దేవరచర్ల.. తెలంగాణ అరకులోయ | Telangana Araku Valley as devara cherla | Sakshi
Sakshi News home page

దేవరచర్ల.. తెలంగాణ అరకులోయ

Published Fri, Aug 28 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

దేవరచర్ల.. తెలంగాణ అరకులోయ

దేవరచర్ల.. తెలంగాణ అరకులోయ

దేవరకొండ/చందంపేట: అదే ఫీలింగ్.. అదే అబ్బురపాటు.. దేవరచర్ల అందాలపై అధికారులు కూడా ముగ్ధులైపోయారు. వావ్!.. ఇది తెలంగాణ అరకులోయ అంటూ అభివర్ణించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్ల అందాలపై ఇటీవల ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పురావస్తు, పర్యాటకశాఖకు సంబంధించిన అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను, అందాలను తిలకించారు.

పర్యాటకశాఖ పరంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. దీంతోపాటు పురావస్తు శాఖ అధికారులు అక్కడి ఆలయాన్ని, విగ్రహాలను, ఆ కట్టడం తీరును అవగతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవరచర్లకు వచ్చిన పురావస్తు శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు, పర్యాటకశాఖ అధికారి శివాజీ తదితరులు దేవరచర్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను ‘సాక్షి’కి వివరించారు.
 
అధికారుల మనోగతం
‘తెలంగాణలో అరకులోయ అనే ఫీలింగ్ కలిగింది. వందశాతం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గిరిజన సంస్కృతిని, ఆచార సంప్రదాయాలను, ఈ ప్రాంత వైభవాన్ని, విశేషాలను బాహ్య ప్రపంచం తెలుసుకోవాల్సిందే. ఇన్ని రోజులుగా ఇంత మంచి దృశ్యాలు, చరిత్ర మరుగునపడి ఉండడం దురదృష్టకరమని’ అధికారులు అభిప్రాయపడ్డారు. తమ పర్యటనలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

దేవరచర్లలో ఉన్న శివాలయం ముందు మండపం 18 స్తంభాలతో నిర్మించారని, గర్భగుడికి రెండు వైపులా ఉన్న పూర్ణకుంభం ఆధారంగా ఈ ఆలయం 14వ శతాబ్ధం రేచర్ల పద్మనాయక వంశస్థులు నిర్మించినట్లు, దేవరకొండ ఖిల్లాకు ఆలయానికి సంబంధమున్నట్లు పేర్కొన్నారు. దేవరచర్లలో విష్ణు, నంది, వల్లి సుబ్రమణ్యస్వామి, భైరవ, సప్తమాత్రిక విగ్రహాలు ఉన్నట్లు తెలిపారు.

అయితే అక్కడి నుంచి బయల్దేరిన అధికారులు వైజాగ్‌కాలనీ నుంచి వస్తుండగా క్రీ.పూ.1000  - క్రీ.శ.300 నాటి రాకాసి గూళ్లను కృష్ణా తీర పరీవాహక ప్రాంతంలో గుర్తించారు. ఇలాంటి రాకాసి గూళ్లు చాలా అరుదుగా ఉంటాయని అధికారులు వివరించారు. మరో పదిహేను రోజుల్లో ఉన్నతాధికారులతో సహా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంపై మరింత అధ్యయనం చేయనున్నట్లు వారు తెలిపారు.
 
నివేదికలో...
తెలంగాణలో అరకులోయ లాంటి ప్రదేశంగా అధికారులు ఈ ప్రాంతాన్ని అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాల్సిన అవసరాన్ని నివేదికలో పేర్కొంటామన్నారు. దీంతో పాటు రానున్న కృష్ణా పుష్కరాలకు వైజాగ్‌కాలనీ సమీపంలో ఘాట్లు ఏర్పాటు చేసి దేవరచర్ల, వైజాగ్‌కాలనీతో పాటు ఇక్కడ గిరిజన సంస్కృతి ఉన్న గ్రామాలను సందర్శించేలా చర్యలు తీసుకునేందుకు అధికారులకు నివేదికలివ్వనున్నారు. దీంతో పాటు ఎకో టూరిజం, ట్రెక్కింగ్, ట్రైబల్ టూరిజంగా మార్చడానికి ప్రతిపాదనలు పంపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement