‘టూరిజం’ దాబాలు!
- తొలుత సంగారెడ్డి, సిద్దిపేట, జడ్చర్ల శివార్లలో ఏర్పాటు
- ఒక్కో దాబాకు మూడెకరాల చొప్పున స్థలం కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: దాబాలు... హైవేలపై నిత్యం వేలాది మంది వాహనదారులు ఆకలిదప్పికలు తీర్చుకునేందుకు, ప్రయాణ బడలికను కాస్త తగ్గించుకునేందుకు సేదతీరే ప్రాంగణాలు. ప్రయాణికులు కోరుకునే రుచులను సరసమైన ధరల్లో అప్పటికప్పుడు వండి వడ్డించే అన్నపూర్ణాలయాలు. ప్రయాణికులతో కిటకిటలాడుతూ కాసులు రాలుస్తున్న ఈ దాబాలపై రాష్ట్ర పర్యాటక శాఖ దృష్టిసారించింది. సాధారణ దాబాల్లో కల్పించే భోజన సౌకర్యాలకుతోడు అదనపు సేవలతో సొం తంగా దాబాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
వే సైడ్ ఎమినిటీస్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రోడ్లపై వీటిని ఏర్పాటు చేయనుంది. ఇం దుకోసం తొలుత సిద్దిపేట- జనగామ మార్గంలో సిద్దిపేట ఎక్స్ రోడ్డు, సంగారెడ్డి చేరువలోని పోతిరెడ్డిపల్లె కూడలి, జడ్చర్ల ఎక్స్‌రోడ్డులను ఎంపిక చేసింది. త్వరలో ఈ 3 చోట్ల భారీ దాబాలను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా చేపట్టి నిర్మించనుంది. ఒక్కో దాబాకు 3 ఎకరాల చొప్పున స్థలం కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో చర్చించి స్థలాన్ని అప్పగించాల్సిందిగా కోరింది. ఈ స్థలం లో దాబా, షాపింగ్ కాంప్లెక్స్, పిల్లల కోసం ఆటవిడుపు ప్రాంగణం, విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయనుంది. లారీలు, బస్సులు, ఇతర వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ కేంద్రాలను కూడా నిర్మించనుంది.
చెఫ్‌లతో నలభీములకు శిక్షణ...
వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కోరుకునే రుచులకు అనుగుణంగా అన్ని రకాల వంటలు వచ్చిన వారిని దాబాల్లో నియమించాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటళ్లకు చెందిన చెఫ్‌ల వద్ద వంట వారికి శిక్షణ ఇప్పిస్తోంది. ఇప్పటికే ఓ బృందం సిద్ధమైంది. అలాగే నాణ్యమైన వంటకాలతోపాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ దాబాల వల్ల మంచి ఆదాయం ఉంటుందని ఆశిస్తోంది.
స్థానికులకే ఉద్యోగాలు...
ఏ ప్రాంతంలో నిర్మించే దాబాలో అక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వాలని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అధికారులను ఆదేశించారు. దీనివల్ల పర్యాటకాభివృద్ధి సంస్థకు ఆదాయం పెరగటంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు.