Archaeological
-
3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’
కైరో: ఈజిప్ట్‌లో పురాతత్వవేత్త శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతన పట్టణాన్ని గుర్తించారు. 3 వేల సంవత్సరాల క్రితం నాటి ‘లాస్ట్ గోల్డెన్ సిటీ’ అనే పేరుగల నగరాన్ని శాస్త్రవేత్తల బృందం ఈజిప్టుకు దక్షిణాన గల లక్సోర్లో గుర్తించింది. ఈజిప్ట్‌లో గతంలో బయటపడిన టుటన్ఖమాన్ సమాధి తర్వాత ఈ పట్టణం అత్యంత ప్రాముఖ్యత కలిగినది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘లాస్ట్ సిటీ’గా పిలివబడుతన్న ఈ పట్టణం పేరు ఏతెన్. 1391 నుంచి 1353 బీసీ మధ్యకాలంలో పురాతన ఈజిప్ట్‌ని పాలించిన 18 వ రాజవంశానికి చెందిన తొమ్మిదవ రాజు కింగ్ అమెన్హోటెప్ III ఈ నగరాన్ని నిర్మించినట్లు చరిత్ర వెల్లడిస్తుందని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. లక్సోర్ పశ్చిమ ఒడ్డున నిర్మించిన ఈ నగరం ఆ యుగంలో అతిపెద్ద పరిపాలనా, పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్ర వెల్లడిస్తుంది. "ఈ లాస్ట్ సిటీ ఆవిష్కరణ.. టుటన్ఖమాన్ సమాధి తరువాత రెండవ అతి ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ" అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఈజిప్టు ప్రొఫెసర్, ఈ మిషన్ సభ్యుడు అయిన బెట్సీ బ్రయాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిష్కరణ సామ్రాజ్యం సంపన్న స్థితిలో ఉన్నప్పుడు పురాతన ఈజిప్షియన్ల జీవితానికి సంబంధించిన అరుదైన సమాచారాన్ని ఇస్తుంది" అన్నారు బెట్సీ. పురాతన ఈజిప్టును పాలించిన రాజవంశాల గురించి దేశవ్యాప్తంగా సాగుతున్న అధ్యయనంలో ఇటీవల కాలంలో కనుగొన్న పురావస్తు పరిశోధనల శ్రేణిలో ‘‘లాస్ట్ సిటీ’’ ఆవిష్కరణ తాజాది. కరోనా వైరస్ మహమ్మారి, ఇస్లామిస్ట్ మిలిటెంట్ దాడులు, రాజకీయ అస్థిరత వల్ల గత కొద్ది కాలంగా తీవ్ర ఒడిదుడుకులకు గురైన ఈజిప్ట్ పర్యాటక రంగానికి ఇటువంటి ఆవిష్కరణలు పూర్వ వైభవాన్ని తీసుకువస్తాయని.. పర్యాటకులను ఆకర్షిస్తాయని ఈజిప్ట్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక గతంలో చాలా విదేశీ బృందాలు ఈ నగరం కోసం పరిశోధించాయని.. కానీ వారు ఎవరు దీన్నీ గుర్తించలేకపోయారని బెట్సీ తెలిపాడు. ఈ నగరం అమెన్హోటెప్ III కాలం నుంచి ఆయన కుమారుడు, టుటింఖ్మాన్ తండ్రి అమెన్హోటెప్ IV వరకు ఉన్నత స్థితిలో ఉన్నదని చరిత్ర వెల్లడిస్తోంది. నగరం వీధులు ఇళ్ళతో చుట్టుముట్టబడి ఉన్నాయని శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడైన హవాస్ తెలిపాడు. ఈ నగరంలో కొన్ని గోడలు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కింగ్ అమేన్హోటెప్ III ముద్రలను కలిగి ఉన్న వైన్ నాణాలు, ఉంగరాలు, స్కార్బ్‌లు, కుండలు, మట్టి ఇటుకలపై దొరికిన చిత్రలిపి శాసనాల ద్వారా పురావస్తు బృందం ఈ నగరం వర్థిల్లిన కాలాన్ని గుర్తించింది. నగరం దక్షిణ భాగంలో, పురావస్తు శాస్త్రవేత్తలు ఆహారాన్ని నిల్వ చేయడానికి కుండలు, ఓవెన్లు ఉన్న బేకరీతో పాటు పెద్ద వంటగదిని కనుగొన్నారు. ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉన్న జిగ్‌జాగ్ గోడతో కంచె వేయబడిన పరిపాలనా, నివాస జిల్లాను వారు కనుగొన్నారు. ఇది భద్రత కల్పించడానికి ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. మూడవ ప్రాంతంలో ఒక వర్క్‌షాప్ ఉంది. ఆలయం, సమాధులతో పాటు తాయెత్తులు, ఆభరణాలను తయారు చేయడానికి ఉపయోగించే కాస్టింగ్ అచ్చులను బృందం కనుగొంది. "తవ్విన ప్రాంతాలన్నిటిలో, స్పిన్నింగ్, నేత వంటి పారిశ్రామిక కార్యకలాపాలలో ఉపయోగించే అనేక సాధనాలను మా బృందం గుర్తించింది’’ అని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఒక గదిలో రెండు ఆవులు లేదా ఎద్దుల సమాధులు కనుగొన్నారు. మరొక ప్రాంతంలో ఒక వ్యక్తి అవశేషాలు గుర్తించారు. నగరానికి ఉత్తరాన ఒక పెద్ద స్మశానవాటిక, అలాగే రాతి నుంచి కత్తిరించిన సమాధుల సమూహం బయటపడినట్లు వెల్లడించారు. చదవండి: మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు వామ్మో.. మమ్మీల జులుస్.. ఎంత భయంకరంగా ఉందో! -
పంచకూటాలయానికి మోక్షం
⇒ నేడు మొదలు కానున్న పునర్నిర్మాణ పనులు ⇒ పనులు ప్రారంభించాలని ఆదేశించిన మంత్రి చందూలాల్ సాక్షి, హైదరాబాద్: అత్యంత అరుదైన పురాతన పంచకూటాలయానికి ఎట్టకేలకు మంచి రోజులొచ్చాయి. భూపాలపల్లి జిల్లా రామానుజాపూర్లో కాకతీయుల కాలం (13వ శతాబ్దం)లో నిర్మితమై శిథిలమైన పంచకూటాలయం పునర్నిర్మాణ పనులు ఆదివారం మొదలవుతున్నాయి. పురావస్తు శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి చందూలాల్ సొంత ప్రాంతంలో రాజకీయ విభేదాలతో అధికార పక్ష నేతలే దీని పునర్నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో అత్యంత విలువైన శిల్పసంపద మట్టిలో కూరుకుపోయిన తీరును ‘సాక్షి’వెలుగులోకి తేవటంతో దాన్ని పునర్నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కాకతీయుల నాటి అద్భుత కట్టడం.. వెంకటాపురం మండలంలోని రామానుజా పూర్ గ్రామ శివారులో 13వ శతాబ్దంలో కాకతీయులు అద్భుతంగా పంచకూటాలయం నిర్మించారు. ఒకే మండపంలో ఐదు విడివిడి ఆలయాలుంటాయి. ముస్లిం పాలకులు గతంలో ఈ ఆలయాన్ని కొంతమేర ధ్వంసం చేశారు. మిగిలిన ప్రాంతం కూడా సరిగా పట్టించుకోకపోవటంతో కాలక్రమంలో అది కూడా పడిపోయింది. రెండున్నర దశాబ్దాల కింద దాన్ని గ్రామానికి చేరువగా మరోచోట పునర్నిర్మించాలని పురావస్తుశాఖ నిర్ణయించిం ది. ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఆలయ రాళ్లను జాగ్రత్తగా విడదీశారు. అయితే పనులు ప్రారంభం కాలేదు. మూడేళ్ల కింద రూ.కోటి అంచనాతో పనులు చేపట్టాలని నిర్ణయించగా కాంగ్రెస్ నేత ఒకరు తన అధీనంలో ఉన్న గ్రామకంఠం భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. రూ.10లక్షలు వెచ్చించి స్థలాన్ని చదు ను చేసి పనులు మొదలుపెట్టే సమ యంలో అధికారపార్టీ నేతలు ఆ పనులు అడ్డు కున్నారు. కాంగ్రెస్ నేత స్థలంలో నిర్మిస్తే ఆయనకు పేరొస్తుందన్న ఉద్దేశంతో పాటు మంత్రికి ప్రాధాన్యమివ్వకుండా వ్యవహరిం చారని ఈ పనులు ఆపారు. ఇంతజరిగినా మంత్రి పట్టించుకోకపోవడంతో మొదలు కాలేదు. ఆలయం తాలూకు శిల్ప సంపద మట్టికొట్టుకుపోయింది. ఈ వివరాలను సచిత్రంగా ఇటీవల ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. పురావస్తు శాఖను పర్యవేక్షించే మంత్రి ఇలాఖాలోనే ఈ దుస్థితి ఏర్పడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో సమీపంలోనే మరో స్థలాన్ని ఎంపిక చేయించి పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి నిర్ణయించారు. -
నర్మెటలో బయటపడిన మృణ్మయపాత్రలు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట వద్ద పురావస్తుశాఖ అధికారులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో శుక్రవారం మృణ్మయ పాత్రలు బయట పడ్డాయి. ప్రాచీన మాన వుడు ఉపయోగించిన నాలుగు పాత్రలు, ఎరుపురంగు కౌంచ్ తో ఉన్న రెండు శంఖాలు, మట్టిపాత్రలు పెట్టుకునేందుకు రింగ్ స్టాండ్, నలుపురంగు పాత్ర లభించాయి. నక్షత్ర రాశులు, సంవత్సరంలో వచ్చే కాలాలను గుర్తించే విధంగా బండపై చెక్కిన ఆనవాళ్లను గుర్తించారు. పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు మట్టికుండల్లో ఉంచినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మెన్హీర్ వద్ద గుర్తించిన పెద్ద రాతి సమాధి సుమారుగా 40 టన్నుల వరకు బరువు ఉన్నట్లు అంచనా వేశామని అన్నారు -
కాకతీయ వైభవం ‘మట్టి’పాలు!
అక్రమాలకు ‘చిక్కి’పోతున్న మట్టికోటలు నిర్మాణాలకు తరలుతున్న మట్టి పట్టించుకోని అధికారులు సాక్షి, వరంగల్: చారిత్రక ప్రసిద్ధి పొందిన కాకతీయుల కోట భవిష్యత్తు తరాలకు కనిపించకుండా పోతుందా..? ఓరుగల్లును రాజధానిగా చేసుకొన్న కాకతీయుల గురించి.. వారు శత్రుదుర్భేద్యంగా నాడు నిర్మించిన ఏడు వరుసల కోట గురించే పుస్తకాల్లో మాత్రమే చదువుకోగలమా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. అధికారులు మనకెందుకులే అని మిన్నకుండటం.. ఇదే అదనుగా కోటను తవ్వేస్తుండటంతో రానున్న రోజుల్లో కాకతీయుల కోట కాలగర్భంలో కలసి పోనుంది. చారిత్రక నిర్మాణాలను పరిరక్షించి.. భావితరాలకు అందించేందుకు కేంద్రం హృదయ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి కాకతీయుల రాజధానిగా ఉన్న వరంగల్‌ను ఎంపిక చేసింది. చారిత్రక కట్టడాలను పరిరక్షించడం కోసం రూ. కోట్లు కేటాయిస్తోంది. ఈ నిధులతో చారిత్రక కట్టడాల పరిరక్షణ జరగాల్సి ఉంది. అయితే, ఇక్కడ కాకతీయుల ప్రాచీన కట్టడాలను అక్రమార్కులు వదలడం లేదు. నిర్మాణ రంగ అవసరాల కోసం పురాతన కోటలను తవ్వి మట్టి తీసుకెళ్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వ రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్న పలువురు కాంట్రాక్టర్లు సైతం కాకతీయ మట్టి కోటలను పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు రక్షణ కోసం.. ఈ నగరం చుట్టూ అప్పట్లోనే ఏడు వరుసలుగా కోటలు నిర్మించారు. ఒకటి తప్ప మిగతా అన్నింటినీ మట్టితోనే నిర్మిం చారు. ఇపుడీ మట్టికోటలన్నీ దాదాపుగా లేకుండా పోయాయి. కాకతీయుల చారిత్రక కట్టడాలు, శిల్ప సంపదను కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షిస్తోంది. చారిత్రక ప్రదేశాలు, కోటలకు వందమీటర్ల దూరం వరకు నిషేధిత ప్రాంతంగా పరిగణిస్తోంది. కాకతీయుల ప్రధాన రాతికోట చుట్టూ ఉన్న ఇతర కోటలు పురావస్తు శాఖ అధీనంలో లేవు. దీంతో ఇష్టారాజ్యంగా వాటిని తవ్వేస్తున్నారు. వరంగల్(ఓరుగల్లు) నగరం చుట్టూ ఉన్న మామునూరు, బొల్లికుంట, కోట వెంకటాపురం, వంచనగిరి, ధర్మారం, మొగిలిచర్ల, ఆరెపల్లి, పెద్దమ్మగడ్డ, పద్మాక్షీ ఆలయాల ప్రాంతాల మీదుగా అల్లిపురం వరకు ఉన్న మట్టికోటలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. కోటల నిర్మాణం తీరు ఇదీ... రాతికోట: ఓరుగల్లు నగరంతో పాటే ఈ కోటను గ్రానైట్ రాయితో నిర్మించారు. మీటరు పొడవు, మీటరు వెడల్పు, 12 కి.మీ. పొడవుతో ఓరుగల్లు నగరం చుట్టూ ఈ కట్టడం ఉంది. ఈ రాతికోటకు 77 బురుజులను, 4 వైపులా ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారానికి ఎదురుగా అర్ధ చంద్రాకారపు రక్షణ కోట కన్పిస్తుంది. కందకం: రాతికోట చుట్టూ లోతైన కందకం (అగడ్త) ఉంది. ఈ అగడ్తలో అన్ని కాలాల్లోనూ నీరు ఉండేలా నిర్మించారు. కాకతీయులు నిర్మించిన చెరువుల నుంచి నీరు అగడ్తలలోకి, కోట లోపల తోటల్లోకి ప్రవహించేలా ఏర్పాటు చేశారు. శుత్రువుల దాడిని ఎదుర్కునేందుకు అగడ్తలో మొసళ్లను పెంచేవారట. భూమికోట: రాతికోట వెలుపల అగడ్త దాటిన తరువాత మట్టికోటను నిర్మించారు. రాతిగోడకు మట్టికోటకు మధ్య సామాన్య ప్రజల ఇళ్లు ఉండేవట. దీన్నే భూమికోట అనేవారట. 10 మీటర్ల ఎత్తున్న ఈ మట్టికోట ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈ కోట గోడను 12,546 అడుగుల వైశాల్యంతో నిర్మించారు. కంపకోట: మట్టికోట వెలుపల కంపకోట ఉండేది. కంప మొక్కలను నాటి దీన్ని ఏర్పాటు చేశారు. శత్రు సైనికులు ఈ కంపను దాటిరావడంలో కొంత ఆలస్యమవుతుంది. ఈ సమయంలో వాళ్లను నిలువరించడానికి కంపకు నిప్పు పెట్టడం అనే యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించేవారని చరిత్రకారులు చెబుతారు. పుట్టకోట: కంపకోటకు ఆనుకుని పుట్టకోట ఉండేది. పుట్టకోటను మట్టి ఇటుకలతో నిర్మించారని పురావస్తు శాఖ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపకోట, పుట్టకోట ఆనవాళ్లేవీ కనిపించడం లేదు. మట్టికోట: ఇది ఐదు మీటర్ల ఎత్తులో ఉండేది. 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుత వరంగల్ శివారు ప్రాంతాలను చుడుతూ, 8 ద్వారాలతో, చుట్టూ నీటి కందకాలతో దీన్ని నిర్మించారు. కంచుకోట: ఓరుగల్లు కోట మధ్యలో ఏకశిల ఉండేదని, దీని పేరుతోనే ఏకశిలాపురం అని పిలిచేవారని పురావస్తు నిఫుణులు చెబుతున్నారు. కాకతీయుల కోటపై శత్రువుల దండయాత్ర జరిగితే చిట్టచివరిగా రక్షణ స్థావరంగా దీన్ని ఉపయోగించుకునేవారని, దీని కోసం పెద్ద కొండరాయిపై నిర్మాణాలు చేశారని చెబుతారు. ప్రస్తుతం దీని ఆనవాళ్లేవీ కనిపించవు. మా పరిధిలో లేవు: కాకతీయ కోటలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో ఉన్నాయని కేంద్ర పురా వస్తు శాఖ పరిరక్షణ అధికారి ఎం. మల్లేశం చెప్పారు. కోట చుట్టూ ఏడు వరుసల్లో ఉన్న కోటల పరిరక్షణ కోసం ప్రభుత్వాలకు నివేదించామన్నారు. వాటిని తమ పరిధిలోకి ఇవ్వాలని కోరామన్నారు. -
మనకూ ఓ చైనా వాల్!
భూపాలపల్లి జిల్లా మల్లూరు గుట్టపై భారీ కుడ్యం ఐదు కిలోమీటర్ల పొడవునా 10 అడుగుల ఎత్తుతో నిర్మాణం నలు చదరంగా చెక్కిన భారీ రాళ్ల వినియోగం ఇప్పటివరకు వెలుగుచూడని తీరు అది సైక్లోపియన్ తరహా గోడ కావొచ్చంటున్న పురావస్తు నిపుణులు సాక్షి, హైదరాబాద్: చైనా వాల్ తరహాలో మన దేశంలోనూ ఓ భారీ గోడ ఉందన్న సంగతి నాలుగు రోజుల కింద వెలుగు చూసింది. మధ్య ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్–డియోరీ నుంచి చోకీఘడ్ వరకు అడవులు, గుట్టలమీదుగా దాదాపు 80 కిలోమీటర్ల మేర ఆ గోడ విస్తరిం చి ఉంది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ ఓ భారీ గోడ ఉన్న సంగతి తాజాగా వెల్లడైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో గోదావరి తీరంలోని మల్లూరు గుట్టపై దట్టమైన అడవిలో దాదాపు 5 కిలోమీటర్ల మే ర ఈ భారీ కుడ్యం విస్తరించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు స్థానిక గిరిజనులకు మాత్రమే దీని సంగతి తెలియడం గమనార్హం. ఇక్కడ స్థానికంగా పేరుగాంచిన హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 8 కి.మీ. దూరంలో ఈ గోడ మొదలై.. దాదాపు 5 కి.మీ. పొడవునా విస్తరించి ఉంది. పురాతన చారిత్రక ప్రాంతాలను పరిశీలించేందుకు ఇటీ వల నాలుగు రోజుల పాటు పర్యటించిన ‘తెలంగాణ సోషల్ మీడియా ఫోరం’ స భ్యులు దీనిని గుర్తించారు. ఈ మేరకు వివ రాలను బుధవారం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎండీ క్రిస్టీనా చోంగ్తులకు అందజేశారు. ఈ గోడను ఎవరు నిర్మించారో, ఎందుకు కట్టారో, ఏ కాలంలో నిర్మితమైందో ఎక్కడా ప్రస్తావన కనిపింలేదని, దీని సంగతి తేల్చాలని రాష్ట్ర పురావస్తు విభాగాన్ని కోరారు. అవి సైక్లోపియన్ వాల్స్! కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక మిగిలిన సేన బస్తర్‌కు వలస వెళ్లే క్రమంలో కొంతకాలం ఇక్కడ ఉండి ఉంటుందని, ఆ సమయంలో రక్షణ కోసం దీన్ని నిర్మించుకుని ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ దీనిని పురావస్తు నిపుణులు ఖండిస్తున్నారు. దానిని రాష్ట్రకూటుల సమయంలో నిర్మించి ఉంటారని, ఆ సమయంలో ప్రభుత్వ పర్యవేక్షణ లేక స్థానికంగా తమను తాము అధిపతులుగా ప్రకటించుకున్నవారు నిర్మించి ఉంటారని చెబుతున్నారు. అక్రమంగా పన్నుల వసూళ్లు, దోపిడీల వంటివి చేసి రక్షణ కోసం ఈ గోడలు కట్టి ఉంటారని అంటున్నారు. కాకతీయులు బస్తర్‌కు వెళ్లే క్రమంలో వారి వద్ద ధనం లేదని, ఇలాంటి గోడలు నిర్మించే ప్రణాళిక కూడా వారికి లేదని చరిత్ర ఆధారంగా తెలుస్తోందని పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు చెప్పారు. ఇలాంటివి అక్కడక్కడా ఉన్నాయని, ఎలాంటి మిశ్రమ అనుసంధానం లేకుండా రాళ్లు పేర్చి నిర్మించే ఈ గోడలను సైక్లోపియాన్ వాల్స్‌గా పిలుస్తారని తెలిపారు. కాగా తాము పరిశీలించిన పాండవుల గుట్ట, మైలారం గుహలు, దామరవాయి బృహత్ శిలాయుగపు సమాధులు, గన్పూర్ దేవాలయాలు అద్భుత ప్రాంతాలని.. వాటివద్ద వసతులు కల్పిస్తే మంచి పర్యాటక కేంద్రాలుగా మారుతాయని సోషల్ మీడియా ఫోరం సభ్యులు పర్యాటకాభివృద్ధి సంస్థ దృష్టికి తెచ్చారు. భారీ రాళ్లు.. ఎనిమిది దారులు మల్లూరు గుట్టపై ఉన్న ఈ గోడ దాదాపు 10 అడుగుల ఎత్తుతో నిర్మించి ఉంది. కొన్ని చోట్ల మాత్రం శిథిలమై నాలుగైదు అడుగుల ఎత్తుతో ఉంది. నలు చదరంగా చెక్కిన భారీ రాళ్లతో ఈ గోడను నిర్మించారు. రాయికి రాయికి మధ్య ఎలాంటి అనుసంధాన మిశ్రమం వాడలేదు. కేవలం రాయి మీద రాయిని పేర్చి నిర్మించారు. కొన్ని చోట్ల ఆ రాళ్లు మూలలు పదునుగా ఉండేంత కచ్చితంగా చెక్కి ఉండడం గమనార్హం. అయితే ఈ రాళ్లపై ఎలాంటి శాసనాలు, గుర్తులు, చిహ్నాలు, బొమ్మలు లేకపోవడంతో వివరాలు అంతుచిక్కడం లేదు. ఇక ఈ గోడకు ఎనిమిది చోట్ల దారులున్నాయి. అక్కడ తలుపుల్లాంటివేమీ లేకుండా కేవలం రాకపోకలు సాగించేందుకు కొంత ఖాళీ వదిలారు. ఏడాదిలో ముఖచిత్రం మారుతుంది ‘‘ఈ గోడ సహా సోషల్ మీడియా ఫోరం సభ్యులు పేర్కొన్న అంశాలను గుర్తిం చాం. కేంద్రం స్వదేశీ దర్శన్ పథకం కింద ట్రైబల్ సర్క్యూట్‌కు ఇచ్చిన రూ.99 కోట్లతో ప్రణాళిక రూపొందించాం. ఏడాదిలో ఆయా ప్రాంతాల ముఖచిత్రం మారుతుం ది. ఈ గోడ నేపథ్యం తెలుసుకుని దాన్ని కూడా ఇందులో జోడిస్తాం.’’ – పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎండీ క్రిస్టీనా చోంగ్తు -
కొలిమేరు బంగారు కొండపై ఆదిమానవుల ఆనవాళ్లు
తునిరూరల్: తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు బంగారు కొండపై ఆదిమానవుల ఆనవాళ్లను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్థానికుడు సిద్ధార్థ వర్మ అందించిన సమాచారం మేరకు రాష్ట్ర పురావస్తుశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ శాఖ జిల్లా ఏడీ వెంకటరత్నం, టెక్నికల్ అసిస్టెంట్ తిమ్మరాజు, ఔత్సాహిక పరిశోధకుడు డాక్టర్ మెరపల నారాయణరావులు ఎత్తై బంగారు కొండపైనున్న గుహను సోమవారం పరిశీలించారు. విశాలమైన గుహలో జంతువు ఆకారం గల రాయిపై అడవి జంతువు బొమ్మలు (రెడ్ ఆక్రే కుడ్య చిత్రాలు), రాతి పనిముట్లను గుర్తించారు. ఇది క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాలకు పూర్వంనాటి శిలాయుగపు గుహ అని ఏడీ తెలిపారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానన్నారు. -
‘నిలువురాళ్ల’పై తొలగిన అపోహలు
సాక్షి’ కథనానికి అపూర్వ స్పందన ► పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు ► నేడు సీఎంను కలవనున్న పురావస్తుశాఖ అధికారులు కృష్ణా/మాగనూర్: మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలం ముడుమాలలో నిలువురాళ్లపై ఆదివారం ‘ఈ గండ శిలల గుండెల్లో ఖగోళం గుట్టు’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇన్నాళ్లూ ఈ రాళ్లపై ఉన్న అపోహలు, భయాలను ఈ కథనం తొలగించిందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇది దెయ్యాల గడ్డ అని, బంగారు నిక్షేపాలు ఉన్నాయని, దేవతల నివాస ప్రాంతమని చెప్పుకునేవారు. అయితే ఇది వేల ఏళ్ల కిందటే ఏర్పాటైన ‘ఖగోళశాస్త్ర పరిశోధనశాల (ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ)’ అని సాక్షి కథనంలో వివరించింది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు సంవత్సరంపాటు ఈ ప్రాంతంపై అధ్యయనం చేసి 2010లోనే ప్రభుత్వానికి ఓ నివేదికను ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని చారిత్రక సంపద ముడుమాలలో ఉందని పేర్కొన్నారు. అప్పట్నుంచే ఈ నిలువురాళ్ల విషయంపై బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు. ఈ నిలువురాళ్లు దాదాపు 60 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో పొలం యజమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఒకవేళ ఈ భూములను తీసుకుంటే మార్కెట్ ధర ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. సీఎంను కలవనున్న అధికారులు ముడుమాలలో నిలువురాళ్లపై రాష్ర్ట పురావస్తు శాఖ అధికారులు సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నివేదికను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ రాములు నాయక్ తెలిపారు. ముడుమాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిందిగా సీఎంను కోరతానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. నిలువురాళ్ల చారిత్రక నేపథ్యంతో తమ గ్రామానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ముడుమాల సర్పంచ్ ఆశోక్‌గౌడ్ పేర్కొన్నారు. -
టిప్పు తుపాకీ దొరికింది
- ‘సాక్షి’ కథనంతో స్టోర్‌లో గాలించి గుర్తించిన అధికారులు - దుమ్ముకొట్టుకుపోయి వెలిసిపోయిన తుపాకీ - కొన్ని భాగాల్లో తుప్పు పట్టి అధ్వాన స్థితిలో ఉన్న వైనం - తుపాకీ చివరన కనిపించని పులి బొమ్మ - పురావస్తు శాఖ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు సీరియస్ సాక్షి, హైదరాబాద్: దాదాపు 15 ఏళ్లుగా ‘కనిపించ’కుండా పోయిన టిప్పు సుల్తాన్ తుపాకీ దొరికింది! ‘టిప్పు తుపాకీ మాయం’ పేరిట ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో స్పందించిన అధికారులు... పురావస్తు శాఖ స్టోర్‌లో వెతికి ఆ తుపాకీని గుర్తించారు. కానీ అమూల్య చారిత్రక సంపద అయిన ఆ తుపాకీ దుమ్ముకొట్టుకుపోయి, తుప్పుపట్టి అధ్వాన స్థితిలో ఉంది. ఇక టిప్పు సుల్తాన్ తుపాకీ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో.. వెంటనే దానిని ప్రదర్శనకు పెట్టేందుకు వైఎస్సార్ స్టేట్ మ్యూజియం సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు.. అప్పట్లో ప్రదర్శన శాల నుంచి ఈ తుపాకీని తొలగించిన సిబ్బంది దానిని స్టోర్‌లో పడేశారు. తర్వాత అప్పటి అధికారులు, సిబ్బంది పదవీ విరమణ చేయడంతో అంతా దాన్ని మర్చిపోయారు. ఈ అంశాన్ని ‘టిప్పు తుపాకీ మాయం’ పేరిట మూడు రోజుల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు స్టోర్‌లో గాలించి టిప్పు తుపాకీని గుర్తించారు. దానిని ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టేట్ మ్యూజియంలో ఓ గ్యాలరీ ఏర్పాటు చేసి ఈ తుపాకీతోపాటు చారిత్రక ప్రాధాన్యమున్న మరికొన్ని తుపాకులు, ఖడ్గాలు, డాగర్లు, ఇతర యుద్ధ సంబంధ వస్తువులను ప్రదర్శనకు ఉంచనున్నారు. అధికారుల తీరుపై సందేహాలు మ్యూజియంలో ప్రదర్శనకు ఎన్నో పురాతన వస్తువులున్నా.. సందర్శకులు ప్రత్యేకంగా దృష్టి సారించే వాటిలో టిప్పు సుల్తాన్ తుపాకీ ఒకటి. కానీ వేరే వస్తువులను ఏర్పాటు చేసేందుకంటూ అప్పట్లో టిప్పు తుపాకీని తొలగించారు. మరోచోటనైనా ప్రదర్శించకుండా స్టోర్‌లో పడేశారు. తర్వాత కూడా ఎవరూ దాని ఊసెత్తకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’లో కథనం ప్రచురితమయ్యేవరకు ఆ శాఖ మంత్రి కార్యాలయానికి కూడా టిప్పు తుపాకీ గురించిన సమాచారం లేదు. శాఖ ఉన్నతాధికారులకు కూడా మ్యూజియంలో టిప్పు తుపాకీ ఉన్న సంగతి తెలియక పోవడం గమనార్హం. దుమ్ముకొట్టుకుపోయి.. దాదాపు 15 ఏళ్లుగా ‘అదృశ్యం’గా ఉన్న టిప్పు సుల్తాన్ తుపాకీని పురావస్తు శాఖ స్టోర్‌లో దుమ్ము కొట్టుకుపోయిన స్థితిలో గుర్తించారు. దాన్ని భద్రపర్చిన పెట్టెలోంచి బయటకు తీసి శుభ్రపరిచారు. కానీ ఆ తుపాకీ మునుపటి మెరుపును కోల్పోయి ఉంది. కొన్ని చోట్ల తుప్పు పట్టింది కూడా. కనీసం ఈ తుపాకీకి సంబంధించిన చిత్రాలు కూడా లేకపోవడంతో... ఇప్పుడు ఫొటోలు తీసి భద్రపరిచే పని చేస్తున్నారు. అసలు టిప్పు సుల్తాన్ వద్ద అప్పట్లో ఐదు తుపాకులుండేవని చెబుతారు. వాటిని ఆయన వివిధ నమూనాల్లో పులి బొమ్మలు ఉండేలా చేయించారు. పురావస్తు శాఖ వద్ద ఉన్న తుపాకీ చివర (వెనుకవైపు కలపతో చేసిన భాగంపై) కూడా పులి బొమ్మ ఉండేది. కానీ అది దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. త్వరలో నిర్ణయిస్తాం.. ‘‘టిప్పు సుల్తాన్ తుపాకీ లాంటి చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను ప్రజల సందర్శనకు వీలుగా ప్రదర్శనకు ఉంచుతాం. ఆ తుపాకీని ప్రదర్శన నుంచి తొలగించి స్టోర్‌లో పెట్టిన విషయం నేపథ్యం నాకు తెలియదు. త్వరలోనే దాని ప్రదర్శనపై నిర్ణయం తీసుకుంటాం..’’ - పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి -
గణపురం గుళ్లకు పూర్వ వైభవం!
భారీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శ్రీకారం - ఇప్పటికే తొలి ద శ పూర్తి.. రెండో దశ పనుల కోసం శాస్త్రీయ అధ్యయనం - రంగంలోకి ఢిల్లీ,వరంగల్ నిట్ నిపుణులు - ఆపై యునెస్కో గుర్తింపునకు దరఖాస్తు సాక్షి, హైదరాబాద్: ఐదెకరాల ప్రాంగణం.. చుట్టూ మహా ప్రాకారం.. ఓ పక్కన 60 స్తం భాలతో మహా మండపం.. పక్కనే ముఖ మండపం, మహామండపం, అర్ధ మండపాలతో కూడిన అద్భుత శిల్పరీతితో అలరారే గణపేశ్వర దేవాలయం.. చుట్టూ మరో 21 ఆలయాలు.. ప్రతీ గోడపై అత్యద్భుతమైన శిల్ప సౌందర్యం.. వెరసి అదో ఆధ్యాత్మిక ప్రపంచం.. యావత్తు తెలంగాణలో ఇలాంటి ఆలయాల సమూహం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో.. ఇదీ వరంగల్ జిల్లా గణపురంలోని గణపేశ్వరాలయం (కోట గుళ్లు) ప్రాంగణ సొగసు. 13వ శతాబ్దంలో నిర్మితమై.. కులీకుతుబ్‌షాహీల హయాంలో ఔరంగజేబుల దాడులతో ధ్వంసమైన ఈ ఆలయం తిరిగి అప్పటి శోభను సంతరించుకోనుంది. ఇప్పటికే తొలి దశ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి మలిదశ కోసం కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం వరంగల్‌లోని నిట్ ఇంజనీర్లు, ఢిల్లీకి చెందిన పురావస్తు సాంకేతిక నిపుణులు అధ్యయనం ప్రారంభించారు. వారి నివేదిక ఆధారంగా త్వరలోనే జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గుళ్లను పునరుద్ధరించే భారీ ప్రాజె క్టు కార్యరూపం దాల్చనుంది. దీనికి దగ్గర్లో ఉన్న రామప్ప దేవాలయంతో కలిపి ‘యునెస్కో’ వారసత్వ హోదా కోసం దరఖాస్తు చేయాలని పురావస్తు శాఖ యోచిస్తోంది. ‘శాండ్ బాక్స్’ పరిజ్ఞానం కాకతీయ రాజైన గణపతి చక్రవర్తి హయాంలో 13 శతాబ్దంలో ఈ మహా ఆలయాల సమూహం నిర్మితమైంది. భూకంపాలను తట్టుకునేలా పునాదుల్లో ‘శాండ్ బాక్స్’ (మూడు మీటర్ల మందంతో ఇసుకను నింపటం) టెక్నాలజీని ఉపయోగించారు. అనంతర కాలంలో ఢిల్లీ నుంచి ఔరంగజేబు ఉలూఫ్ఖాన్ను పురామాయించి ఈ ఆలయాలను ధ్వంసం చేయించారు. కాలక్రమంలో దిగువన ఉన్న ఇసుక 10 శాతం మేర బయటికి వెళ్లిపోయింది. దీంతో ఖాళీ ఏర్పడి ఆలయాలు కుంగిపోయాయి. ఇలాగే కొనసాగితే కొద్ది కాలంలోనే ఉన్న సంపద కూడా పూర్తిగా నేలమట్టం కావడం ఖాయం. ఇప్పుడేం చేస్తారు? గట్టిపడ్డ పునాది ఎంత బరువును ఆపగలుగుతుంది.. పైన ఆలయ పునరుద్ధరణకు అవలంబించాల్సిన పద్ధతులు.. ఆలయ రాళ్ల పటుత్వం, అక్కడి నేల స్వభావం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నీళ్లు వచ్చి ఆలయ పునాదుల్లోకి చేరకుండా చేయాల్సిన పనులు.. అక్కడి వాతావరణం.. వంటి అంశాలపై నిపుణులు పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తారు. పునరుద్ధరణకు దాదాపు రూ.10 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సింగరేణి, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం వంటి ఇతర సంస్థల సాయాన్ని కూడా కోరనున్నారు. ఈలోపు అందుబాటులో ఉన్న రూ.2 కోట్లతో పనులు మొదలుపెట్టనున్నారు. ► పునాదుల్లోకి అవసరమైన ఇసుకను నింపి, దానిపై పురాతన పద్ధతిలో రాతి కట్టడాన్ని పేరుస్తారు. రాళ్ల మధ్య బాండింగ్‌కు స్టీలు పట్టీలు, రాళ్ల మధ్య రంధ్రాలు చేసి స్టీలు వైరుతో కదలకుండా చేస్తారు. ►ఆలయం చుట్టూ పచ్చిక బయళ్లు, పర్యాటకుల విడిది కేంద్రాలు నిర్మించి దక్షిణ భారత్‌లోనే దీన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రణాళికలు రచిస్తున్నారు. రామప్ప దేవాలయం, రామప్ప, లక్నవరం చెరువులతో దీన్ని ఒకే ప్రాంగణంగా మార్చాలని భావిస్తున్నారు. తొలి దశలో ఏం చేశారంటే.. ఈ గుళ్లను పునరుద్ధరించేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం నుంచి వచ్చిన రూ.3 కోట్ల సీఎఫ్ఏ నిధులతో ఈ ఏడాది ప్రారంభంలో పనులు చేశారు. తొలుత ప్రధాన ఆలయం పునాదుల చుట్టూ, ప్రదక్షిణ పదం, పై భాగంలో బోరు యంత్రంతో 6 మీటర్ల మేర 340 రంధ్రాలు చేసి ఎయిర్ కంప్రెషర్ల ద్వారా సున్నం పేస్ట్‌ను లోపలికి పంపారు. అది పునాదుల్లోకి చేరి అక్కడ మిగిలిన ఇసుక వెలుపలికి రాకుండా గట్టిపడేలా చేసింది. దీంతో పునాదులు పటిష్టంగా మారాయి. -
కోటగడ్డను సందర్శించిన పురావస్తుశాఖ అధికారులు
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి సీతాన గర్ కోటగడ్డ తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలను, ఆలయ స్తంభాలను పురావస్తుశాఖ సహాయ సంచాలకులు పి.నాగరాజు, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులు ఎస్.హరగోపాల్ సోమవారం సందర్శించారు. మట్టిగడ్డ తవ్వకాల్లో బయటపడ్డ కాలభైరవుడి(నాగబైరవుని) విగ్రహంతో పాటు రాతి స్తంభాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఈ స్థలంలో తవ్వకాలు జరిపితే మరిన్నిదేవాలయాలు, చారిత్రక సంపద బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ స్థలాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భువనగిరి ఖిలాకు అనుబంధంగా ఉన్న కోటగడ్డలో భువనేశ్వరీమాతకు సంబంధించిన ఆలయం బయటపడే అవకాశం ఉందని ఎస్.హరగోపాల్ చెప్పారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, డీఈ ప్రసాదరావు, కోటపరిరక్షణ కమిటీ సభ్యులు సద్ది వెంకట్‌రెడ్డి, బండారుజయశ్రీ ఉన్నారు. -
కోహినూర్‌పై వివరాలు అందించలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యల సమాచారాన్ని అందించలేమని కేంద్రం పేర్కొంది. లండన్‌లోని బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుపై ప్రభుత్వం ఈ అభిప్రాయం వెల్లడించింది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున ఎటువంటి సమాచారాన్ని అందించలేమని పురావస్తు శాఖ పేర్కొంది. -
నల్లగొండలో బృహత్ యుగకాల సమాధులు
ఆత్మకూర్ (ఎస్) మండలంలో వెలుగు చూసిన వైనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: చారిత్రక ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లాలో పురాతన యుగం నాటి సమాధులు మరోసారి బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 200 సం వత్సరాల వరకు బృహత్ యుగకాలం. నాటి సమాధులను పురావస్తు శాఖ అధికారులు ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్, కందగట్లల్లో వెలికి తీశారు. నెమ్మికల్‌లో 3-4 ఎకరాల విస్తీర్ణంలో 25 వరకు ఇవి ఉన్నాయని పురావస్తుశాఖ చెబుతోంది. ఇదీ సమాధుల చరిత్ర: ఈ సమాధులను బృహత్ కాలయుగ సమాధులని అంటారు. నాటి ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ఈ సమాధుల్లో మనుషులను పాతిపెట్టేవారు. ఆత్మలుంటాయని నమ్మే ఆ రోజుల్లో ఆ ఆత్మలకు ఆహారం పెట్టడం తోపాటు ఆత్మలు బయటకు రాకుండా ఉండేందుకు, జంతువులు ఆ పార్ధివదేహాలను తినకుండా ఉండేందుకు పెద్ద బండరాళ్లతో ఆ సమాధులను ఏర్పాటు చేశారు. కాగా, సూర్యాపేట సమీపంలోని నెమ్మికల్, కందగట్లలో జరిపిన తవ్వకాల్లో నాటి సమాధులు బయటకు వచ్చాయి. -
16 ఏళ్లకే పురాతత్వ శాస్త్రవేత్త
లక్నో: అర్ష్ అలీ.. వయస్సుకే 16 ఏళ్ల కుర్రాడు. కానీ, పురావస్తు శాస్త్రం గురించిన విషయాలపై అతనో వికీపీడియా. పురావస్తు విభాగంలో పనిచేసే పిన్న వయస్కుడిగా పేరొందాడు. నాలుగేళ్ల ప్రాయంలోనే అలహాబాద్ వర్సిటీ విద్యార్థులకు చరిత్రను బోధించారు. పురావస్తు శాఖ ప్రోత్సాహంతో అనేక ప్రాంతాలు సందర్శించారు. ఎన్నో చరిత్ర పుస్తకాల్ని చదవడమే కాకుండా వాటి గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పురాతన ఈజిప్షియన్ గుర్తులతో రూపొందిన చిత్రలేఖనంలో డిగ్రీ సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సబ్జెక్ట్‌లో ప్రావీణ్యులైన వారు 200 మంది మాత్రమే ఉన్నారు. -
తవ్వకాల్లో వెలుగుచూసిన బౌద్ధ అవశేషాలు
విశాఖ జిల్లా మాడుగుల మండలం వొమ్మల పంచాయతీ పరిధిలోని ఉర్లోవకొండ సమీపంలో బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పది మంది సభ్యుల బృందం ఇక్కడ రెండు రోజులుగా తవ్వకాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఓ రెండు అడుగుల విగ్రహం, చిన్న చిన్న రాళ్లు, పాత్రలు లభ్యమైనట్టు పురావస్తు శాఖ ఏడీ చిట్టిబాబు తెలిపారు. సుమారు 5 మీటర్ల లోతు తవ్వకాలు జరపగా, మరో 20 మీటర్ల మేర తవ్వకాలు జరపనున్నట్టు ఆయన చెప్పారు. -
తవ్వకాల్లో 800 మంది చిన్నారుల మృతదేహాలు
లండన్ పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో విస్మయకర విషయాలు బయటపడుతున్నాయి. తవ్వకాల్లో ఒకటి కాదు...రెండు కాదు.. ఏకంగా 800 మంది చిన్నారుల మృత దేహాలు బయట పడ్డాయి. ప్రస్తుతం బ్లాక్ బర్న్ పట్టణంలో వెలుగు చూసిన అస్థిపంజరాలను పరిశీలించి అక్కడి ప్రజల జీవన పరిమాణాలపై అధ్యయనాలు చేపట్టిన ఆ శాఖ ఎన్నో విషయాలను వెల్లడించింది. ఒకప్పుడు ఆ ప్రాంతం పారిశ్రామిక వాడగా ఉండేదని, అక్కడి ప్రజలు... ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఊపిరితుత్తుల సమస్యలతో మరణించినట్లు సర్వే చెప్తోంది. లండన్ లాంక్ షైర్ లోని బ్లాక్ బర్న్ పట్టణంలో రహదారి నిర్మాణం కోసం పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో 800 మంది చిన్నారుల మృత దేహాలు బయట పడటం ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తోంది. 1821 లో సెయింట్ పీటర్స్ శ్మశాన వాటికగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 1,967 మృత దేహాలను వెలికి తీశారు. వీరిలో ఎక్కువ శాతం చిన్నారుల మృత దేహాలు ఉండటమే కాదు... వీరంతా ఆరేళ్ళ లోపు వయసువారే అయి ఉండటం విశేషం. పారిశుద్ధ్య లోపం, మందులు లేకపోవడంతోనే కాక, అధికశాతం ఇన్ఫెక్షన్లతో కూడ వీరంతా చనిపోయినట్లు శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. 1860 నాటికి ఈ స్మశాన వాటిక అత్యధిక వినియోగంతో 30 శాతం శరీరాలను అప్పట్లోనే సమాధులనుంచి బయటకు తీసినట్లు బ్లాక్బర్న్ ప్రతినిధి దార్వెన్... బోరో కౌన్సిల్ కు తెలిపారు. అస్థిపంజరాలపై పూర్తి విశ్లేషణ ప్రారంభించామని, బయటకు తీసిన పిల్లల మరణాలు ఎక్కువ శాతం ఊపిరితిత్తుల సమస్యలతోనే సంభవించినట్లు తెలుస్తోందని హెడ్ ల్యాండ్ ఆర్కియాలజీ కి చెందిన ఎముకల అధ్యయన నిపుణుడు డేవ్ హెండర్సన్ చెప్పారు. అయితే వారంతా చిన్నవయసులోనే మరణించడం వల్ల అస్థిపంజరాల ద్వారా ఎక్కువ వివరాలు తెలియడం లేదన్నారు. పారిశ్రామిక మిల్లులకు కేంద్రమైన ఆ పట్టణంలో జనాభా అతి వేగంగా అభివృద్ధి చెందడంతోనే అప్పట్లో ఆ ప్రాంతం ఎంతో రద్దీగా ఉండేదని, దీంతో అక్కడివారికి కాలుష్యం కారణంగా ఇన్ఫెక్షన్ల సమస్య వచ్చి ఉండొచ్చని ఊహిస్తున్నారు. లండన్ వెలుపల సాధారణ ప్రజల జీవితాలపై ఇంతకు ముందే భారీ అధ్యయనాలు జరిగాయని దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ అధ్యయనాలు చేపడుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ చనిపోయినవారి స్మారకార్థం ఏర్పాటు చేసిన శిలాఫలాకాల్లో సుమారు 176 ఫలకాలను పరిశీలించగా... వీటిపై ఉన్న వివరాలను బట్టి ఇక్కడివారిలో ఎక్కువశాతం మంది అమ్మాయిలు ఎలిజబెత్, మేరీ.... అబ్బాయిలు థామస్, జాన్ పేర్లు కలిగి ఉన్నట్లు తెలిసింది. ఈ తవ్వకాల్లో బయటపడిన సుమారు 16 నాణేలు కూడ ఆ కాలంలో చెలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాధుల్లోని ఓ శరీరం వివరాలను బట్టి అతడు క్రిమీన్ వార్ లో గాయపడి చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ పూడ్చిపెట్టిన పిల్లల చేతులు, కాళ్ళకు అప్పట్లో చౌకగా లభించే ఇత్తడి, గాజు ఆభరణాలు ఉన్నాయని పురావస్తు మేనేజర్ జూలీ ఫ్రాంక్లిన్ తెలిపారు. 1945 వరకూ కూడ ఈ శ్మశాన వాటికలో కొందరు కుటుంబాలకోసం ముందే స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వివరాలను బట్టి తెలుస్తోంది. 1500 మంది కూర్చునేందుకు వీలుగా ఉండే ఇక్కడి సెయింట్ పీటర్స్ చర్చ్ 20 వ శతాబ్ద కాలంలో శిథిలావస్థకు చేరింది. దీంతో 1976 ప్రాంతంలో దీన్నినేలమట్టం చేశారు. అయితే ఈ వేసవి నాటికి స్మారక సేవను తిరిగి ప్రారంభిస్తామని, అప్పటివరకూ శవ ఖననాలు శ్మశానవాటికలోని మరోభాగంలో జరుగుతాయని బ్లాక్బర్న్ బిషప్ చెప్తున్నారు. ప్రస్తుతం ఫ్రెక్లెటన్ స్ట్రీట్ లింక్ రోడ్ నిర్మాణం కోసం కౌన్సిల్ అధికారి ఆధ్వర్యంలో పురావస్తు తవ్వకాల్లో భాగంగా ఈ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. -
11.1 లక్షల ఏళ్లనాటి ఏనుగు అస్థిపంజరం గుర్తింపు
లాహోర్: ప్రస్తుత భారీ సైజు ఏనుగులకు రెండు రెట్లు ఉన్న 11.1 లక్షల ఏళ్ల కిందటి ఏనుగు అస్థిపంజరాన్ని పాకిస్తాన్లో గుర్తించారు. పంజాబ్ ప్రావిన్సులోని గుజ్రత్ జిల్లాలో పాకిస్తాన్ యూనివర్సిటీ పరిశోధకులు జరుపుతున్న తవ్వకాల్లో ఇది బయటపడింది. పబ్బిహిల్స్ ప్రాంతంలో ఏడాదిన్నరగా జరుపుతున్న తవ్వకాల్లో గత వారం ఈ ఆడ ఏనుగు అస్థిపంజరం బయటపడిందని పంజాబ్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ సయ్యద్ అబ్బాస్ తెలిపారు. ఇది సుమారు 120 కిలోల బరువు, 38 సెం.మీ. పొడవు, 28 సెం.మీ వెడల్పు ఉన్నట్లు చెప్పారు. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లలో ఉండే ఏనుగుల జాతికి చెందినదని వెల్లడించారు. ఆ కాలం నాటి ఏనుగుల గురించి తెలుసుకునేందుకు ఈ అస్థి పంజరం ఉపయోగపడుతుందని చెప్పారు. -
దేవరచర్ల.. తెలంగాణ అరకులోయ
దేవరకొండ/చందంపేట: అదే ఫీలింగ్.. అదే అబ్బురపాటు.. దేవరచర్ల అందాలపై అధికారులు కూడా ముగ్ధులైపోయారు. వావ్!.. ఇది తెలంగాణ అరకులోయ అంటూ అభివర్ణించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్ల అందాలపై ఇటీవల ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పురావస్తు, పర్యాటకశాఖకు సంబంధించిన అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను, అందాలను తిలకించారు. పర్యాటకశాఖ పరంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. దీంతోపాటు పురావస్తు శాఖ అధికారులు అక్కడి ఆలయాన్ని, విగ్రహాలను, ఆ కట్టడం తీరును అవగతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవరచర్లకు వచ్చిన పురావస్తు శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు, పర్యాటకశాఖ అధికారి శివాజీ తదితరులు దేవరచర్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను ‘సాక్షి’కి వివరించారు. అధికారుల మనోగతం ‘తెలంగాణలో అరకులోయ అనే ఫీలింగ్ కలిగింది. వందశాతం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గిరిజన సంస్కృతిని, ఆచార సంప్రదాయాలను, ఈ ప్రాంత వైభవాన్ని, విశేషాలను బాహ్య ప్రపంచం తెలుసుకోవాల్సిందే. ఇన్ని రోజులుగా ఇంత మంచి దృశ్యాలు, చరిత్ర మరుగునపడి ఉండడం దురదృష్టకరమని’ అధికారులు అభిప్రాయపడ్డారు. తమ పర్యటనలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. దేవరచర్లలో ఉన్న శివాలయం ముందు మండపం 18 స్తంభాలతో నిర్మించారని, గర్భగుడికి రెండు వైపులా ఉన్న పూర్ణకుంభం ఆధారంగా ఈ ఆలయం 14వ శతాబ్ధం రేచర్ల పద్మనాయక వంశస్థులు నిర్మించినట్లు, దేవరకొండ ఖిల్లాకు ఆలయానికి సంబంధమున్నట్లు పేర్కొన్నారు. దేవరచర్లలో విష్ణు, నంది, వల్లి సుబ్రమణ్యస్వామి, భైరవ, సప్తమాత్రిక విగ్రహాలు ఉన్నట్లు తెలిపారు. అయితే అక్కడి నుంచి బయల్దేరిన అధికారులు వైజాగ్‌కాలనీ నుంచి వస్తుండగా క్రీ.పూ.1000 - క్రీ.శ.300 నాటి రాకాసి గూళ్లను కృష్ణా తీర పరీవాహక ప్రాంతంలో గుర్తించారు. ఇలాంటి రాకాసి గూళ్లు చాలా అరుదుగా ఉంటాయని అధికారులు వివరించారు. మరో పదిహేను రోజుల్లో ఉన్నతాధికారులతో సహా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంపై మరింత అధ్యయనం చేయనున్నట్లు వారు తెలిపారు. నివేదికలో... తెలంగాణలో అరకులోయ లాంటి ప్రదేశంగా అధికారులు ఈ ప్రాంతాన్ని అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాల్సిన అవసరాన్ని నివేదికలో పేర్కొంటామన్నారు. దీంతో పాటు రానున్న కృష్ణా పుష్కరాలకు వైజాగ్‌కాలనీ సమీపంలో ఘాట్లు ఏర్పాటు చేసి దేవరచర్ల, వైజాగ్కాలనీతో పాటు ఇక్కడ గిరిజన సంస్కృతి ఉన్న గ్రామాలను సందర్శించేలా చర్యలు తీసుకునేందుకు అధికారులకు నివేదికలివ్వనున్నారు. దీంతో పాటు ఎకో టూరిజం, ట్రెక్కింగ్, ట్రైబల్ టూరిజంగా మార్చడానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. -
3 వేల ఏళ్లనాడే ఇనుము వినియోగం
పుల్లూర్‌లో కొనసాగుతున్న తవ్వకాలు సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మం డలం పుల్లూర్ శివారులో కొనసాగిస్తున్న తవ్వకాల్లో శనివారం పలు రకాల పనిముట్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు చేపడుతున్న విషయం విదితమే. సూక్ష్మరాతి, ఉలి లాంటి పనిముట్లు, మృణ్మయ పాత్రలు వెలుగుచూశాయి. సూక్ష్మరాతి పనిముట్లతో పక్షులను, జంతువులను వేటాడటానికి, ఉలిని బండలను పగులగొట్టడానికి వినియోగించినట్లు పురావస్తు శాఖ సాంకేతిక సహాయకుడు టి. ప్రేమ్‌కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తిలు పేర్కొంటున్నారు. బయట పడుతున్న పనిముట్ల ఆధారంగా చూస్తే.. 3వేల సంవత్సరాల నాడే ఇనుమును వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు.