dabas
-
దాబాల్లో మద్యం సిట్టింగులు
మద్నూర్(జుక్కల్): మండలంలోని దాబా హోటళ్లలో యథేచ్ఛగా సిట్టింగులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం భోజన సదుపాయాలు మాత్రమే కల్పించాల్సిన దాబా హోటళ్లు యథేచ్ఛగా మద్యం సిట్టింగులు చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూలుగా తీసుకోవడంతో వాటి నిర్వహణ ‘మూడు పెగ్గులు–ఆరు గ్లాసులు’గా వర్ధిల్లుతోంది. మద్నూర్ మండలంలో ఐదు ధాబా హోటళ్ల ఉండగా, బిచ్కుంద మండలంలో మూడు, జుక్కల్ మండలంలో రెండు, పిట్లం మండలంలో నాలుగు హోటళ్లు ఉన్నాయి. ఇవే కాకుండా గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. నివాస ప్రాంతాల్లోనే ఈ బెల్టు షాపులు ఉండడంతో రాత్రి వేళల్లో మందు బాబులు వేసే వీరంగానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాబా హోటళ్లలో కేవలం భోజన సదుపాయం మాత్రమే ఉండాలి. దీనిపై అధికారుల నియంత్రణ కొరవడింది. ఏదైనా సంఘటన జరిగితే హడావుడి చేసే అధికారులు వీటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు. గ్రామాల్లో బెల్టు షాపుల జోరు ధాబా హోటళ్ల పరిస్థితి ఇలా ఉండగా ప్రతి గ్రామంలో బెల్టు షాపులు ఉన్నాయి. ఒక్క మద్నూర్ మండలంలో వందకి వరకు బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. మంచినీళ్లు దొరకని గ్రామాల్లో మద్యం మాత్రం కచ్చితంగా దొరుకుతుంది అనే పరిస్థితి నెలకొందంటే బెల్టు దుకాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటి గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడంలో మిన్నకుండిపోతున్నారు. ఇకవైపు గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పత్రికా ప్రకటనలు ఇస్తున్నా వీటి జోరు మాత్రం తగ్గడం లేదు. దీంతోపాటు మారుమూల గ్రామాల్లో నకిలీ మద్యాన్ని సైతం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అంతే కాకుండా మద్నూర్, జుక్కల్ మండలాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడంతో అక్కడి మద్యం, దేశిదారు అక్రమంగా తరలించి విక్రయిస్తున్న పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. యువకులు బానిసలవుతున్నారు నేటి ఆధునిక యుగంలో యువకులు, విద్యార్థులు మద్యానికి బానిస అవడం చాలా బాధాకరం. యువత చేతుల్లోనే దేశ భవిశత్తు ఆధారపడి ఉంది. యువకులు మద్యానికి బానిస కా కుండా తమ భవిషత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మద్యం తాగడంతో ఆరోగ్యం పూర్తిగా నాశనం అవుతుందని గుర్తించాలి. మద్యం తో వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. –ఈరయప్ప, కోడిచిర ఫ్యాషన్‌గా మారింది.. యువకులకు మద్యం తాగడం ఓ ఫ్యాషన్‌గా మారింది. ఎలాంటి ఫంక్షన్లు, వేడుకలు, కళాశాలలో ఫేర్వెల్ వంటి పార్టీలలో యువకులు మద్యం సేవిస్తున్నారు. మద్యం తాగి విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. గ్రామాల్లోనూ మద్యం దొరుకుతుంది. అధికారులు చర్యలు తీసుకోవా ల్సిన అవసరం ఉంది. –రమణ, మద్నూర్ -
‘టూరిజం’ దాబాలు!
- తొలుత సంగారెడ్డి, సిద్దిపేట, జడ్చర్ల శివార్లలో ఏర్పాటు - ఒక్కో దాబాకు మూడెకరాల చొప్పున స్థలం కేటాయింపు సాక్షి, హైదరాబాద్: దాబాలు... హైవేలపై నిత్యం వేలాది మంది వాహనదారులు ఆకలిదప్పికలు తీర్చుకునేందుకు, ప్రయాణ బడలికను కాస్త తగ్గించుకునేందుకు సేదతీరే ప్రాంగణాలు. ప్రయాణికులు కోరుకునే రుచులను సరసమైన ధరల్లో అప్పటికప్పుడు వండి వడ్డించే అన్నపూర్ణాలయాలు. ప్రయాణికులతో కిటకిటలాడుతూ కాసులు రాలుస్తున్న ఈ దాబాలపై రాష్ట్ర పర్యాటక శాఖ దృష్టిసారించింది. సాధారణ దాబాల్లో కల్పించే భోజన సౌకర్యాలకుతోడు అదనపు సేవలతో సొం తంగా దాబాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వే సైడ్ ఎమినిటీస్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రోడ్లపై వీటిని ఏర్పాటు చేయనుంది. ఇం దుకోసం తొలుత సిద్దిపేట- జనగామ మార్గంలో సిద్దిపేట ఎక్స్ రోడ్డు, సంగారెడ్డి చేరువలోని పోతిరెడ్డిపల్లె కూడలి, జడ్చర్ల ఎక్స్రోడ్డులను ఎంపిక చేసింది. త్వరలో ఈ 3 చోట్ల భారీ దాబాలను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా చేపట్టి నిర్మించనుంది. ఒక్కో దాబాకు 3 ఎకరాల చొప్పున స్థలం కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో చర్చించి స్థలాన్ని అప్పగించాల్సిందిగా కోరింది. ఈ స్థలం లో దాబా, షాపింగ్ కాంప్లెక్స్, పిల్లల కోసం ఆటవిడుపు ప్రాంగణం, విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయనుంది. లారీలు, బస్సులు, ఇతర వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ కేంద్రాలను కూడా నిర్మించనుంది. చెఫ్‌లతో నలభీములకు శిక్షణ... వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కోరుకునే రుచులకు అనుగుణంగా అన్ని రకాల వంటలు వచ్చిన వారిని దాబాల్లో నియమించాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటళ్లకు చెందిన చెఫ్‌ల వద్ద వంట వారికి శిక్షణ ఇప్పిస్తోంది. ఇప్పటికే ఓ బృందం సిద్ధమైంది. అలాగే నాణ్యమైన వంటకాలతోపాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ దాబాల వల్ల మంచి ఆదాయం ఉంటుందని ఆశిస్తోంది. స్థానికులకే ఉద్యోగాలు... ఏ ప్రాంతంలో నిర్మించే దాబాలో అక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వాలని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అధికారులను ఆదేశించారు. దీనివల్ల పర్యాటకాభివృద్ధి సంస్థకు ఆదాయం పెరగటంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. -
దాబారులు
నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్ : దాబాలు బార్లను తలపిస్తున్నాయి. హైవే వెంబడి ఉండే మద్యం దుకాణాల్లో మద్యం తాగడం నిషేధం. అయితే ఇం దుకు విరుద్ధంగా దుకాణదారులు ప్రత్యేకంగా గదులూ ఏర్పాటు చేసి మద్యం తాగడానికి అనుమతిస్తున్నారు. అర్ధరాత్రి అత్యవసర పని మీద రోడ్డు మీదకు వచ్చిన వ్యక్తికి గుక్కెడు తాగునీరు,సేద తీరేందుకు కాసింత తేనీరు దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో మద్యం కావాల్సినంత దొరుకుతుందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. ఏషియన్ హైవే వెంబడి ప్రతి ఏటా దాబాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మద్యం మత్తులో ప్రమాదాలు.. దాబాల్లో మద్యం అందుబాటులో ఉండటంతో సమీప ప్రాంతాల మందుబాబులే కాకుండా వాహనచోదకులు విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారు. బాగా పొద్దుపోయే వరకు మద్యం తాగి ఇంటికి తిరిగి వెళ్లే సమయాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలో గడచిన మూడేళ్లలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 520 మంది మృత్యువాత పడగా, 2 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మద్యం తాగి ప్రమాదాల బారిన పడిన వారేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మద్యం మత్తులో యువత ఘర్షణలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలున్నాయి. దాబాల నిర్వాహకులే ఇరు వర్గాలకు సర్ది చెప్పి రాజీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అధిక శాతం పోలీసు రికార్డులకెక్కడం లేదు. కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా జరిగాయి. రాత్రి 10 గంటలు దాటితే దుకాణాలు మూసివేయాలని హడావుడి చేసే పోలీసులు హైవే వెంబడి ఉండే మద్యం దుకాణాలు, దాబాలపై కనీసం కన్నెత్తైనా చూడడం లేదు. ఆ వ్యాపారులతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు హైవేపై దాబాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో పోలీసులు దాబాలపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత పట్టించుకోవడం మానివేశారు. పోలీసుల హడావుడి తగ్గేంత వరకు దాబాల్లో మద్యం విక్రయాలకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా మళ్లీ మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. నిర్వాహకులపై చర్యలు నిల్ దాబాల్లో మద్యం విక్రయించకూడదు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వీరు దాబా ల వైపు దృష్టి సారించడం లేదు. అడపాదడపా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నా రు. దీంతో దాబాల నిర్వాహకులు విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎస్ రామకృష్ణ దాబాల్లో మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోండి.. లేదంటే మీపై చర్యలు తప్పవు అంటూ పదే పదే సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు రోజులు హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీని వెనక మామూళ్ల మత్తేనన్న ఆరోపణలు ఉన్నాయి.