పదేళ్ల బాలుడికి బేడీలు!
పోలీసుల తీరుపై విమర్శలు
జోగిపేట/ సంగారెడ్డి క్రైం: సంగారెడ్డి కోర్టు నుంచి సిద్దిపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో తరలిస్తూ జోగిపేట బస్టాండ్‌లో శుక్రవారం బేడీలతో ఉన్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడిని నిజామాబాద్ జిల్లాలోని జువెనైల్ హోంకు వేరొక బస్సులో తరలించనున్నట్లు సమాచారం. బాలల చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు వారు ఎంత పెద్ద నేరం చేసినా బేడీలు వేయకుండా సివిల్ డ్రస్‌లో పోలీసుశాఖ సిబ్బంది కోర్టుకుగాని, జువెనైల్ హోంలకుగాని తరలించాలన్న నిబంధనలు ఉన్నట్లు అధికార వర్గాల వెల్లడించాయి.
అయితే ఒక బాలుడ్ని బహిరంగంగా బేడీలు వేసి తీసుకువెళ్లడంపై స్థానికులు, ప్రజాసంఘాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పదేళ్ల బాలుడిని బేడీలు వేసి తీసుకువెళ్లడాన్ని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఎస్పీ సుమతికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరింది. కాగా, ఈ ఘటనకు జిల్లా ఎస్పీతో మొదలుకొని స్థానిక పోలీసులు సైతం బాధ్యత వహించాలని బాలల హక్కుల పరిరక్షణ సభ్యుడు అచ్యుతరావు చెప్పారు.