
పట్నా: బిహార్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయిన ఆయన నిత్యం తనను వేధించేవాడని అతని భార్య ఐశ్వర్య రాయ్ తెలిపారు. భర్తకు డ్రగ్స్ అలవాటు ఉందని పెళ్లయిన కొత్తలోనే తనకు తెలిసిందని, డ్రగ్స్ మత్తులో అతను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె వెల్లడించారు. ఈ మేరకు పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసులో ఆమె సమాధానం ఇచ్చారు. మహిళలపై గృహ నిరోధ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టులో ఆమె అభ్యర్థన దాఖలు చేశారు. ‘తేజ్ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారి డ్రగ్స్ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఆమె తెలిపారు.
2018 మేలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల తనయుడైన తేజ్ ప్రతాప్ సింగ్, ఐశ్వర్యరాయ్ పెళ్లయింది. గత ఏడాది నవంబర్‌లో భార్య నుంచి తనకు విడాకులు కావాలని తేజ్ కోర్టులో కేసు వేశాడు. ‘తేజ్ ప్రవర్తన గురించి తన అత్తకు, ఆడపడుచులకు చెప్పేదాన్ని.. వాళ్లు విని ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాదని చెప్పేవాళ్లు. కానీ తేజ్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు ఉండకపోయేది. గంజాయి భోలేబాబాకు ప్రసాదమని, దానిని ఎలా మానాలని ఒకసారి తేజ్ నాతో చెప్పాడు’ అని ఆమె వివరించారు. తనకు పెద్దగా చదువులేదని, వండిపెట్టి.. పిల్లల్ని కనడమే తన బాధ్యత అని తేజ్ తనను వేధించేవాడని ఆమె తెలిపారు. తేజ్, అతని కుటుంబసభ్యులు తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నా.. తానింకా అత్తవారింటిలో వారితో కలిసే ఉంటున్నట్టు ఆమె పేర్కొన్నారు.