బాలుడి చేతికి బేడీలు
సంగారెడ్డి: ముక్కుపచ్చలారని బాలుడి చేతికి బేడీలు బిగించిన మెదక్ జిల్లా పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగతనానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జిల్లాలో జువెనైల్ హోం లేకపోవడంతో నిజామాబాద్ కు తరలించారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన బాలుడిని శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు.
తర్వాత బాలుడి చేతికి బేడీలు వేసి నిజామాబాద్ కు బస్సులో తీసుకెళుతూ జోగిపేట బస్టాండ్ లో 'సాక్షి' విలేకరి కంటపడ్డారు. దీనిపై పోలీసులను విలేకరి ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తాము ఇలాగే తీసుకెళ్తామన్నట్టుగా మాట్లాడారు. పోలీసుల వైఖరిని బాలల హక్కుల సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.