సాక్షి, పట్నా: గుండెజబ్బుతో రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను కలుసుకోనివ్వకుండా ‘నియంతృత్వ’ బీజేపీ కిరాతకంగా వ్యవహరిస్తోందని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ హృద్రోగ సమస్యతో బాధపడుతుండటంతో ఆయనను రాంచీలోని ఆస్పత్రికి తరలించి జైలు అధికారులు చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి వార్డులో ఉన్న లాలూను కలిసేందుకు ప్రతి శనివారం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. తాజాగా తన తండ్రిని కలిసేందుకు తనను అనుమతించలేదని, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని తేజస్వి ట్విటర్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘రెండు వారాల కిందట లాలూకు ఈసీజీ, ఎక్స్‌రే తీయాలని డాక్టర్లు చెప్పారు. కానీ, ఇంతవరకు ఆ పరీక్షలు చేయించలేదు. ఇందుకోసం మరో బిల్డింగ్‌కు లాలూను మార్చాల్సి ఉంటుందని, అందుకు కావాల్సిన అనుమతులు లేకపోవడంతో ఆ పరీక్షలు చేయించడం లేదని జైలు అధికారులు చెప్తున్నారు’ అని తేజస్వి ట్వీట్ చేశారు. ‘నిన్న (శనివారం) మా నాన్నను కలిసేందుకు రాంచీ ఆస్పత్రికి వెళ్లాను. కానీ ఆయనను చూసేందుకు అనుమతించలేదు. ఇది నియంతృత్వ బీజేపీ పథకమే. తన తండ్రిని కొడుకు కలుసుకోనివ్వకుండా బీజేపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారు. లాలూకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. ఆయన గదిలో ప్రతి రోజు తనిఖీలు జరుపుతున్నారు’ అని తేజస్వి మరో ట్వీట్లో పేర్కొన్నారు.
దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో దోషిగా తేలిన లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనారోగ్యం రీత్యా గత ఏడాది మేలో ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించినప్పటికీ.. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఆగస్టులో మళ్లీ జైలుకు వెళ్లారు.
నాన్నను కలువకుండా కుట్ర చేస్తున్నారు!
Published Sun, Apr 7 2019 6:42 PM | Last Updated on Sun, Apr 7 2019 6:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment