వీరు.. మారరు! | Corruption In Sub Registrar Offices In Nellore District | Sakshi
Sakshi News home page

వీరు.. మారరు!

Published Sun, Jan 12 2020 12:33 PM | Last Updated on Sun, Jan 12 2020 12:33 PM

Corruption In Sub Registrar Offices In Nellore District - Sakshi

జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి బ్రేక్‌లు పడటం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అధికారులపై వేటు పడుతున్నా.. మరో పక్క ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా సబ్‌ రిజిస్ట్రార్లు మాత్రం వెరవడం లేదు. జిల్లా నుంచి ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 14400 కాల్‌ సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ నాల్గో స్థానంలో ఉన్నట్లు సమాచారం. కాల్‌ సెంటర్‌ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించారు. దీంతో దళారులను పెట్టుకుని దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇటీవల గూడూరు, తాజాగా బుచ్చిరెడ్డిపాళెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారుల వద్ద దొరికిన అదనపు సొమ్ములే ఇందుకు నిదర్శనం.

సాక్షి నెల్లూరు: జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్లు అవినీతి జలగల్లా క్రయ విక్రయదారులను పీల్చిపిప్పి చేస్తున్నారు. అవినీతి సొమ్ముకు అలవాటు పడిన వీరు దొరికిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారు. డబ్బులు ముట్టచెప్పితే నిషేధిత జాబితాల్లోని భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లకు భారీ మొత్తంలో లంచాలు జేబుల్లో వేసుకుంటున్నారు. చేయి తడపకపోతే.. చిన్న చిన్న కారణాలు చూపించి రిజిస్ట్రేషన్లకు కొర్రీలు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లాను నెల్లూరు, గూడూరు జిల్లాలుగా విభజించింది. నెల్లూరు జిల్లా పరిధిలో 9, గూడూరు జిల్లా పరిధిలో 10 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్లతో పాటు భూముల ఈసీలు, డాక్యుమెంట్ల నకళ్లు, జనరల్‌ పవరాఫ్‌ అటారీ్న(జీపీ), వీలునామా, మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ జరుగుతుంటాయి. కానీ ప్రతిదానికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంతో పాటు అదనపు దోపిడీ పక్కాగా జరుగుతోంది. రోజంతా చేసిన వసూళ్లను సాయంత్రానికి అధికారి నుంచి అటెండర్‌ వరకు  స్థాయిని బట్టి మామూళ్ల పంపకం జరుగుతోంది.

నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు 
రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు కాకుండా అడపా దడపా నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు, ప్లాట్లకు కూడా రేటు ఫిక్స్‌ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇటీవల నెల్లూరులో నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబరులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసిన విషయం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో విచారణ జరిపిన అధికారులు వాస్తవాలను నిగ్గు తేల్చి ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది.
కోవూరులో పనిచేసిన సబ్‌ 

రిజిస్ట్రార్లపై చర్యలు?
గతంలో కోవూరులో కూడా నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన విషయంలో ఐదుగురు సబ్‌ రిజిస్ట్రార్లపై ఆరోపణలు రావడంతో విచారణ చేసిన అధికారులు ఏడాది పాటు ఆ నివేదికను తొక్కిపెట్టారు. తాజాగా అవినీతిపై యుద్ధం చేస్తున్న కొత్త ప్రభుత్వం రాకతో అధికారులు విచారణ నివేదికను రెండు రోజుల క్రితమే ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది. ఆ నివేదికపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదుల్లో నాల్గో స్థానం
జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి పెచ్చు మీరిందన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. స్థానికంగా కొందరు ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకుని వసూళ్ల చేయించుకుంటున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14400 కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదులు వెళ్తున్నాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ శాఖపై ఫిర్యాదుల్లో నాలుగో స్థానంలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయగా ఉద్యోగుల పైళ్ల కింద, ప్రైవేట్‌ వ్యక్తులు, డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద అనధికారికంగా రూ.40,110 దొరికింది. గతంలో గూడూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెండు గంటల పాటు సోదాలు చేస్తే దళారుల వద్ద రూ.1,39,150 నగదు దొరికింది. నెల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా ఏసీబీ దాడులు జరిపితే ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి రూ.లక్షల్లో నగదు దొరికిన ఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ శాఖలో మహిళా అధికారురులే  అవినీతిలో టాప్‌లో ఉన్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం ఉండటం కొసమెరుపు. 

రిజిస్ట్రేషన్‌ విలువలో  ఒక శాతం లంచం..
భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్‌లో సబ్‌రిజిస్ట్రార్‌కు మార్కెట్‌ విలువలో ఒక శాతం అదనంగా చెల్లించాలి. గిఫ్ట్‌ డీడ్‌కు అరశాతం, పార్టీషన్‌ (అన్నదమ్ముల భూపంపకాలు)కు అరశాతం వంతున వసూలు చేయడం బహిరంగ సత్యమే. ఉదాహరణకు వంద అంకణాల స్థలం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే.. మార్కెట్‌ విలువ ప్రకారం అంకణం  రూ.12 వేలు వంతున రూ.12 లక్షలకు ఒక శాతం అంటే రూ.12 వేలు సబ్‌ రిజిస్ట్రార్‌కు అనధికారికంగా చెల్లించాలి. దీంతో పాటు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు రూ. లక్షకు రూ.300 వంతున చెల్లించాలి. అలా చేస్తే కానీ సకాలంలో రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. లేదంటే ఎన్నో కొర్రీలు పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ రుసుం (సేల్‌ డీడీ) బ్యాంక్‌ల్లో చెల్లింపులు చేసినా అదనపు వసూళ్లు మాత్రం పక్కాగా ఇవ్వాలి. ఇదంతా డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా లావాదేవీలు జరుపుతారు.  

ఫిర్యాదులొస్తే దాడులు చేస్తాం
ప్రభుత్వ కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులన్నింటిపై మా పరిశీలనకు వస్తాయి. అందులో అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంచుతాం. బాధితులను పీడించే వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేస్తాం. ఏ శాఖపైనా ఫిర్యాదులొస్తే.. వదిలి పెట్టం.  
– సీహెచ్‌ దేవానంద్‌ శాంతో, నెల్లూరు ఏసీబీ డీఎస్పీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement