సమావేశంలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్‌లు, కలెక్టర్ కృష్ణభాస్కర్, సీపీ జోయల్ డేవిస్, తదితరులు
సిద్దిపేటకమాన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అబ్జర్వర్‌లు డీఎస్ గాద్వీ, గంగాధర్ పాత్రోలకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారీగా పోలీస్ నోడల్ అధికారులను వీరికి పరిచయం చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని అబ్జర్వర్‌లకు వివరించారు.
జియో ట్యాగింగ్‌తో తనిఖీ
జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నార్మల్ పోలింగ్ కేంద్రాల గురించి ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేశామని, జిల్లాలో గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వారిని ఎంతమందిని బైండోవర్ చేశారో, జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులు, భౌగోళిక పరిస్థితుల గురించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత మంది పోలీస్ భద్రత అవసరమో గుర్తించి అందుకనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల వివరాలు, రూట్ మొబైల్స్ గురించి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తుగా కమిషనరేట్ పరిధిలోని బార్డర్ పీఎస్ పరిధిలో (స్టాటిక్ సర్వే లెన్స్‌టీమ్స్) 13 చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి సమన్వయంతో విధులు నిర్వహించడం జరుగుతుందని, సిద్దిపేట జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు
సిద్దిపేట నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో సమస్యాత్మకమైనవి 136, సాధారణ పోలింగ్ కేంద్రాలు 120, గజ్వేల్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 125 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 181 సాధారణ పోలింగ్ కేంద్రాలని, హుస్నాబాద్ నియోజకవర్గంలో 292 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 149 సమస్యాత్మకమైనవని, 143 సాధారణమైనవని, దుబ్బాక నియోజకవర్గంలో 248 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 111 సమస్యాత్మకమైనవని, 137 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
వీడియో రూపంలో వివరించండి
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ అధికారిక యంత్రాంగం అధ్వర్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టిన పెట్రోలింగ్, రూట్, సెక్టార్ తదితర అంశాలను నియోజకవర్గాల వారీగా పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్‌లు డీస్ గాద్వీ, గంగాధర్ పాత్రోలు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్ట్‌లలో వాహనాల తనిఖీ నిరంతరం కొనసాగించాలనిసూచించారు.నియోజకవర్గాల వారీగా ఎవరైన ఎన్నికలు ఆటంకం కలిగించినా, దొంగ ఓట్లు వేసినా, ఇతర ఇబ్బందులు కలిగించినా చట్ట ప్రకారం ఏ విధంగా చర్య తీసుకుంటామో ఒక సీడీ తయారుచేయించి వీడియో రూపకంగా ప్రజలకుచూపించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ నర్సింహారెడ్డి, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐలు నందీశ్వర్‌రెడ్డి, వెంకటరామయ్య, పరశురాం గౌడ్, శ్రీనివాస్, ప్రసాద్, ఎక్సైజ్ సీఐ, ఎలక్షన్ సెల్ ఇన్‌స్పెక్టర్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.
- సిద్దిపేట జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 1,03,42,508 నగదును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
- ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 474.61 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మద్యం విలువ రూ. 1,57,326 ఉంటుందని పేర్కొన్నారు.
- ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు 549 కేసులు నమోదు చేసి 4789 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 236 నాన్ బెయిలబుల్ వారెంట్స్‌ను ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందన్నారు.
- పేలుడు పదార్థాలను డిటోనేటర్‌లను 60, జిలిటెన్ స్టిక్స్ 51లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని, జిల్లాలో ఉన్న 20 తుపాకులను డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు.
- ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే నేరుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 7901100100కు ఫిర్యాదు చేయవచ్చని, 100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసినచో విచారణ జరిపి తప్పు చేస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
- ఇప్పటి వరకు జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన వారిపై 5 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
- అసెంబ్లీ వారీగా మ్యాప్‌లను వివరిస్తు పోలీస్ సిబ్బంది, మొబైల్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ గురించి వివరించారు. స్థితిగతులపై పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అబ్జర్వర్‌లకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment