ఏసీబీ వల.. ‘అవినీతి’ విలవిల..!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రతిరోజూ సరాసరి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడుతున్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల్లోపే అవినీతిపరుల సంఖ్య రెట్టింపు ఉంది. ఈ వివరాలు ఏసీబీ శాఖలో నమోదు చేసిన కేసులను బట్టి వెలుగులోకి వచ్చింది. 2014 జనవరి నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 534 ఫిర్యాదుల్లో అధికారులు వలపన్ని లంచాలు స్వీకరిస్తున్న 722 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు.
అదే 2013లో మొత్తం 583 కేసులు నమోదుకాగా 500 మందికి పైగా ఉద్యోగులను అరెస్టు చేశారు. 2013 జూన్ 21 వరకు 267 కేసుల్లో వలపన్ని 341 మందిని అరెస్టు చేశారు. అదే ఈ ఏడాది కేవలం అరు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఈ సంఖ్య నమోదైంది.ఇదిలాఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలతో పోలిస్తే అవినీతిలో పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానంలో రెవెన్యూ శాఖ ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైన విషయం తెలిసిందే. ఇదే బాటలో మిగతా శాఖలూ పోటీపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరేళ్లలో నమోదైన లంచం కేసులు...
సంవత్సరం నమోదైన కేసులు
2014 (జూన్) 534
2013 583
2012 489
2011 479
2010 486
2009 475