తేజస్వి ఇంకా పెళ్లి చేసుకోకపోవడం చర్చనీయాంశం కాగా.. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘భారతీయ కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు నిశ్చయం చేస్తారు. నా పెళ్లి కూడా మా అమ్మనాన్నల ఇష్టప్రకారం జరుగుతుంది’ అని తేజస్వి చెప్పాడు. -
‘అతను పప్పు కాదు’
పట్నా: బిహార్‌లో లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం వెనుక కనిపించని శక్తి తేజస్వీ యాదవ్‌పై ప్రశంసలుకురుస్తున్నాయి. తండ్రి లాలూ ప్రసాద్ జైలుకెళ్లిన తరువాత ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లోనే ఆర్జేడీ ఘనవిజయం సాధించిన దరిమిలా.. ‘మా నాయకుడు పప్పు కాదు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడు’అంటూ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అరారీయా , జహనాబాద్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అరారియా లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 61 వేల పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం గెలుపొందారు. సర్ఫరాజ్‌కు 5,09,334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్‌కు 4,47,346 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ అరారియాకకు ఉప ఎన్నిక జరుగగా.. తస్లిముద్దీన్ తనయుడు అలాంను ఆర్జేడీ బరిలోకి దింపింది. తండ్రి తర్వాత ఆయన తనయుడే అరారియాలో (ఆర్జేడీ) ఘనవిజయం సాధించింది. ఇక జహనాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆర్జేడీ గెలుచుకుంది. ఆర్జేడీ అభ్యర్థి కృష్ణమోహన్ యాదవ్ ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, జేడీయూకు చెందిన అభిరామ్ శర్మపై 35,000 ఓట్ల మెజార్టీతో కృష్ణమోహన్ గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు తేజస్వీపై ప్రశంసలు కురిపిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.మహాకూటమి నుంచి జేడీయూ వైదొలిగిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక ఆ పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్‌కు పరీక్షగా నిలిచాయన్న సంగతి విదితమే. -
లాలూ యాదవ్ పై జస్టిస్ సింగ్ ఆగ్రహం
సాక్షి, రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివ్‌పాల్ సింగ్ సంచలన విషయం బయటపెట్టారు. ఈ కేసు నిందితుడు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు తనకు ఫోన్లు చేసి ఆయనకు సానుకూలంగా తీర్పు వెలువరించాలని కోరుతున్నట్టు జస్టిస్ సింగ్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కోర్టు లాలూను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. లాలూను ఉద్దేశించి జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీ శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి సానుకూలంగా తీర్పు చెప్పాలంటున్నారు..అయితే నేను చట్టప్రకారమే వెళతా’ అన్నారు. దీనికి లాలూ బదులిస్తూ మీరు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా కుదురుగా తీర్పు చెప్పండి అని బదులిచ్చారు. ఈ సమయంలో కోర్టు హాలులో కేవలం ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులే ఉండాలని, ఇతరులు బయటకు వెళ్లాలని జడ్జి కోరారు. కాగా, పశుగ్రాసం కేసుకు సంబంధించి లాలూ సహా ఐదుగురు నిందితుల తరపున వాదనలను న్యాయమూర్తి ఆలకించారు. వీరికి శిక్షల ఖరారు ప్రక్రియ గురువారం జరగాల్సి ఉన్నా శుక్రవారం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
బ్రేకింగ్: సీబీఐ విచారణకు లాలూ ప్రసాద్ యాదవ్
-
సీబీఐ విచారణకు లాలూ ప్రసాద్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. రైల్వే హోటళ్ల టెండర్ కేసులో అవినీతికి పాల్పడినట్టు లాలూ కుటుంబసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే లాలూ, ఆయన తనయుడు తేజస్వి సీబీఐ విచారణకు హాజరయ్యారు. గత నెల 10, 11 తేదీల్లో వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, ఈ కేసు విచారణలో మరింత వివరాలు రాబట్టేందుకు మరోసారి లాలూను సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. రైల్వే హోటళ్ల టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా లాలూ తనవారికి కట్టబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
గుర్రపు బండ్లలో లాలు ప్రచారం
పాట్నా: ఎన్నికల ప్రచారంమంటే ఎలా ఉండాలి? పదుల సంఖ్యలో వాహన శ్రేణి.. చెవులు గింగిరాలెత్తే శబ్దాలతో బహిరంగ సభలు.. అభ్యర్థితోపాటు అతని అనుచరుల హడావిడి.. ముఖ్యనేతలైతే హెలికాప్టర్ లో చక్కర్లు.. అయితే ఇదంతా ఓల్డ్ ట్రెండ్ అంటూ ప్రచార పదనిసలో సరికొత్త రాగం పలికించబోతున్నారు బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్! ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేవలం గుర్రపు బండ్లనే వినియోగిస్తామని ఆయన ప్రకటించారు. నాలుగు లేన్ల రోడ్లలో పెద్దపెద్ద కార్లలో తిరగటం బీజేపీ నాయకుల అలవాటని, అందుకు విరుద్ధంగా సామాన్యుడి వాహనమైన టాంగాలోనే ఆర్జేడీ అభ్యర్థులు ప్రచారం చేస్తారని, తద్వారా గుర్రపు బండ్లు లాగేవారికి ఆదాయం కూడా సమకూరుతుందని లాలు అన్నారు. ప్రచార సామగ్రితో పాటు చిన్న మైక్ సెట్ ఒకటి గుర్రపు బండ్లలో అమర్చుతామని, ఒక్కో అభ్యర్థి దానిపై కనీసం 10 గ్రామాల్లో ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. బుధవారం పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం అనంతరం ఆయన ఈ విషయాలను మీడియాకు చెప్పారు. ప్రచారం కోసం ఇప్పటికే 50 గుర్రపు బండ్లను సిద్ధం చేశామని, ఒక్కో బండికి రోజుకు 500 రూపాయల చొప్పున బాడుగ చెల్లించనున్నట్లు తెలిపారు. బీజేపీ బీహార్ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తోదని మండిపడ్డ ఆయన.. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ప్రజలకు చేసిన వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. నల్లధనం వెలికితీత, బీహార్ కు ప్రత్యేక హోదా తదితర హామీలను మోదీ ఎప్పుడో విస్మరించారని ఎద్దేవా చేశారు.