గుర్రపు బండ్లలో లాలు ప్రచారం
పాట్నా: ఎన్నికల ప్రచారంమంటే ఎలా ఉండాలి? పదుల సంఖ్యలో వాహన శ్రేణి.. చెవులు గింగిరాలెత్తే శబ్దాలతో బహిరంగ సభలు.. అభ్యర్థితోపాటు అతని అనుచరుల హడావిడి.. ముఖ్యనేతలైతే హెలికాప్టర్ లో చక్కర్లు.. అయితే ఇదంతా ఓల్డ్ ట్రెండ్ అంటూ ప్రచార పదనిసలో సరికొత్త రాగం పలికించబోతున్నారు బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్! ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేవలం గుర్రపు బండ్లనే వినియోగిస్తామని ఆయన ప్రకటించారు.
నాలుగు లేన్ల రోడ్లలో పెద్దపెద్ద కార్లలో తిరగటం బీజేపీ నాయకుల అలవాటని, అందుకు విరుద్ధంగా సామాన్యుడి వాహనమైన టాంగాలోనే ఆర్జేడీ అభ్యర్థులు ప్రచారం చేస్తారని, తద్వారా గుర్రపు బండ్లు లాగేవారికి ఆదాయం కూడా సమకూరుతుందని లాలు అన్నారు. ప్రచార సామగ్రితో పాటు చిన్న మైక్ సెట్ ఒకటి గుర్రపు బండ్లలో అమర్చుతామని, ఒక్కో అభ్యర్థి దానిపై కనీసం 10 గ్రామాల్లో ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు.
బుధవారం పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం అనంతరం ఆయన ఈ విషయాలను మీడియాకు చెప్పారు. ప్రచారం కోసం ఇప్పటికే 50 గుర్రపు బండ్లను సిద్ధం చేశామని, ఒక్కో బండికి రోజుకు 500 రూపాయల చొప్పున బాడుగ చెల్లించనున్నట్లు తెలిపారు. బీజేపీ బీహార్ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తోదని మండిపడ్డ ఆయన.. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ప్రజలకు చేసిన వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. నల్లధనం వెలికితీత, బీహార్ కు ప్రత్యేక హోదా తదితర హామీలను మోదీ ఎప్పుడో విస్మరించారని ఎద్దేవా చేశారు.