telangana police officers
-
ఇద్దరు పోలీస్ అధికారులకు రాష్ట్రపతి సేవా పతకాలు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రతి ఏటా పోలీస్ శాఖలో పనితీరు ఆధారంగా కేంద్రం ప్రకటించే పతకాలలో రాష్ట్రానికి చెందిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌తో పాటు మెరిటోరియస్ సేవా పతకాలు లభించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఈ పతకాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు అధికారులకు పీపీఎమ్ (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్) దక్కగా, మరో 11 మంది అధికారులు, సిబ్బందికి మెరిటోరియస్ సర్వీస్ పోలీస్ మెడల్ దక్కాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కేంద్ర సాయుధ బలగాలు, ఇతర విభాగాల్లోని అధికారులు సిబ్బందికి కూడా పలు పతకాలు దక్కాయి. రాష్ట్ర పోలీస్ శాఖలోని స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లో ఇబ్రహీంపట్నం కమాండెంట్‌గా పనిచేస్తున్న చాకో సన్నీతో పాటు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ జి.శ్రీనివాసరాజు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌ను దక్కించుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కింద సీనియర్ ఐపీఎస్, ఐజీ హోదాలో మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న షానావాజ్ ఖాసీంతో పాటు సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీగా పనిచేస్తున్న సంక్రాంతి రవికుమార్, ములుగు ఓఎస్డీ పుల్ల శోభన్‌కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ రాయప్పగారి సుదర్శన్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ పోలగాని శ్రీనివాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీఎస్పీ జి.శ్రీనివాసులు, వనపర్తి డీఎస్పీ కేఎమ్ కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్ ఆర్ఎస్ఐ మహ్మద్ యాకుబ్ ఖాన్, డిచ్పల్లి బెటాలియన్ ఏఆర్ఎస్ఐ బండి సత్యం, గ్రేహౌండ్స్ ఏఆర్ఎస్ఐ మెట్టు వెంకటరమణరెడ్డి, కొండాపూర్ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ ఇలపంద కోటేశ్వర్రావుకు పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ కింద పోలీస్ పతకా>లు దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, ఏపీకి చెందిన భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది. వివిధ విభాగాల్లో వీరికి కూడా.. ఇక మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న ఉడుగు నరసింహ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమాండెంట్ భూపేంద్ర కుమార్, బసుమాతరీ అజయ్‌కి పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. జాతీయ పరిశ్రమల భద్రతా అకాడమీ (సీఐఎస్ఎఫ్)హైదరాబాద్‌లో కమాండెంట్‌గా పనిచేస్తున్న అనూప్ కుమార్, రంగారెడ్డి ఏఎస్జీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ కూచిభొట్ల శారద, రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గుండప్పకు పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. సీఆర్పీఎఫ్ వరంగల్ బెటాలియన్ సబ్ఇన్స్పెక్టర్ బాబులాల్ కూడా పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ కోటాలో పతకం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ళ శాఖలో పనిచేస్తున్న పంత్ (చీఫ్ హెడ్ వార్డర్), సీఎన్ గంట రత్నారావు(హెడ్ వార్డర్), బి.నర్సింగ్ రావు(హెడ్ వార్డర్) ఖైదీల ప్రవర్తన దిద్దుబాటుకుగాను రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. అగ్నిమాపక దళంలో కాళహస్తి వెంకట కృష్ణ కుమార్ (జిల్లా ఫైర్ ఆఫీసర్)కు రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ విశిష్ట సేవా మెడల్ దక్కింది. తాడేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ మస్తాన్ వలీ షేక్‌కు పోలీసు ప్రతిభా పురస్కారం దక్కింది. -
తప్పులను ఉపేక్షించకండి
సిద్దిపేటకమాన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అబ్జర్వర్లు డీఎస్ గాద్వీ, గంగాధర్ పాత్రోలకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారీగా పోలీస్ నోడల్ అధికారులను వీరికి పరిచయం చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని అబ్జర్వర్లకు వివరించారు. జియో ట్యాగింగ్‌తో తనిఖీ జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నార్మల్ పోలింగ్ కేంద్రాల గురించి ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేశామని, జిల్లాలో గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వారిని ఎంతమందిని బైండోవర్ చేశారో, జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులు, భౌగోళిక పరిస్థితుల గురించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత మంది పోలీస్ భద్రత అవసరమో గుర్తించి అందుకనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల వివరాలు, రూట్ మొబైల్స్ గురించి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తుగా కమిషనరేట్ పరిధిలోని బార్డర్ పీఎస్ పరిధిలో (స్టాటిక్ సర్వే లెన్స్టీమ్స్) 13 చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి సమన్వయంతో విధులు నిర్వహించడం జరుగుతుందని, సిద్దిపేట జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు సిద్దిపేట నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో సమస్యాత్మకమైనవి 136, సాధారణ పోలింగ్ కేంద్రాలు 120, గజ్వేల్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 125 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 181 సాధారణ పోలింగ్ కేంద్రాలని, హుస్నాబాద్ నియోజకవర్గంలో 292 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 149 సమస్యాత్మకమైనవని, 143 సాధారణమైనవని, దుబ్బాక నియోజకవర్గంలో 248 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అందులో 111 సమస్యాత్మకమైనవని, 137 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వీడియో రూపంలో వివరించండి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ అధికారిక యంత్రాంగం అధ్వర్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టిన పెట్రోలింగ్, రూట్, సెక్టార్ తదితర అంశాలను నియోజకవర్గాల వారీగా పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్లు డీస్ గాద్వీ, గంగాధర్ పాత్రోలు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్ట్‌లలో వాహనాల తనిఖీ నిరంతరం కొనసాగించాలనిసూచించారు.నియోజకవర్గాల వారీగా ఎవరైన ఎన్నికలు ఆటంకం కలిగించినా, దొంగ ఓట్లు వేసినా, ఇతర ఇబ్బందులు కలిగించినా చట్ట ప్రకారం ఏ విధంగా చర్య తీసుకుంటామో ఒక సీడీ తయారుచేయించి వీడియో రూపకంగా ప్రజలకుచూపించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ నర్సింహారెడ్డి, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐలు నందీశ్వర్‌రెడ్డి, వెంకటరామయ్య, పరశురాం గౌడ్, శ్రీనివాస్, ప్రసాద్, ఎక్సైజ్ సీఐ, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 1,03,42,508 నగదును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 474.61 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మద్యం విలువ రూ. 1,57,326 ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు 549 కేసులు నమోదు చేసి 4789 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 236 నాన్ బెయిలబుల్ వారెంట్స్‌ను ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందన్నారు. పేలుడు పదార్థాలను డిటోనేటర్లను 60, జిలిటెన్ స్టిక్స్ 51లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని, జిల్లాలో ఉన్న 20 తుపాకులను డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే నేరుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 7901100100కు ఫిర్యాదు చేయవచ్చని, 100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసినచో విచారణ జరిపి తప్పు చేస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన వారిపై 5 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ వారీగా మ్యాప్‌లను వివరిస్తు పోలీస్ సిబ్బంది, మొబైల్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ గురించి వివరించారు. స్థితిగతులపై పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అబ్జర్వర్లకు వివరించారు. -
టీఆర్ఎస్ నేతల హత్యకు మావోయిస్టుల పక్కా ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిధులను మావోయిస్టులు టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను ఎలాగైతే హత్య చేశారో అదే తరహాలో.. తెలంగాణలోని ఎమ్మెల్యేలను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మావోయిస్టు యాక్షన్ టీమ్స్.. తెలంగాణకు చెందిన ఓ ఆపద్ధర్మ మంత్రి, స్పీకర్‌ను టార్గెట్ చేసినట్టు సమాచారం. అదేవిధంగా తాడ్వాయి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల కుట్రను పసిగట్టిన తెలంగాణ పోలీసులు అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మావోయిస్టుల ముప్పు గురించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో మంత్రి అజ్మీరా చందూలాల్ తాడ్వాయ్ మండలంలోని కటాపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు. ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రంగంలోకి దిగిన 30 మంది మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అడ్డూ అదుపూ లేని ఆగడాలు
టీ సర్కారుపై పరకాల మండిపాటు టీ పోలీసు అధికారులు గూండాల్లా ప్రవర్తించారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. వారికి చట్టం అంటే గౌరవం లేదని, సంప్రదాయాల్ని పాటించాలన్న స్పృహ కూడా లేదని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని నీరు, విద్యుత్, సంస్థలు, నిధులు సంబంధిత అంశాల్లో చట్టాలను గౌరవించకుండా రోజు రోజుకూ యాగీ చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్మిక శాఖకు చెందిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల మండలి నిధుల అంశంలో తెలంగాణ పోలీసు అధికారుల ఆగడాలు, దౌర్జన్యాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. 50 మంది తెలంగాణ పోలీసు అధికారులు గూండాల్లా వ్యవహరిస్తూ ఏపీ అధికారులపై దౌర్జన్యానికి తెగబడ్డారన్నారు. ఉన్నతాధికారులని కూడా చూడకుండా వారి ఇంటికి వెళ్ళి మరీ కుటుంబసభ్యుల్ని ఘెరావ్ పేరిట హింసిం చారని ఆరోపించారు. విచారణ పేరుతో తెలంగాణ పోలీసులు ఏ ఒక్క ప్రాతిపదిక పాటించలేదని, ఆ ప్రభుత్వం చెబుతున్న మాటలు, లెక్కల పై తెలుగు ప్రజల్లో చర్చ జరగాలన్నారు. తాను లెక్కలు మొత్తం తీసి తెలంగాణ ప్రభుత్వంతో నిజం కక్కించేవరకు విశ్రమించబోనన్నారు. ఈ సందర్భంగా పరకాల వివరాలను సోదాహర ణంగా చెప్పారు. పంపిణీ జరిగితే ఈ నిధులు ఏపీకి చెందుతాయన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోకుండా యాగీ చేసిందన్నారు. ఏపీ అధికారులపై ఈగ వాలినా సహిం చమన్నారు. ఆ అధికారులు, పోలీసులు పూనకాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భూ భాగంలోని బ్యాంకుల్లో వారికి దక్కాల్సిన వాటా కంటే అదనంగా రూ.76 కోట్లు జమయినా తాము పైసా తరలించలేదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. నాక్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని పరకాల ఆరోపించారు. ఉన్మాదంతో వ్యవహరిస్తున్న టీ ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు ప్రశ్నించాలని,కేంద్రం ఆరా తీయాలని అన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.