
అవినీతిని, భ్రష్టాచారాన్ని, లంచగొండితనాన్ని నిజంగా వ్యతిరేకించే వారెవరయినా ఉన్నారా అని అనుమానం వస్తున్నది. లంచాలు తీసుకునే అధికారులు పెరిగితే నీతివంతుడే వారికి శత్రువు. పగబట్టి నీతివంతుడిని వేధించే పనిలో ముందుండేది ప్రభుత్వమే. కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో, హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో తమ ఉద్యోగులమీద, అధికారుల మీద ప్రభుత్వం కేసులు నడుపుతున్నది. అన్యాయంగా సస్పెండ్ చేస్తారు. ఉద్యోగి విధిలేక కాట్ న్యాయం అర్థిస్తాడు. అక్కడ న్యాయం దొరికితే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటుంది. హైకోర్టులో గెలిచినా అతనికి న్యాయం దక్కనివ్వకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది. తన వద్ద ఉన్న పెద్ద పెద్ద లాయర్లకు ప్రజల డబ్బు ఫీజుగా చెల్లిస్తూ చిరుద్యోగిమీద సుప్రీం సమరం సాగిస్తుంది.
సివిల్ సర్వీసులో ఉద్యోగం దొరికితే నీతివంతంగా పనిచేయాలని చిత్తశుద్ధితో అనుకున్నాడొక యువకుడు. ఇండియన్ ఫారెస్టు సర్వీసులో దొరి కింది. ఫైళ్లలో స్పష్టంగా కనిపిస్తున్న అవినీతిని చూసీచూడనట్టు ఉండటం తెలివైన మేనేజ్ మెంట్, దానికి బదులు చట్టం ప్రకారం చర్య తీసుకోవడం పిచ్చి కింద లెక్క. కనిపిస్తున్న తప్పులన్నింటి మీద కేసులు పెట్టడం ఒక మానసిక వ్యాధి అని ప్రస్తుతం జనం నమ్ముతుంటారు. ఆ అధికారి సంజయ్ చతుర్వేది. తన ముందుకు వచ్చిన కలప రక్షణ ఫైళ్ళలో అక్రమాలు, లంచాలు బయటపడ్డాయి. కేసులు పెట్టారు. అందులో పై అధికారులు, మంత్రులు కూడా ఉన్నారు. వారందరికీ కోపం వచ్చింది. ఈ అధికారి మీద తప్పుడు కేసులు సృష్టించారు. సస్పెండు చేశారు. బదిలీలతో పాటు అరెస్టు దాకా వెళ్లే ప్రమాదం ఉండటంతో మంత్రిగారికి మొర పెట్టుకున్నారు.
అప్పుడు పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేశ్‌కు కేసులో నిజానిజాలు అర్థమై, దర్యాప్తుచేయమని ఇంటెలిజెన్స్ బ్యూరోని ఆదేశించారు. ఈ యువ అధికారి పెట్టిన కేసులన్నీ వాస్తవాలనీ, ఆయనమీద పెట్టినవన్నీ తప్పుడు కేసులని నిర్ధారించారు. కానీ ఆ నివేదిక ప్రతిని ఆయనకు ఇవ్వడం లేదు. అది రహస్యమట. చివరకు ఆ సమాచారం ఇవ్వాలని కమిషన్ తీర్పుచెప్పింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ప్రభుత్వం పక్షాన పెద్ద లాయరుగారు దిగారు. ఇటువైపు ఒంటరిగా ఈ మధ్యతరగతి నీతివంతుడైన అధికారి, అంటే డబ్బులు విపరీతంగా లేని వాడని అర్థం. అయినా తనే సొంతంగా వాదించాడు. డిల్లీ హైకోర్టు కరుణించి న్యాయంగా తీర్పు చెప్పి ఆ సమాచారం ఇమ్మని ఆదేశించింది. కానీ హోంమంత్రిత్వశాఖ ఇంకా పెద్ద లాయర్‌ను రంగంలోకి దించి పెద్ద కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి ముందుకు వెళ్లింది. ప్రభుత్వం ఇలా నీతిపైన పోరాడుతూ ఉంటుంది.
ఐదేళ్ల నుంచి సంజయ్ చతుర్వేదికి వార్షిక కార్య సమీక్షా నివేదికల్లో అత్యున్నత తరగతినిచ్చారు పైఅధికారులు. ఆరో సంవత్సరం 2014–15లో ఆయన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేశారు. ఆయన పని అక్రమార్జకుల పని పట్టడమే. పెద్దపెద్ద డాక్టర్లతో సహా అనేక మంది పెద్దల అక్రమాలు ఆయన దృష్టికి రావడం, ఆయన కేసులు పెట్టడం జరిగిపోయింది. దాంతో పైఅధికారులు, ఆపైన ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాగారు 2014–సంవత్సరం పనితీరుకు శూన్యం మార్కులు ఇచ్చారు. మధ్యలో సున్నావల్ల ఆయనకు ఉద్యోగంలో పైపదవికి వెళ్లేందుకు వీలుండదు. కనుక పునఃసమీక్షించాలని కోరాడు. హైకోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇటువంటి ఎన్నో కేసుల్లో ఎందరికో న్యాయం చేసిన హైకోర్టు ఈయన గారి కేసులో మాత్రం కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లమని ఉత్తర్వు జారీ చేసింది. ఆయన నైనిటాల్‌లోని కాట్ బెంచ్‌కు విన్నవించుకున్నాడు.
సెప్టెంబర్ 2017లో తీర్పు ఇస్తూ చతుర్వేదికి మంత్రిగారిచ్చిన సున్నాను పరగణించరాదని కాట్ ఇద్దరు సభ్యుల బెంచి ఆదేశించింది. దానిపైన ప్రభుత్వం వారు డిల్లీలోని కాట్ చైర్‌పర్సన్ ముందు అప్పీలు చేసుకున్నారు. వారు నైనిటాల్ కాట్ ఉత్తర్వు మీద స్టే జారీ చేశారు. మళ్లీ చతుర్వేది ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లక తప్పని స్థితి. ప్రభుత్వం అనవసరంగా వేధిస్తున్నందుకు పాతిక వేల రూపాయలను ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది. అయినా, కాట్ అధ్యక్షుడే న్యాయమైన తీర్పు ఇచ్చా రని, హైకోర్టే తీవ్ర అన్యాయం చేసిందని వాదిస్తూ ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకు వెళ్లింది కేంద్ర ప్రభుత్వం. అంతా విన్న ధర్మాసనం కాట్ తీర్పును కొట్టివేస్తూ, నీతివంతుడైన అధికారిని వేధించే ఈ ప్రభుత్వం మరో పాతిక వేలు ఖర్చులు చెల్లించాలని ఫిబ్రవరి 1న ఆదేశించింది. విచిత్రం ఏమంటే నీతివంతుడైన అధికారిని కోర్టుల చుట్టూ తిప్పుతూ, ఆయన పెట్టిన కేసులను తొక్కిపెట్టడమే.
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment