ఆన్ లైన్ కాదు.. అదే 'లైన్' | Bribes in RTA | Sakshi
Sakshi News home page

ఆన్ లైన్ కాదు.. అదే 'లైన్'

Published Sat, Feb 20 2016 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

ఇబ్రహీంపట్నంలోని ఆర్టీఏ ఆఫీసు వద్ద పూర్తి చేసిన దరఖాస్తులను తీసుకెళ్తున్న దళారులు

ఇబ్రహీంపట్నంలోని ఆర్టీఏ ఆఫీసు వద్ద పూర్తి చేసిన దరఖాస్తులను తీసుకెళ్తున్న దళారులు

ఆర్టీఏ దారి అడ్డదారి

సాక్షి, హైదరాబాద్: గోషామహల్‌కు చెందిన మహేశ్ తన ద్విచక్ర వాహనానికి సంబంధించిన హైపోతికేషన్ (రుణ ఒప్పందం) రద్దు కోసం నెల రోజుల పాటు టోలిచౌకిలోని పశ్చిమ మండలం రోడ్డు, రవాణా సంస్థ (ఆర్టీఏ) కార్యాలయం చుట్టూ తిరిగాడు. వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక ధ్రువీకరణ పత్రం లేదనే సాకుతో తిప్పి పంపారు. చివరికి మహేశ్ ఓ ఏజెంట్‌ను ఆశ్రయించాడు. రూ. 1,000 చేతిలో పెడితే.. క్షణాల్లో పని పూర్తయింది. ద్విచక్ర వాహనం హైపోతికేషన్ రద్దు కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.435 మాత్రమే. ఇదే కాదు ఆర్టీఏలో లెర్నింగ్ లెసైన్స్ నుంచి వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల దాకా ‘వసూళ్ల’ మోత తప్పదు. హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ   దళారుల దందా యథేచ్చగా కొనసాగుతోంది. రవాణాశాఖ నుంచి లభించే ప్రతి సేవకు ఒక ధర నిర్ణయించి, వసూలు చేస్తున్నారు. ఏ పనికావాలన్నా ఏజెంట్లను ఆశ్రయించి.. వారు అడిగినంత సమర్పించుకోవాల్సిందే. అలాకాదని నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వెళితే... ఏదో ఒక సాకు చెప్పి తిప్పి పంపుతారు. రోజులు కాదు నెలల పాటు తిప్పించుకుంటారు. చివరికి ఏజెంట్లను ఆశ్రయించడమే మేలనే పరిస్థితి కల్పిస్తారు. ఇలా ఏజెంట్లకు అందిన సొమ్ము నుంచి ఆర్టీఏ సిబ్బందికి వాటాలు అందుతాయి. మొత్తంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా సుమారు రూ. 78 కోట్లదాకా దండుకుంటున్నట్లు అంచనా. ఆర్టీఏలో దళారుల రాజ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
 

 ఆన్‌లైన్ ఉన్నా అంతంతే!
 

లెర్నింగ్ లెసైన్స్, డ్రైవింగ్ లెసైన్సు సహా వివిధ రకాల సేవల కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొనే సదుపాయం ఉంది. ఈసేవ కేంద్రాల్లో, ఇంటర్నెట్ కేంద్రాల్లో నేరుగా స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి, తమకు కేటాయించిన తేదీల్లో సేవలను పొందవచ్చు.

కానీ ఆన్‌లైన్ పట్ల చాలా మందిలో అవగాహన లేకపోవడం, ప్రచారం కొరవడడం, ఎలా నమోదు చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఏజెంట్లను, దళారులను ఆశ్రయిస్తున్నారు.

మరోవైపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నా... కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో రకరకాల కొర్రీలు పెట్టి తిరిగి ఏజెంట్ ద్వారానే వచ్చేలా చేస్తున్నారు.

కోట్లు కొల్లగొట్టేస్తున్నారు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖై రతాబాద్, టోలిచౌకి, తిరుమలగిరి, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, అత్తాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, నాగోల్, కూకట్‌పల్లి, కొండాపూర్ ఆర్టీఏ కేంద్రాల ద్వారా రోజూ సుమారు 2,500 మందికిపైగా వివిధ రకాల సేవలను పొందుతారు. ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 46 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.

 రవాణాశాఖ అందజేసే సేవల ఫీజులు చాలా వరకు రూ.500 నుంచి రూ.1,000లోపే ఉంటాయి. కానీ ఏజెంట్లు, బ్రోకర్లు అంతకన్నా రెండు మూడింతలకుపైగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు డ్రైవింగ్ లెసైన్స్ కోసం వినియోగదారుల నుంచి ఏజెంట్లు రూ. 3,000 వరకు వసూలు చేస్తున్నారు. కానీ సర్కారుకు చెల్లించేది లెర్నింగ్ ఫీజు రూ.90, డ్రైవింగ్ లెసైన్స్ ఫీజు రూ.675 కలిపి రూ.765 మాత్రమే. అంటే మిగతా రూ. 2,235ను బ్రోకర్లు, ఆర్టీఏ సిబ్బంది పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

 వివిధ సేవలపై ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజుకు అదనంగా సగటున ఒక్కో వినియోగదారుడు రూ.1,000 చొప్పున బ్రోకర్‌కు ముట్టజెబుతున్నట్లు భావించినా... నగరంలో 2,500 మంది వినియోగదారులు ప్రతి రోజు చెల్లించే సొమ్ము రూ.25 లక్షలు అవుతుంది. అంటే ప్రతి నెలా రూ.6.5 కోట్లు, ఏడాదికి రూ.78 కోట్లకుపైగా సొమ్ము ఏజెంట్లకు అందుతోంది. ఇందులోంచి ఆర్టీఏ సిబ్బందికి వాటాలు అందుతున్నాయి. మొత్తంగా ఫీజుల రూపంలో ప్రభుత్వానికి వస్తున్నది సుమారు రూ.46 కోట్లయితే... అక్రమంగా వసూలు చేస్తున్నది రూ.78 కోట్లు.

రవాణాశాఖ ఫీజులు (రూ.లలో)

 ఒక కేటగిరీ వాహనం కోసం లెర్నింగ్  లెసైన్స్ 60

 రెండు కేటగిరీల వాహనాల కోసం    90

 డ్రైవింగ్ లెసైన్స్ (ఒక కేటగిరీ)   475

 డ్రైవింగ్ లెసైన్స్ (2 కేటగిరీలు)  625

 డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్  485

 అంతర్జాతీయ డ్రైవింగ్ లెసైన్స్   650

 వాహనాల రిజిస్ట్రేషన్ (ద్విచక్రవాహనం)  395

 వాహనాల రిజిస్ట్రేషన్ (కారు)    635

వాహనాల ఫిట్‌నెస్ (తేలికపాటి వాహనాలు)  360

వాహనాల ఫిట్‌నెస్  (మధ్యతరహా వాహనాలకు)   460

వాహనాల ఫిట్‌నెస్ (భారీ వాహనాలకు) 560

 డూప్లికేట్ ఆర్‌సీ (ద్విచక్ర వాహనం) 365

 డూప్లికేట్ ఆర్‌సీ (కార్లు)    485

 వాహనం యాజమాన్య బదిలీ (ద్విచక్ర వాహనం)  365

వాహనం యాజమాన్య బదిలీ      ( కారు )    535

 చిరునామా మార్పు (ద్విచక్ర వాహనం)  220

చిరునామా మార్పు   (కారు)    420

 ఎన్‌వోసీ                               85

 

 ‘బ్యాడ్జ్’ కోసం రూ.3,500 ఖర్చయింది
 

 ‘‘కారు డ్రైవర్‌ను. బ్యాడ్జ్ కోసం వెళ్లాను. ఎన్ని సర్టిఫికెట్లు తీసుకెళ్లినా ఏదో ఒకటి తక్కువగా ఉందని చెప్పేవారు. ఆరు నెలల పాటు తిరగాల్సి వచ్చింది. చివరికి ఒక బ్రోకర్‌కు రూ. 3,500 కంటే ఎక్కువే ఇచ్చాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాడ్జ్ వచ్చేసింది..’’    

   - గణేశ్, మెహదీపట్నం

 వారం నుంచి తిప్పుకొంటున్నారు

 ‘‘బ్యాడ్జ్ రెన్యువల్ కోసం వారం రోజుల నుంచి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ చుట్టూ తిరుగుతున్నా.. గతంలో దీనికోసం రూ.3,500 ఖర్చు చేశాను. రెన్యువల్ కోసం వస్తే అధికారులు  సమాధానం చెప్పడం లేదు.           - కిషన్, హయత్‌నగర్

 

 ఎవరూ పట్టించుకోలేదు..

 ‘‘కారు హైపోతికేషన్ రద్దు కోసం ఎల్‌బీనగర్ నుంచి వచ్చాం. నేరుగా వెళితే ఎవరూ పట్టించుకోలేదు. చివరకు రూ.1,000 ఇచ్చి బ్రోకర్‌ను కలిశాము. వెంటనే పని అయిపోయింది..’’                        - అరుణగుప్తా, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement