
నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు
ప్రపంచ సుందరి పోటీదారుల పర్యటన
ఫొటోషూట్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి
నాగార్జునసాగర్: ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు సోమవారం నాగార్జునసాగర్‌లో సందడి చేశారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సోమవారం నిర్వహించిన బుద్ధ పూర్ణిమ వేడుకలకు మిస్ వరల్డ్ ఓసియానా గ్రూప్–4లోని 22 దేశాల సుందరీమణులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్నారు. వారికి పర్యాటక శాఖ, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. విజయవిహార్ వెనుకభాగంలోని పార్కులో ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీపర్వతారామంలోని బుద్ధవనానికి చేరుకున్నారు. ముందుగా బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి పూజలు చేశారు.
మహాస్తూపం వద్ద వీరికి తెలంగాణ గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. 6.42 గంటలకు వారికి శిల్పాలను చూపిస్తూ ఆర్కియాలజిస్టు శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు, తెలంగాణకు బౌద్ధమతంతో గల సంబంధం తదితర అంశాలను వివరించారు. మహాస్తూపంలోని పంచ ధ్యానబుద్ధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు ధ్యానం చేశారు. రాత్రి 7.08 గంటలకు బుద్ధ జయంతి కార్యక్రమాలలో భాగంగా బౌద్ధ భిక్షవులు నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అనంతరం జాతకవనంలో కళాకారులు బుద్ధుడి చరిత్రను తెలియజేసే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డిన్నర్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ.కోటిరెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఐఏఎస్ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీలు రమేశ్, మౌనిక, ఆర్డీఓలు పాల్గొన్నారు.