⇔ లంచాల వసూలులో దిట్ట ఎక్సైజ్ ఏసీ ఆదిశేషు
⇔ స్థలాలు, నగల రూపంలో మామూళ్లు
⇔ ఆపై ఆస్తులుగా మార్పిడి ఏసీబీ విచారణలో వెల్లడి
చేతితో పైసా ముట్టుకోడు.. ఏదైనా బంగారం, స్థలాల రూపంలోనే కావాలంటాడు.. ఆనక వాటిని విక్రయించుకొని ఆస్తులు పోగేస్తుంటాడు.. ఇదీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మామిళ్లపల్లి ఆదిశేషు
అక్రమ వసూళ్లు తీరు. ఏసీబీ అధికారుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. లంచాలు కూడా చేతికి మట్టి అంటకుండా తీసుకుంటున్న అతని నైపుణ్యం వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది.
విజయవాడ సిటీ : మూడు జిల్లాల్లో రూ.80 కోట్ల విలువ చేసే స్థలాలు, భూములు.. బ్యాంక్ లాకర్లలో రూ.2.50 కోట్ల విలువైన కిలోల కొద్దీ బంగారం, వెండి.. వాటిలో పొదిగిన మేలిమి వజ్రాలు.. రెండు రోజుల పాటు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సీఐటీ) అధికారుల దాడుల్లో లభ్యమైన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మామిళ్లపల్లి ఆదిశేషు ఆస్తులివి. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఆస్తులపై బుధ, గురువారాల్లో ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తొలి రోజు ఆస్తులకు సంబంధించిన పత్రాలు దొరకగా.. రెండో రోజు బ్యాంకు లాకర్లలో బంగారు, వెండి నగలు వెలుగు చూశాయి. దాడుల్లో పట్టుబడిన ఆస్తులు, బంగారం కాక మరిన్ని కూడా ఉండొచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎక్సైజ్ ఉద్యోగులు కూడా ఆదిశేషుకు బినామీలుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా వివరాల సేకరణపై ఇప్పటికే దృష్టిపెట్టారు. విధి నిర్వహణలో ఆదిశేషు వ్యవహారశైలిపైనా లోతుగా విచారణ చేస్తున్నారు. ఏసీబీ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఆదిశేషు ఎక్కువగా స్థలాలు, బంగారం రూపంలో లంచాలు తీసుకుంటాడని తెలుస్తోంది.
చక్రం తిప్పడంలో నేర్పరి
ఆబ్కారీ శాఖలో చక్రం తిప్పుతూ పై అధికారుల అడ్డు లేకుండా చూసుకోవడంలో ఆదిశేషు సిద్ధహస్తుడని ఏసీబీ అధికారులు అంటున్నారు. గుంటూరు జిల్లాలో పని చేసిన సమయంలో తన పై అధికారి నియామకం చేయకుండా ఉన్నత స్థాయిలో వ్యూహం నడిపి సఫలీకృతుడైనట్టు చెపుతున్నారు. ప్రయత్నించిన అధికారులకు సైతం అప్రధాన పోస్టులు దక్కేలా చేసి ఎక్సైజ్‌లో తన పట్టును నిరూపించకున్నాడంటూ ఆ శాఖ అధికారులే కొందరు ఏసీబీ అధికారులకు చెప్పడం విశేషం. ఆ సమయంలోనే మద్యం షాపులకు కొత్త లెసైన్స్‌లు మంజూరు చేసినట్టు తెలిసింది. జిల్లాతో నిమిత్తం లేకుండా కీలకమైన ప్రాంతాల్లోనే అతనికి పోస్టింగ్‌లు వేయడాన్ని బట్టి ఎక్సైజ్ శాఖలో అతనికి ఏ స్థాయిలో పట్టు ఉందో తెలుస్తోందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
వారసత్వపు ఆస్తులు కావు
గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు ఆస్తులు తనకు వారసత్వంగా సంక్రమించినట్టు తొలిరోజు దాడి సమయంలో ఆదిశేషు చెప్పడాన్ని ఏసీబీ అధికారులు కొట్టిపారేస్తున్నారు. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెపుతున్నారు. పైగా పలు ఆస్తులు, బ్యాంకు లాకర్లు బినామీ పేర్లతో పెట్టాల్సిన అవసరం ఏముందనేది ఏసీబీ అధికారుల ప్రశ్న. అవన్నీ చట్టవిరుద్ధ మార్గాల్లో వచ్చినవి కాబట్టే బినామీ పేర్లతో పెట్టినట్టు వారు వాదిస్తున్నారు.
సొంత శాఖలో ఏజెంట్లు
ఎక్సైజ్ శాఖలో కొందరు దిగువ స్థాయి ఉద్యోగులు ఆదిశేషుకు కలెక్షన్ ఏజెంట్లుగా ఉన్నట్టు తెలిసింది. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వీరు ఆదిశేషు ఆదేశాల మేరకు మామూళ్లు వసూలు చేస్తుంటారు. ఆపై ఆయన ఆదేశాల మేరకు నగదు లభ్యతను బట్టి బంగారం, స్థలాల రూపంలోకి వీరు మారుస్తుంటారు. ఎక్కువగా బంగారం, వజ్రాల రూపంలోనే మామూళ్ల సొమ్మును మార్చుతుంటాడని ఏసీబీ అధికారుల సమాచారం. ఆ తర్వాత వాటిని బినామీ పేర్లతో తెరచిన లాకర్లలో భద్రపరుస్తున్నట్టు గుర్తించారు. తద్వారా బంగారం రేటు పెరిగినప్పుడు విక్రయించి సొమ్ము చేసుకొని విలువైన స్థలాలు, భూములు కొనుగోలు చేస్తుంటాడు. గురువారం ధనలక్ష్మీ బ్యాంక్ లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని నగలకు సంబంధిత షాపుల నుంచి కొనుగోలు బిల్లులు ఉన్నాయి. అమ్మకం చేసేందుకు నమ్మకం కలిగించే చర్యల్లో భాగంగానే బిల్లులు తీసుకుంటాడని చెపుతున్నారు.
‘కలెక్షన్’ కింగ్!
Published Sat, Jan 23 2016 3:18 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement