పైసా వసూల్‌!  | Fraud And Bribes In Medak Police Stations | Sakshi
Sakshi News home page

పైసా వసూల్‌! 

Published Mon, May 20 2019 1:15 PM | Last Updated on Mon, May 20 2019 1:15 PM

Fraud And Bribes In Medak Police Stations - Sakshi

మెదక్‌ జిల్లా కేంద్రం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని హవేళి ఘణాపూర్‌ మండల పరిధిలోని ఓ గ్రామంలోని మహిళపై ఓ వ్యక్తి ఇటీవల లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి బాధిత మహిళ కుటుంబీకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిన ఖాకీలు.. అలాంటి ప్రయత్నమేదీ చేయకుండానే ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. కేసు లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి కాంప్రమైజ్‌ చేసి డబ్బులు దండుకున్నట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు ఈ ఒక్క ఠాణాకు మాత్రమే పరిమితం కాలేదు. జిల్లాలోని చాలా పోలీస్‌ స్టేషన్లలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. న్యాయం చేయాలని వచ్చే బాధి తులకు భరోసా ఇవ్వాల్సిన.. రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే వసూల్‌ రాజాలుగా మారారు. పంచాయితీకో రేటు.. తీర్పుకింత అన్నట్లు పెద్ద మనుషుల సహకారంతో వసూళ్ల పర్వం సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

సాక్షి, మెదక్‌: క్షణికావేశంలో చోటుచేసుకునే చిన్న చిన్న సంఘటనలకు సంబంధించి కేసులు వద్దు.. రాజీయే ముద్దు.. ఇటీవల పోలీస్‌ స్టేషన్లకు వచ్చే బాధితులకు పోలీస్‌ అధికారులు చెబుతున్న మంచి మాట. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆచరణలో ఇది పక్కదారి పడుతోంది. ఇటీవల జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరుగుతున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవినీతికి అలవాటుపడిన పలువురు పోలీసులు పంచాయితీలను ప్రత్యేక ఆదాయ వనరుగా మల్చుకుంటున్నారు. పెద్ద మనుషుల సహకారంతో వసూళ్లకు తెగబడ్డారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని బాధితులు లబోదిబోమంటున్నారు.

ఎలా అంటే..
పోలీస్‌ స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసుకుని.. ఒప్పందం చేసుకోవాలని  సూచిస్తున్నారు. ‘పెద్దల’ సహకారంతో దిద్దుబాటుచర్యలు చేపడుతున్నారు. సమస్య, పంచాయితీ తీవ్రత, ఫిర్యాదుదారులు, అవతలి వైపు వారి ఆర్థిక స్థోమతను బట్టి రేటు ఫిక్స్‌ చేసి.. ప్రత్యేకంగా నియమించుకున్న సిబ్బందితో వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. మరీ చిన్న సంఘటనలైతే కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లకే వదిలి పెడుతుండగా.. ఇతర పంచాయితీలకు సంబంధించి తీవ్రతను బట్టి సుమారు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కోసారి ఇరువర్గాల నుంచి.. మరోసారి తప్పు ఎవరిది అని పెద్దలు నిర్ణయిస్తారో వారి నుంచి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పెద్ద మనుషులే రాయబారం చేస్తున్నట్లు వినికిడి. ఇటు పోలీసులు, అటు పెద్దమనుషులకు తప్పనిసరిగా ముడుపులు ఇవ్వాల్సి వస్తుండడంతో బాధితులు ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో అప్పులు చేసి ఇచ్చామని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూ తగాదాల్లో అధికం
జిల్లాలో ఎస్పీ కార్యాలయం, రెండు డీఎస్పీ, ఆరు సర్కిల్‌ కార్యాలయాలతోపాటు 21 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 600 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తలు, బంధువుల మధ్య గొడవలు, భూ, ఆస్తి తగాదాలు, ఇరువర్గాల ఘర్షణ వంటి ఇతరత్రా ఘటనల్లో ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇందులో భూ సంబంధిత సమస్యలే అధికంగా ఉంటున్నాయి. సివిల్‌ కేసుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. ఈ క్రమంలో అవినీతికి అలవాటు పడిన పలువురు పోలీస్‌ అధికారులు ఇరువర్గాలను పిలిపించి పెద్దమనుషుల సమక్షంలో రాజీ పేరిట డబ్బులు గుంజుతున్నారు. ప్రధానంగా భూ సంబంధిత కేసుల్లో స్థోమతను బట్టి అక్రమార్కులకు అండగా ఉంటూ పెద్దమొత్తంలో దండుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న తూప్రాన్, మనోహరాబాద్‌ మండలాల్లో భూ సమస్యలు అధికం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తగాదాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ భూ సంబంధిత కేసుల్లో తలదూర్చి కావాల్సినంత చక్కబెట్టుకుంటున్నట్లు సమాచారం.

కొన్ని ఉదాహరణలు..
ఔ హవేళిఘనాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు ఇటీవల అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. పెద్ద మనుషుల సహకారంతో స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించి ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.ఔ సివిల్‌ కేసుల్లో పోలీసులు తలదూర్చొద్దనే నిబంధనలు ఉన్నాయి. శాంతి భద్రతల సమస్య పేరిట ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నంలో డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తూప్రాన్‌ డివిజన్‌లోని ఓ మండలంలో నూతనంగా ఏర్పడిన పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఒకరిపై వేటుపడింది. ఆ ఉద్యోగిని అధికారులు వేరొక ప్రాంతానికి బదిలీ చేశారు. అయినా.. ఆ పోలీస్‌ స్టేషన్‌లో పలువురు ఖాకీలు పిటిషన్‌దారుల నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్నట్లు సమాచారం.

ఔ ఉమ్మడి తూప్రాన్‌ మండలంలో 44వ జాతీయ రహదారి సుమారు 45 కిలోమీటర్లు విస్తరించి ఉంది. నిత్యం ఏదో ఒక చోట వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుల్లో సైతం పెద్దమనుషుల సహకారంతో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.ఔ పెద్దశంకరంపేట పోలీస్‌ స్టేషన్‌కు చిల్లర దొంగతనాలు, అక్రమ సంబంధం, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇరువర్గాల ఘర్షణ వంటి ఘటలనకు సంబంధించి నిత్యం రెండు నుంచి మూడు వరకు ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. రాజీ అనంతరం కింది స్థాయి పోలీస్‌ సిబ్బందికి మద్యంతోపాటు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు సమర్పించాల్సి వస్తోందని తెలిసింది. ఇదే పరిస్థితి టేక్మాల్, అల్లాదుర్గం, కొల్చారం మండలాల్లోనూ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఔ రేగోడ్‌ మండలంలోని పోలీస్‌ స్టేషన్‌లో రాజీ పేరిట దండుకోవడం మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవల తాజాగా చోటుచేసుకున్న ఘటన అవినీతి, దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. ఓ కేసు విషయమై ఒకరిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన ఓ కానిస్టేబుల్‌ అతడి జేబులో చేయి పెట్టాడు. సెల్‌ఫోన్‌తోపాటు జేబులో ఉన్న రూ.200 తీసుకున్నాడు. మెడికల్‌ షాపునకు వెళ్లి మందు గోలీలు తీసుకోవాలని.. ఇంటికెళ్లి ఇచ్చి వస్తానని సదరు వ్యక్తి చెప్పినా ఆ పోలీస్‌ వినలేదు. ఇంతలో ఫోన్‌ మోగింది.. మందు గోలీలు ఏమయ్యాయని అవతలి వ్యక్తి అంటుండగా..కానిస్టేబుల్‌ స్విచ్ఛాఫ్‌ చేసి తిట్టి పంపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement