ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సభ్యులు
సాక్షి, పట్నా : ఆర్జేడీ నేతలు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 71వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాలూ కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ మధ్య విభేదాలు లేవంటూ యాదవ్ సోదరులు సంకేతాలు పంపినా పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లో మాత్రం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత వారం తేజ్ ప్రతాప్ చేసిన ట్వీట్‌లో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని పేర్కొనడంతో కుటుంబ సభ్యుల్లో విభేదాలపై ఊహాగానాలు చెలరేగాయి. తాను అస్త్రసన్యాసం చేసి అర్జునుడికి (తేజస్వి యాదవ్) వాటిని అందిస్తానని మహాభారతాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అయితే ఈ వార్తలను తేజ్ ప్రతాప్ తోసిపుచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
కాగా, పశుగ్రాసం కేసులో లాలూ ప్రస్తుతం బిర్సాముందా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2013 నుంచి చోటుచేసుకున్న నాలుగు పశుగ్రాస కుంభకోణం కేసుల్లో లాలూను దోషిగా నిర్ధారించారు. ఇక దుంకా ట్రెజరీ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment