medak police
-
ఎంఎస్సీ చదివి ఇంట్లో చెప్పకుండా ఒకరు.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి మరొకరు..
హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామనాయుడు కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన అంజనేయులు కూతురు అర్చన(25) ఎంఎస్సీ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 13వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఫోన్‌ను సైతం ఇంట్లో వదిలి వెళ్లింది. దీంతో కూతురు అదృశ్యంపై తండ్రి అంజనేయులు సోమవారం ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాల ప్యాకెట్‌కు వెళ్లిన యువతి పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి పాల ప్యాకెట్ కోసం వెళ్లి ఓ యువతి అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రసాద్‌రావు కథనం ప్రకారం.. పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన బుచ్చయ్య రెండో కూతురు సౌందర్య(26) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో 15వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచుకీ లభించలేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచి్చంది. దీంతో కూతురు అదృశ్యంపై తండ్రి బుచ్చయ్య సోమవారం ఫిర్యాదు చేయగా, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పైసా వసూల్!
మెదక్ జిల్లా కేంద్రం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని హవేళి ఘణాపూర్ మండల పరిధిలోని ఓ గ్రామంలోని మహిళపై ఓ వ్యక్తి ఇటీవల లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి బాధిత మహిళ కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిన ఖాకీలు.. అలాంటి ప్రయత్నమేదీ చేయకుండానే ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. కేసు లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి కాంప్రమైజ్ చేసి డబ్బులు దండుకున్నట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు ఈ ఒక్క ఠాణాకు మాత్రమే పరిమితం కాలేదు. జిల్లాలోని చాలా పోలీస్ స్టేషన్లలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. న్యాయం చేయాలని వచ్చే బాధి తులకు భరోసా ఇవ్వాల్సిన.. రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే వసూల్ రాజాలుగా మారారు. పంచాయితీకో రేటు.. తీర్పుకింత అన్నట్లు పెద్ద మనుషుల సహకారంతో వసూళ్ల పర్వం సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి, మెదక్: క్షణికావేశంలో చోటుచేసుకునే చిన్న చిన్న సంఘటనలకు సంబంధించి కేసులు వద్దు.. రాజీయే ముద్దు.. ఇటీవల పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు పోలీస్ అధికారులు చెబుతున్న మంచి మాట. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆచరణలో ఇది పక్కదారి పడుతోంది. ఇటీవల జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవినీతికి అలవాటుపడిన పలువురు పోలీసులు పంచాయితీలను ప్రత్యేక ఆదాయ వనరుగా మల్చుకుంటున్నారు. పెద్ద మనుషుల సహకారంతో వసూళ్లకు తెగబడ్డారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఎలా అంటే.. పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసుకుని.. ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘పెద్దల’ సహకారంతో దిద్దుబాటుచర్యలు చేపడుతున్నారు. సమస్య, పంచాయితీ తీవ్రత, ఫిర్యాదుదారులు, అవతలి వైపు వారి ఆర్థిక స్థోమతను బట్టి రేటు ఫిక్స్ చేసి.. ప్రత్యేకంగా నియమించుకున్న సిబ్బందితో వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. మరీ చిన్న సంఘటనలైతే కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకే వదిలి పెడుతుండగా.. ఇతర పంచాయితీలకు సంబంధించి తీవ్రతను బట్టి సుమారు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కోసారి ఇరువర్గాల నుంచి.. మరోసారి తప్పు ఎవరిది అని పెద్దలు నిర్ణయిస్తారో వారి నుంచి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పెద్ద మనుషులే రాయబారం చేస్తున్నట్లు వినికిడి. ఇటు పోలీసులు, అటు పెద్దమనుషులకు తప్పనిసరిగా ముడుపులు ఇవ్వాల్సి వస్తుండడంతో బాధితులు ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో అప్పులు చేసి ఇచ్చామని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ తగాదాల్లో అధికం జిల్లాలో ఎస్పీ కార్యాలయం, రెండు డీఎస్పీ, ఆరు సర్కిల్ కార్యాలయాలతోపాటు 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తలు, బంధువుల మధ్య గొడవలు, భూ, ఆస్తి తగాదాలు, ఇరువర్గాల ఘర్షణ వంటి ఇతరత్రా ఘటనల్లో ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇందులో భూ సంబంధిత సమస్యలే అధికంగా ఉంటున్నాయి. సివిల్ కేసుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. ఈ క్రమంలో అవినీతికి అలవాటు పడిన పలువురు పోలీస్ అధికారులు ఇరువర్గాలను పిలిపించి పెద్దమనుషుల సమక్షంలో రాజీ పేరిట డబ్బులు గుంజుతున్నారు. ప్రధానంగా భూ సంబంధిత కేసుల్లో స్థోమతను బట్టి అక్రమార్కులకు అండగా ఉంటూ పెద్దమొత్తంలో దండుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో భూ సమస్యలు అధికం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తగాదాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ భూ సంబంధిత కేసుల్లో తలదూర్చి కావాల్సినంత చక్కబెట్టుకుంటున్నట్లు సమాచారం. కొన్ని ఉదాహరణలు.. ఔ హవేళిఘనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఇటీవల అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. పెద్ద మనుషుల సహకారంతో స్టేషన్ బెయిల్ ఇప్పించి ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.ఔ సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చొద్దనే నిబంధనలు ఉన్నాయి. శాంతి భద్రతల సమస్య పేరిట ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నంలో డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తూప్రాన్ డివిజన్లోని ఓ మండలంలో నూతనంగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఒకరిపై వేటుపడింది. ఆ ఉద్యోగిని అధికారులు వేరొక ప్రాంతానికి బదిలీ చేశారు. అయినా.. ఆ పోలీస్ స్టేషన్లో పలువురు ఖాకీలు పిటిషన్‌దారుల నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్నట్లు సమాచారం. ఔ ఉమ్మడి తూప్రాన్ మండలంలో 44వ జాతీయ రహదారి సుమారు 45 కిలోమీటర్లు విస్తరించి ఉంది. నిత్యం ఏదో ఒక చోట వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుల్లో సైతం పెద్దమనుషుల సహకారంతో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.ఔ పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్‌కు చిల్లర దొంగతనాలు, అక్రమ సంబంధం, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇరువర్గాల ఘర్షణ వంటి ఘటలనకు సంబంధించి నిత్యం రెండు నుంచి మూడు వరకు ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. రాజీ అనంతరం కింది స్థాయి పోలీస్ సిబ్బందికి మద్యంతోపాటు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు సమర్పించాల్సి వస్తోందని తెలిసింది. ఇదే పరిస్థితి టేక్మాల్, అల్లాదుర్గం, కొల్చారం మండలాల్లోనూ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఔ రేగోడ్ మండలంలోని పోలీస్ స్టేషన్లో రాజీ పేరిట దండుకోవడం మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవల తాజాగా చోటుచేసుకున్న ఘటన అవినీతి, దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. ఓ కేసు విషయమై ఒకరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన ఓ కానిస్టేబుల్ అతడి జేబులో చేయి పెట్టాడు. సెల్‌ఫోన్‌తోపాటు జేబులో ఉన్న రూ.200 తీసుకున్నాడు. మెడికల్ షాపునకు వెళ్లి మందు గోలీలు తీసుకోవాలని.. ఇంటికెళ్లి ఇచ్చి వస్తానని సదరు వ్యక్తి చెప్పినా ఆ పోలీస్ వినలేదు. ఇంతలో ఫోన్ మోగింది.. మందు గోలీలు ఏమయ్యాయని అవతలి వ్యక్తి అంటుండగా..కానిస్టేబుల్ స్విచ్ఛాఫ్ చేసి తిట్టి పంపాడు. -
మత్తు దిగాల్సిందే..!
సిద్దిపేటకమాన్: ‘‘పట్టణంలో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బండి సురేష్ (పేరు మార్చాం) తన స్నేహితులతో కలిసి పది రోజుల క్రితం పట్టణ శివారులో మందు తాగి పార్టీ చేసుకున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. సిద్దిపేట ఎంపీడీవో చౌరస్తాలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో దొరికిపోయాడు. సీన్ కట్ చేస్తే.. మోతాదుకు మించి మద్యం సేవించిన సురేష్‌కు జరిమానా, రెండు రోజుల జైలు శిక్ష విధించారు.’’ ఇది ఈ ఒక్క సురేష్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులు మందుబాబుల మత్తు వదిలిస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 751 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అందులో అధిక మోతాదులో మద్యం సేవించిన 219 మందిని జైలుకు పంపించడం జరిగింది. అలాగే రూ.10,62,900 లను జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా, రోడ్డు వెంట వెళ్లే వారికి ప్రాణసంకటంగా మారుతున్న మందుబాబులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సిద్దిపేట పట్టణంతో పాటు కమిషనరేట్ పరిధిలో, ప్రముఖ కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షిస్తున్నారు. మద్యం సేవించినట్లు తేలితే వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పాటు ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేసి, కేసు ఫైల్ చేస్తున్నారు. పట్టుబడితే ఆన్లైన్లోనే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. మద్యం తాగుతున్న వారిలో 70శాతం మంది ప్రమాదాలకు గురవుతుండడంతో వారిని గుర్తించి పట్టుబడిన వారి ప్రతి ఒక్కరి వివరాలు కంప్యూటరీకరిస్తున్నారు. అతిగా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం నడిపిన వారి వివరాలన్నీ ఫొటోతో సహా ఉంటాయి. దీంతో మరోసారి పట్టుబడినప్పుడు కేసుల భయంతో పేర్లు తప్పు చెప్పినా అప్పటికే వివరాలన్నీ ట్యాబ్‌లో వారి వద్ద ఉండడంతో తప్పించుకోలేని పరిస్థితి. ఒకటి అంతకు మించి పట్టుబడిన వివరాల ఆధారంగా న్యాయస్థానంలో వారిపై నివేదిక ఇవ్వడం ద్వారా జైలుశిక్ష, జరిమానా విధించనున్నారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి కేవలం నాలుగు నెలల్లోనే సిద్దిపేట జిల్లా పోలీసులు 417 మందిని డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పట్టుకుని జరిమానా విధించడం, మరీ అధిక మోతాదులో మద్యం సేవించిన 94మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. వీరిలో ఒకరోజు, రెండు రోజులతో పాటు వారం రోజుల వరకు జైళు శిక్ష పడ్డవారు కూడా ఉన్నారు. నాలుగు నెలల్లో మందుబాబుల నుంచి రూ.7,00,900లను కోర్టు జరిమాన విధించింది. కాగా 2018లో 1055 కేసులు నమోదు చేసి 186 మందికి జైలు శిక్ష, రూ. 13,41,400 జరిమానా విధించడం జరిగింది. బీఏసీ లెక్కింపు ఇలా బ్రీత్ ఎనలైజర్లు వాహనం నడిపేవారి శరీరంలో ఉన్న ఆల్కహాల్ శాతాన్ని బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఎసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి వంద మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే ఉల్లంఘన కింద లెక్క. అతిగా మద్యం సేవిస్తే బీఎసీ సుమారు 550 దాకా ఉంటుంది. 100 బీఎసీ కంటే ఎక్కువగా ఉంటే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. జైలు శిక్ష.. లైసెన్స్‌లు రద్దు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై ఎంవీ యాక్ట్, సెక్షన్ 185 కింద కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి రూ. 500 నుంచి రెండు వేల వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఒక రోజు, రెండు రోజుల జైలు శిక్షతో పాటు నెల రోజుల వరకు జైళు శిక్ష విధిస్తున్నారు. రెండోసారి మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దు కోసం కూడా సిఫారసు చేస్తున్నారు. ఒకసారి లైసెన్స్ రద్దయితే మరో రెండేళ్ల వరకూ లైసెన్సులు పొందలేరు. ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం తరచూ నిర్వహిస్తున్న డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు సత్ఫలితాలను ఇస్తుంది. ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాలను మద్యం మత్తులో వాహనాలను నడిపే వారికి జరిమానా, జైలు శిక్ష విధించడంతో మార్పు వస్తుంది. మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్థాల గురించి సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారిలో మార్పు రావడానికి వారి కుటుంబ సభ్యుల సవుక్ష్యంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నం. – సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ -
తప్పులను ఉపేక్షించకండి
సిద్దిపేటకమాన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అబ్జర్వర్లు డీఎస్ గాద్వీ, గంగాధర్ పాత్రోలకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారీగా పోలీస్ నోడల్ అధికారులను వీరికి పరిచయం చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని అబ్జర్వర్లకు వివరించారు. జియో ట్యాగింగ్‌తో తనిఖీ జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నార్మల్ పోలింగ్ కేంద్రాల గురించి ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేశామని, జిల్లాలో గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వారిని ఎంతమందిని బైండోవర్ చేశారో, జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులు, భౌగోళిక పరిస్థితుల గురించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత మంది పోలీస్ భద్రత అవసరమో గుర్తించి అందుకనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల వివరాలు, రూట్ మొబైల్స్ గురించి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తుగా కమిషనరేట్ పరిధిలోని బార్డర్ పీఎస్ పరిధిలో (స్టాటిక్ సర్వే లెన్స్టీమ్స్) 13 చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి సమన్వయంతో విధులు నిర్వహించడం జరుగుతుందని, సిద్దిపేట జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు సిద్దిపేట నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో సమస్యాత్మకమైనవి 136, సాధారణ పోలింగ్ కేంద్రాలు 120, గజ్వేల్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 125 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 181 సాధారణ పోలింగ్ కేంద్రాలని, హుస్నాబాద్ నియోజకవర్గంలో 292 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 149 సమస్యాత్మకమైనవని, 143 సాధారణమైనవని, దుబ్బాక నియోజకవర్గంలో 248 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 111 సమస్యాత్మకమైనవని, 137 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వీడియో రూపంలో వివరించండి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ అధికారిక యంత్రాంగం అధ్వర్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టిన పెట్రోలింగ్, రూట్, సెక్టార్ తదితర అంశాలను నియోజకవర్గాల వారీగా పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్లు డీస్ గాద్వీ, గంగాధర్ పాత్రోలు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్ట్‌లలో వాహనాల తనిఖీ నిరంతరం కొనసాగించాలనిసూచించారు.నియోజకవర్గాల వారీగా ఎవరైన ఎన్నికలు ఆటంకం కలిగించినా, దొంగ ఓట్లు వేసినా, ఇతర ఇబ్బందులు కలిగించినా చట్ట ప్రకారం ఏ విధంగా చర్య తీసుకుంటామో ఒక సీడీ తయారుచేయించి వీడియో రూపకంగా ప్రజలకుచూపించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ నర్సింహారెడ్డి, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐలు నందీశ్వర్‌రెడ్డి, వెంకటరామయ్య, పరశురాం గౌడ్, శ్రీనివాస్, ప్రసాద్, ఎక్సైజ్ సీఐ, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 1,03,42,508 నగదును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 474.61 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మద్యం విలువ రూ. 1,57,326 ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు 549 కేసులు నమోదు చేసి 4789 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 236 నాన్ బెయిలబుల్ వారెంట్స్‌ను ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందన్నారు. పేలుడు పదార్థాలను డిటోనేటర్లను 60, జిలిటెన్ స్టిక్స్ 51లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని, జిల్లాలో ఉన్న 20 తుపాకులను డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే నేరుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 7901100100కు ఫిర్యాదు చేయవచ్చని, 100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసినచో విచారణ జరిపి తప్పు చేస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన వారిపై 5 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ వారీగా మ్యాప్‌లను వివరిస్తు పోలీస్ సిబ్బంది, మొబైల్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ గురించి వివరించారు. స్థితిగతులపై పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అబ్జర్వర్లకు వివరించారు. -
పోలీసులకు స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన
మెదక్ మున్సిపాలిటీ: పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్న పోలీసులకు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులకు స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అధికారులు ప్రతిరోజు పని ఒత్తిడికి గురవుతుంటారని, వీరికి మానసిక ప్రశాంతత అవసరమన్నారు. ఈ ఒత్తిళ్లను అధిగమించడానికి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ తరగతులన్నారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నీలేష్ డార్ఫే మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి అనేక రకాలుగా ఒత్తిళ్లుంటాయని, వాటి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతుందన్నారు. కాబట్టి ఒత్తిడిని అధిగమించడం ఎంతైన అవసరమన్నారు. ఇందుకోసం ప్రతిరోజు యోగా, నడక, ప్రాణాయాణం, మెడిటేషన్, పాజిటీవ్ ఆలోచనలు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటివి చేయాలన్నారు. వీటి వల్ల చాలా వరకు ఒత్తిడిని అధిగమించవచ్చునని తెలిపారు. ఈ నియమాలు పాటించి అందరూ వ్యాధులను తరిమి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగరాజు, డాక్టర్ ప్రియాంక, తూప్రాన్ డీఎస్పీ రాంగోపాల్‌రావు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
పదేళ్ల బాలుడికి బేడీలు!
పోలీసుల తీరుపై విమర్శలు జోగిపేట/ సంగారెడ్డి క్రైం: సంగారెడ్డి కోర్టు నుంచి సిద్దిపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో తరలిస్తూ జోగిపేట బస్టాండ్‌లో శుక్రవారం బేడీలతో ఉన్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడిని నిజామాబాద్ జిల్లాలోని జువెనైల్ హోంకు వేరొక బస్సులో తరలించనున్నట్లు సమాచారం. బాలల చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు వారు ఎంత పెద్ద నేరం చేసినా బేడీలు వేయకుండా సివిల్ డ్రస్‌లో పోలీసుశాఖ సిబ్బంది కోర్టుకుగాని, జువెనైల్ హోంలకుగాని తరలించాలన్న నిబంధనలు ఉన్నట్లు అధికార వర్గాల వెల్లడించాయి. అయితే ఒక బాలుడ్ని బహిరంగంగా బేడీలు వేసి తీసుకువెళ్లడంపై స్థానికులు, ప్రజాసంఘాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పదేళ్ల బాలుడిని బేడీలు వేసి తీసుకువెళ్లడాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఎస్పీ సుమతికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరింది. కాగా, ఈ ఘటనకు జిల్లా ఎస్పీతో మొదలుకొని స్థానిక పోలీసులు సైతం బాధ్యత వహించాలని బాలల హక్కుల పరిరక్షణ సభ్యుడు అచ్యుతరావు చెప్పారు. -
బాలుడి చేతికి బేడీలు
సంగారెడ్డి: ముక్కుపచ్చలారని బాలుడి చేతికి బేడీలు బిగించిన మెదక్ జిల్లా పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగతనానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జిల్లాలో జువెనైల్ హోం లేకపోవడంతో నిజామాబాద్ కు తరలించారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన బాలుడిని శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత బాలుడి చేతికి బేడీలు వేసి నిజామాబాద్ కు బస్సులో తీసుకెళుతూ జోగిపేట బస్టాండ్ లో 'సాక్షి' విలేకరి కంటపడ్డారు. దీనిపై పోలీసులను విలేకరి ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తాము ఇలాగే తీసుకెళ్తామన్నట్టుగా మాట్లాడారు. పోలీసుల వైఖరిని బాలల హక్కుల సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
అక్కడ పోలీసు హెచ్చరికలు మాత్రమే వినిపిస్తాయి...
మెదక్ : బస్టాండ్ వద్ద రహదారికి అడ్డం ఉన్న ఆటోను పక్కకు తీయండి... ఆ దుకాణం వద్ద గుంపులుగా నిలబడకండి ...అంటూ మైక్‌లో పోలీసుల హెచ్చరికలు వినిపిస్తుంటాయి. కానీ, ఆ పరిసర ప్రాంతాలలో పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించరు. మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు చేపట్టిన వినూత్నయత్నమిది. సిబ్బంది కొరత, తీరిక లేని విధులు... ఈ రెండింటి నుంచి విముక్తి పొందేందుకు వారు ఈ విధానానని ప్రవేశపెట్టారు. రోడ్డుపై గొడవ జరిగినా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే విధంగా వాహన పార్కింగ్ ఉన్నా.... ఎక్కడైనా జనం గుమికూడినా పోలీస్ స్టేషన్లో ఉండే మైక్‌ల ద్వారా వారు హెచ్చరికలు జారీ చేసి... శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు రామాయంపేట బస్టాండ్ లోపల, బయట సిద్దిపేట రోడ్డు వద్ద, అంబేద్కర్ విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద మైక్‌లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మానిటరింగ్ సిస్టం, ఇతర పరికరాలు పోలీస్ స్టేషన్‌లోని కంట్రోల్ రూంలో ఏర్పాటు చేశారు. దానికి ఆడియో సిస్టంను అనుసంధానం చేసి అందుబాటులోకి తెచ్చారు. కంట్రోల్ రూంలో ఉండే సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి, తగిన విధంగా సూచనలు, ఆదేశాలు ఇస్తుంటారు. సంబంధిత ప్రాంతంలో ఏదైనా ఘర్షణ జరిగిన పోలీస్ స్టేషన్లో రికార్డు అవుతుందనే భయంతో స్థానికులు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. పట్టణంలో ఇటీవల దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోవడంతో తాము ఈ చర్యలు తీసుకున్నామని ఎస్సై నాగార్జున తెలిపారు. అలాగే సంబంధిత ప్రాంతానికి తమ సిబ్బంది వెళ్లకుండా నేరుగా పోలీస్‌స్టేషన్ నుంచే పర్యవేక్షిస్తుండటంతో పని ఒత్తిడి తగ్గిందని ఆయన చెబుతున్నారు. ఈ విధానం మంచి ఫలితాలనిచ్చిందని తెలిపారు. -
విందు పేరుతో ప్రలోభాలు: ఎమ్మెల్యేపై కేసు నమోదు
మెదక్ జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌పై స్థానిక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ నందీశ్వర్ గౌడ్‌పై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే గత అర్థరాత్రి హోటల్లో ముస్లిం ఓటర్లకు సదరు ఎమ్మెల్యే విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు భారీగా ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఆ విందుపై కొంత మంది యువకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హోటల్‌పై దాడి చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.