పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి వేడుకలో రసాభాస చోటుచేసుకుంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన కొందరు దుండగులు చేతి వాటం ప్రదర్శించారు. తినే ప్లేట్లు, ఆహార పదార్థాలు.. ఇలా కంటికి కనిపించిన వస్తువునల్లా దొంగిలించుకుపోయారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. శనివారం రాత్రి పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్‌లో లాలూ పెద్ద కొడుకు తేజ్- ఆర్జేడీ సీనియర్ నేత చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే.
వధువరులు దండలు మార్చుకుంటున్న సమయంలో ఆర్జేడీ కార్యకర్తలమంటూ కొందరు.. వీఐపీ, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హాలులోకి లోపలికి ప్రవేశించారు. టపాసులతోపాటు, ప్లేట్లు, భోజనం, అతిథుల కోసం ప్యాకింగ్ చేసిన గిఫ్ట్‌లను పట్టుకుని పారిపోయారు. వారిని గమనించిన కార్యకర్తలు వెంబడించి అడ్డుకునే యత్నం చేశారు. కానీ, అప్పటికే వారు చాలా దూరం వెళ్లిపోయారు. ఈ పరిణామాల నడుమ తమపై దాడి జరిగిందని, కెమెరాలు ధ్వంసం అయ్యాయని కొందరు మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఆర్జేడీ నేతల జోక్యంతో అంతా శాంతించారు.
నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇది జరిగినట్లు ఆర్జేడీ నేత ఒకరు తెలిపారు. 200 స్టాళ్ల ద్వారా సుమారు 7 వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయగా.. ఊహించని రీతిలో జనాలు హాజరయ్యారు. మరోవైపు భోజనాల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఇంకోవైపు ప్రాంగణమంతా చెత్త చెదారంతో నిండిపోయింది. బాహుబలి తరహా సెట్స్ .. భారీ వ్యయంతో ఈ వివాహవేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలని యత్నించినప్పటికీ చివరకు గందరగోళ పరిస్థితుల్లో వేడుక ముగిసింది.
లాలూకి నితీశ్ కౌగిలింత.. కూటమితో విడిపోయాక తొలిసారి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లాలూలు ఒకే వేదికపై సందడి చేశారు. తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన నితీశ్.. లాలూను ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరు కాసేపు ముచ్చటించుకోగా.. నవ దంపతులు తేజ్ ప్రతాప్-ఐశ్వర్యలను నితీశ్ ఆశీర్వదించారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment