లాలూ కుటుంబంతో శత్రుఘ్నసిన్హా
పట్నా : సొంత పార్టీని, ప్రధాని మోదీని విమర్శిస్తూ వార్తల్లో ఉండే బీజేపీ అసంతృప్త నాయకుడు, నటుడు శతృఘ్నసిన్హా మంగళవారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఇంటికి వెళ్లిన సందర్భంగా ఆర్జేడీ వారసుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. తేజస్వి యాదవ్‌కు మంచి భవిష్యతు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్‌కు ఉన్న పరిణీతిని చూస్తే ముచ్చటేస్తుంది. అతన్ని చూస్తే నాకు వయసులో ఉన్న శరద్‌పవార్ గుర్తుకువస్తున్నాడని అన్నారు.
‘తేజస్వి యాదవ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాడు. నితీష్‌కుమార్‌కు పోటీ అవుతాడని నేను కచ్చితంగా చెప్పలేను. కానీ నితీష్‌కుమార్ కూడా ఈ యువకుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఒప్పుకుంటారు. పోయిన వారం జరిగిన ‘బిహారి దివాస్’ పండగకు లాలు కుటుంబం నన్ను ఆహ్వానిస్తే ఆ సమయంలో నేను లాలూజీని కలవొచ్చనుకున్నాను. కానీ ఈ బిహారిబాబు నన్ను పిలవలేదు అందుకు కారణం అందరికీ తేలుసు, నేను వివరించాల్సిన అవసరం లేద’ని అన్నారు. పట్నాలో లాలు ఇంటికి రావడానికి ఒకరోజు ముందు రాంచీలో ఆస్పత్రిలో ఉన్న ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ను శతృఘ్నసిన్హా కలిసి వచ్చారు. ఇన్ని రోజుల తర్వాత లాలును కలవడం చాలా సంతోషంగా ఉంది, ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు.
భవిష్యత్ రాజకీయాల గురించి, బిహార్‌లో జరిగిన మతఘర్షణల కారణంగా బీజేపీపై వచ్చిన ఆరోపణల గురించి సిన్హాను అడగ్గా.. తరువాత మాట్లాడదామంటూ సమాధానం దాటవేశారు. దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్‌కి కోర్టు శిక్ష విధించడంతో ఆయనను రాంచీలోని బిర్సా ముండా జైలుకు తరలించారు. జైలులో అనారోగ్యం పాలవడంతో మార్చి 17న ఆయన రాంచీలోని ఆస్పత్రిలో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment