బౌద్ధ సంగీతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. చిత్రంలో టీఎస్‌టీడీసీ చైర్మన్ భూపతిరెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టు నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమని రాష్ట్ర పురావస్తు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బౌద్ధసంగీతి –2019 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్రంలోని చారిత్రక సంపద పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బౌద్ధమతానికి సంబంధించి దేశంలోనే తొలి సదస్సును ౖహైదరాబాద్‌లో నిర్వహించడం ఎంతో అదృష్టమన్నారు.
రాష్ట్రంలో కోటిలింగాల, ఫణిగిరి, పార్శిగాన్, ధూళికంట, గాజులబండ, తిరుమలగిరి, నేలకొండపల్లి, ఏలేశ్వరం లాంటి ప్రాంతాల్లో బౌద్ధుల చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్నారు.బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బౌద్ధచరిత్ర చాలా గొప్పదన్నారు. శివనాగిరెడ్డి రచించిన తెలంగాణ బుద్ధిజం అనే పుస్తకాన్ని మంత్రి శ్రీనివాసగౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ భూపతిరెడ్డి, టీఎస్‌టీడీసీ ఎండీ డి.మనోహర్, 17 దేశాలకు చెందిన పురావస్తు శాఖ పరిశోధకులు, పురావస్తు శాఖ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమివ్వాలి
బుద్ధిజాన్ని కూడా ఇతర మతాలలాగే చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బౌద్ధాన్ని కేవలం టూరిజం కోణంలోనే చూస్తున్నాయి. అలాకాకుండా కాకుండా ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపడితే బుద్దుడి ఆలోచనలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.
– సద్దారకిత బంతేజ్, బౌద్ధ సన్యాసి
Comments
Please login to add a commentAdd a comment