సాక్షి, హైదరాబాద్: మరో అంతర్జాతీయస్థాయి వేడుకకు నగరం సన్నద్ధమవుతోంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ కైట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు పర్యాటక శాఖ సన్నద్ధమవుతోంది. సాహిత్య అకాడమీతో కలసి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించిన పర్యాటక – భాషా సాంస్కృతిక శాఖలు తాజాగా కైట్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి, సం ప్రదాయాలను ప్రతిబింబించేలా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నా రు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు రోజులపాటు కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి సమయంలో నిర్వహించే పతంగుల ఎగురవేత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వీట్ ఫెస్టివల్, మధ్యాహ్నం 2 గంటలకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. వీటితో పాటు పతంగుల తయారీ, కళాబృందాల నృత్యాలు వంటి కార్యక్రమాలుంటాయి.
దేశంలోని వివిధ నగరాల నుండి కైట్ ప్లేయర్స్ వచ్చి పతంగులు ఎగురవేస్తూ సందడి చేయనున్నారు. గతేడాది 16 దేశాల నుంచి 70 మంది వరకు ప్రతినిధులు పాల్గొనగా ఈసారి మరింత ఎక్కువ దేశాల నుంచి 100 మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. పతంగుల పండుగను యాదాద్రితోపాటు, వరంగల్‌లోనూ నిర్వహించనున్నారు. నగరంలోని పీపుల్స్‌ప్లాజా, శిల్పారామం, ఆగాఖాన్ అకాడమీ, నెక్లెస్‌రోడ్‌లో పతంగుల ఉత్సవాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment